అన్నీ ఖాళీలే!

ABN , First Publish Date - 2022-12-09T00:42:17+05:30 IST

జిల్లాలో వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంచినా సిబ్బందిని మాత్రం భర్తీ చేయలేదు. వంద పడకల ఆసుపత్రులకు ఇప్పటి వరకు కొత్త రిక్రూట్‌మెంట్‌ చేపట్టలేదు. రోజురోజుకూ రోగులు సంఖ్య పెరుగుతుండడంతో ఉన్న సిబ్బందితో వైద్యసేవలను అందించేందుకు ఇబ్బంది పడుతున్నారు.

అన్నీ ఖాళీలే!

జిల్లాలోని వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో అన్ని ఖాళీలే

అప్‌గ్రేడ్‌ చేసి ఏళ్లు గడుస్తున్నా.. నేటికీ భర్తీకాని పోస్టులు

జిల్లా పీహెచ్‌సీల పరిధిలోనూ అదే పరిస్థితి

కొత్త రిక్రూట్‌మెంట్‌ కోసం ఎదురుచూస్తున్న అధికారులు

నిజామాబాద్‌, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంచినా సిబ్బందిని మాత్రం భర్తీ చేయలేదు. వంద పడకల ఆసుపత్రులకు ఇప్పటి వరకు కొత్త రిక్రూట్‌మెంట్‌ చేపట్టలేదు. రోజురోజుకూ రోగులు సంఖ్య పెరుగుతుండడంతో ఉన్న సిబ్బందితో వైద్యసేవలను అందించేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రులను అప్‌గ్రేడ్‌ చేసి సంవత్సరాలు దాటినా ఇప్పటి వరకు పోస్టులు భర్తీకాకపోవడం వల్ల రోగులకు సరైన వైద్యసేవలు అందడంలేదు. ప్రసవాల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తున్నా ఇతర సేవలకు మాత్రం తగినంత వైద్యులు, సిబ్బంది లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉన్నసిబ్బంది మీదనే పనిభారం పెరగడం వల్ల లక్ష్యాలను చేరుకునేందుకు సిబ్బంది సతమతమవుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న రిక్రూట్‌మెంట్‌లోనైనా కొత్త వైద్యులను కేటాయిస్తే జిల్లాలోని రోగులకు ఈ ఆసుపత్రుల పరిధిలో మెరుగైన వైద్య సేవలు అంద నున్నాయి.

నాలుగేళ్లు దాటినా

జిల్లాలోని బోధన్‌ ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా మార్చారు. వైద్య విధాన పరిషత్‌ పరిధిలో ఉన్న ఈ ఆసుపత్రిలో వంద పడకలకు పెంచారు. జిల్లా ఆసుపత్రిగా మారి నాలుగేళ్లు దాటినా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో సిబ్బంది నియామకం చేపట్టలేదు. కొత్త సిబ్బందిని భర్తీ చేయలేదు. జిల్లా ఆసుపత్రిగా మారిన ఈ ఆసుపత్రిలో మొత్తం 109 మంది సిబ్బంది అవసరం ఉంది. ప్రస్తుతం 71 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వీరిలో కీలకమైన వైద్యులు, నర్సింగ్‌, ఇత ర సిబ్బంది పోస్టుల ఖాళీలు ఉన్నాయి. పారామెడికల్‌ సిబ్బంది ఖాళీలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆసుపత్రిలో డివిజన్‌ పరిధిలోని రోగులు వైద్యం కోసం ప్రతిరోజూ వస్తారు. వీరితో పాటు మహారాష్ట్రలోని రోగులు కూడా చికిత్స పొందుతున్నారు. ఈ ఆసుపత్రుల్లో ప్రసవాలతో పాటు ఇతర వైద్య సేవలను కూడా అందిస్తున్నారు. కీలకమైన సమయంలో సిబ్బంది లేకపోవడం వల్ల కొన్నికేసులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి పంపిస్తున్నారు. జిల్లా మంత్రి, జడ్పీ చైర్మన్‌తో పాటు అధికారులు పలుమార్లు సమీక్షించినా పోస్టులు మాత్రం ఇప్పటి వరకు భర్తీచేయలేదు. ఇదే పరిస్థితి ఆర్మూర్‌ ఆసుపత్రిలోనూ ఉంది. ఈ ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్‌కు మూడేళ్ల క్రితమే మార్చారు. సిబ్బందిని మాత్రం ఇవ్వలేదు. పీహెచ్‌సీ పరిధిలో ఉన్న 31 మంది సిబ్బందే ఇప్పటికీ పనిచేస్తున్నారు. కొత్త సిబ్బంది నియమించలేదు. వంద పడకల ఆసుపత్రికి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం 120 పోస్టులను భర్తీకూడా అనుమతులను మంజూరు చేసింది. వైద్యులు, నర్సింగ్‌, పారామెడికల్‌ సిబ్బందితో పాటు నాల్గవ తరగతి సిబ్బంది నియామకం కోసం ఆర్థికశాఖ అనుమతులు ఇచ్చింది. ఇప్పటి వరకు భర్తీ చేపట్టలేదు. ఈ ఆసుపత్రులలో ప్రసవాలు ప్రతి నెలా ఎక్కువగా జరుగుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ మంత్రితో పాటు అధికారులు కూడా భర్తీకి అనుమతులు ఇచ్చిన ఇప్పటి వరకు మాత్రం చేయలేదు. కీలక చికిత్సల కోసం వచ్చే వారు అక్కడ చేసే పరిస్థితి లేకపోవడం వల్ల జిల్లా కేంద్రానికి తరలివస్తున్నారు. ఈ రెండు ఆసుపత్రులేకాకుండా ఈ మధ్యనే ఆరు పీహెచ్‌సీలను వైద్య విధాన పరిషత్‌లోకి తీసుకువచ్చారు. నవీపేట, వర్ని, డిచ్‌పల్లి, ధర్పల్లి, మోర్తాడ్‌, బాల్కొండ ఆసుపత్రులను వైద్య విధాన పరిషత్‌లో చేర్చారు. పడకల సంఖ్య కూడా పెంచారు. స్టాఫ్‌ మాత్రం భర్తీచేయడంలేదు. ఈ ఆసుపత్రుల్లో కూడా రెగ్యులర్‌తో పాటు కాంట్రాక్ట్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఆసుపత్రులన్నింటినీ అప్‌గ్రేడ్‌ చేస్తున్న ప్రభుత్వం వెంటనే మౌలిక వసతులను కల్పించడంతో పాటు తగిన సిబ్బందిని నియమిస్తే మెరుగైన వైద్య సేవలు రోగులకు అందనున్నాయి. సిబ్బంది లేకపోవడం వల్ల కొన్ని రకాల కేసులను జిల్లా జనరల్‌ ఆ సుపత్రికి పంపిస్తున్నారు. దగ్గరగా ఉన్న ఆసుపత్రుల్లో ఈ సేవలన్నీ అందితే మెరుగైన ఫలితాలు ఉండే అవ కాశం ఉన్న సిబ్బందిని మాత్రం భర్తీచేయడం లేదు.

