పశు బీమాకు పాతర

ABN , First Publish Date - 2022-12-09T00:07:10+05:30 IST

రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించే వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది.

పశు బీమాకు పాతర

- లంపిస్కిన్‌ వ్యాధితో ఆందోళన

- పథకాన్ని కొనసాగించాలని డిమాండ్‌

- జిల్లాలో 3.18లక్షల పశువులు

కామారెడ్డి, డిసెంబరు 8: రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించే వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. రైతులు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమలను కొనసాగిస్తే ఆర్థికంగా ఆసరాగా ఉంటుంది. ప్రభుత్వం రైతులకు అనుబంధ రంగాలకు చేయూత నందిస్తామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. నాలుగు సంవత్సరాలుగా పశు బీమా నిలిపివేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పాడి పశువులకు రైతు వాటా ప్రీమియం చెల్లిస్తే ప్రభుత్వం కొంత నగదును కలిపి బీమా సౌకర్యం కల్పించేది. దీంతో మృత్యువాత పడిన పశువులకు బీమాతో రైతులు పశువులను కొనుగోలు చే సుకుని భరోసాగా ఉండేది. పథకం నిలిచిపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.

నాలుగేళ్లుగా నిలిచిన పథకం

పాడి పశువుల పథకం 2017-18 వరకు ప్రభుత్వం అమలు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగేళ్లుగా ఈ పథకాన్ని పట్టించుకోవడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు పాడి పరిశ్రమ ఎంతగానో దోహదపడుతుంది. పశువులు రోడ్డు ప్రమాదాలు, విద్యుత్‌ ప్రమాదాలు అనారోగ్యం కారణంగా మృత్యువాత పడుతున్నాయి. మేలు జాతి పాడి పశువులకు లక్షల్లో డిమాండ్‌ ఉంది. అనివార్య కారణాలతో పశువులు మృతి చెందితే రైతులు పూర్తిస్థాయిలో నష్టపోయి అప్పుల్లో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం బీమా పథకాన్ని పునరుద్ధరించి పాడి రైతులను ఆదుకోవాలి.

లంపిస్కిన్‌ వ్యాధితో ఆందోళన

ఇటీవల కాలంలో ఆవులకు లంపిస్కిన్‌ వ్యాధి కారణంగా ఆవులు, ఎద్దులు మృత్యువాత పడుతున్నాయి. కొత్త వైరస్‌కు ప్రభుత్వం ముందస్తు వ్యాక్సిన్‌ వేసినప్పటికీ వ్యాధి సోకుతోంది. దీంతో ఆవులు, ఎద్దుల్లో వ్యాధి సోకి మృత్యువాత పడుతున్నాయి. వైరస్‌ కారణంగా ఎన్ని మందులు వాడినా తగ్గుముఖం పట్టకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వం పంపిణీ చేసిన వాటికి మాత్రమే..

జిల్లాలోని 22 మండలాల్లో 3,01,895 ఆవులు, గేదెలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఎక్కువమంది రైతులు పాడి పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారు. పాల వ్యాపారంతో కుటుంబ పోషణను సాగిస్తున్నారు. వ్యవసాయం చేస్తున్న రైతులు తప్పనిసరిగా పశుపోషణను కొనసాగిస్తున్నారు. అయితే వీటికి ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో బీమా వర్తింపజేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. రాష్ట్రప్రభుత్వం మహిళ సంఘాలకు, ఎస్సీ కార్పొరేషన్‌ లబ్ధిదారులకు అందించిన పశువులకు మాత్రమే బీమా సౌకర్యం కల్పిస్తోంది. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న యూనిట్‌ ధరలోనే పశువులకు బీమా ప్రీమియం చెల్లిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పంపిణీ చేసిన పశువులకు బీమా సౌకర్యం ఉండి రైతులు కొనుగోలు చేసుకున్న పశువులకు బీమా సౌకర్యం ఎత్తివేయడం సరికాదనే వాదనలు వస్తున్నాయి. ప్రైవేట్‌ బీమా కంపెనీలను ఆశ్రయించి పశువులకు బీమా చేయించాలంటే సుమారు లక్ష రూపాయలు ఉన్న పశువుకు రూ.7 నుంచి 8 వేలు ఖర్చు అవుతోంది.

Updated Date - 2022-12-09T00:07:15+05:30 IST