పీహెచ్‌సీలనూ ఇదే పరిస్థితి..

జిల్లాలోని పీహెచ్‌సీలనూ ఇదే పరిస్థితి ఉంది. జిల్లాలో 32 పీహెచ్‌సీలకు ఆరు వైద్య విధాన పరిషత్‌లోకి వెళ్లగా అర్బన్‌, గ్రామీణ పీహెచ్‌సీలు పనిచేస్తున్నాయి. వీటి పరిధిలో 70 వరకు వైద్యులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం కాంట్రాక్ట్‌, రెగ్యులర్‌ కలిపి 30 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఈ ఆసుపత్రుల్లో నర్సింగ్‌, పారామెడికల్‌ సిబ్బంది కొరత ఉంది. కొన్ని ఆసుపత్రుల్లో ఒకే డాక్టర్‌ పనిచేస్తున్నారు. ఆసుపత్రుల్లో పరికరాలు ఉన్నా సిబ్బంది లేకపోవడం వల్ల పరీక్షల కోసం ఇతర ఆసుపత్రులకు పంపిస్తున్నారు. వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రులతో పాటు వీటిలో ఖాళీలను భర్తీచేస్తే జిల్లా రోగులకు మెరుగైన వైద్యం అందనుంది.

రిక్రూట్‌మెంట్‌ కోసం ఎదురుచూపులు

జిల్లాలోని వైద్య విధాన పరిషత్‌, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కొత్త రిక్రూట్‌మెంట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యనే రిక్రూట్‌మెంట్‌ కొనసాగుతున్నందున వైద్యులతో పాటు సిబ్బంది వస్తారని భావిస్తున్నారు. భారీ ఎత్తున సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్స్‌, మెడికల్‌ ఆఫీసర్‌లను రిక్రూట్‌చేస్తున్నందున ఈ నెల చివరిలోపు వారు చేరే అవకాశం ఉన్నట్లు అధికారుల సమాచారం బట్టి తెలుస్తోంది. రాష్ట్రస్థాయిలో రిక్రూట్‌మెంట్‌ జరుగుతున్నందున జిల్లాలో ఖాళీలకు అనుగుణంగా వైద్యులను నియమిస్తే వచ్చే సంవత్సరంలోనైనా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ఈ రెండు పరిధిలో ఆసుపత్రుల్లో కొత్త రిక్రూట్‌మెంట్‌ ద్వారా పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం తెలిపారు. ఉన్న సిబ్బందితోనే మెరుగైన ఫలితాలు అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Updated Date - 2022-12-09T00:42:20+05:30 IST