దళితబంధు వేగవంతం
ABN , First Publish Date - 2022-03-17T04:53:33+05:30 IST
జిల్లాలో దళిత బంఽధు పథకం వేగంగా కొనసాగుతోంది. ఈ పథకంకు సంబంధించి ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసిన అధికార యంత్రాంగం యూనిట్ల గ్రౌండింగ్‌పై కసరత్తు చేస్తున్నారు.

- లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి
- యూనిట్ల గ్రౌండింగ్‌కు కసరత్తు
- ట్రాన్స్పోర్ట్ వాహనాలకే మొగ్గు చూపుతున్న లబ్ధిదారులు
- పథకంపై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
- జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో 350 యూనిట్లు
కామారెడ్డి, మార్చి 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో దళిత బంఽధు పథకం వేగంగా కొనసాగుతోంది. ఈ పథకంకు సంబంధించి ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసిన అధికార యంత్రాంగం యూనిట్ల గ్రౌండింగ్‌పై కసరత్తు చేస్తున్నారు. ఎంపికైన లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లపై అవగాహన శిక్షణను ఎస్సీ కార్పోరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. జిల్లాలో లబ్ధిదారులు ఎక్కువగా ట్రాన్స్‌ఫోర్ట్ వాహనాలకే మొగ్గు చూపుతున్నారని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ స్థానిక ఎమ్మెల్యేలే నిర్వహించి అధికార యంత్రాంగానికి ఇప్పటికే సమర్పించారు. దీంతో ఆయా నియోజకవర్గాల వారీగా దళిత బంధు లబ్ధిదారులకు అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో మొత్తం 350 మంది దళితులను ఈ పథకానికి ఎంపిక చేశారు.
నియోజకవర్గానికి 100 మంది చొప్పున ఎంపిక
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి 100 మంది చొప్పున దళిత బంధుకు దళితులను ఎంపిక చేసి ఆర్థిక సహాయం అందజేసేందుకు నిర్ణయించింది. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలతో పాటు బాన్సువాడ నియోజకవర్గంలోనూ లబ్ధిదారుల ఎంపికపై నిమగ్నమయ్యారు. అయితే ఈ ఎంపిక ప్రక్రియను స్థానిక ఎమ్మెల్యేలకే ప్రభుత్వం అప్పగించింది. జిల్లాలో ఇప్పటికే లబ్ధిదారుల ఎంపికను ఎమ్మెల్యేలు చేపట్టి ఆ జాబితాను అధికార యంత్రాంగానికి అప్పగించారు. కామారెడ్డి నియోజకవర్గంలోని 7 మండలాల పరిధిలో ఆయా గ్రామాల్లో 100 మందిని, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 7 మండలాల్లో 100 మంది, జుక్కల్ నియోజకవర్గంలోని 6 మండలాల పరిధిలో 100 మందిని, బాన్సువాడ నియోజకవర్గంలో 3 మండలాల్లో 50 మంది చొప్పున మొత్తం 350 మంది జాబితాను సిద్ధం చేశారు. ఎంపికైన వారికి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేయనున్నారు. బ్యాంక్ ఖాతాలో రూ.9.90 లక్షలు జమ చేసి మిగతా రూ.10 వేలను దళిత రక్షణ నిధికి కేటాయించనున్నారు.
లబ్ధిదారులకు నియోజకవర్గాల వారీగా అవగాహనలు
జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాలలో దళితబంధు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయింది. అయితే నియోజకవర్గాల వారిగా లబ్ధిదారులకు పథకంపై అవగాహన కల్పిస్తున్నారు. ఎంపిక ప్రక్రియ కన్న ముందు జిల్లా కలెక్టరేట్లో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖమంత్రి ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులైన గంప గోవర్ధన్, హన్మంత్‌షిండే, జాజాల సురేందర్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. పథకంలోని యూనిట్ల ఎంపికపై లబ్ధిదారులకు ఈ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎలాంటి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయో సూచిస్తూ లబ్ధిదారుల ఆలోచనకు అనుగుణంగా యునిట్లను ఎంపిక చేయనున్నారు. జిల్లాలో ఎక్కువ మంది లబ్ధిదారులు రవాణా వాహనాలు, పాడి గేదెల వైపు మొగ్గు చూపినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
అందరికీ ఒకేసారి అందించే అవకాశం
నియోజకవర్గానికి వంద మంది చొప్పున దళితబంఽధు లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసిన అధికారులు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలు తెరిచారు. ఇదే సమయంలో యూనిట్ల గురించి అవగాహన సదస్సు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండు నియోజకవర్గాల పరిధిలో సదస్సులు పూర్తి చేశారు. అయితే చాలా మంది లబ్ధిదారులు రవాణా వాహనాలను కోరుతుండడంతో అధికారులు ఇతర యూనిట్ల గురించి అవగాహన కల్పిస్తున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో వంద కుటుంబాల చొప్పున 300 కుటుంబాలకు అలాగే బాన్సువాడ నియోజకవర్గంలో 50 కుటుంబాలకు కలిపి ఒకేసారి యూనిట్లను అందజేయనున్నట్లు తెలుస్తోంది.
నిజాంసాగర్‌లో కొనసాగుతున్న సర్వే
రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధును ప్రవేశ పెట్టినప్పుడు జిల్లాలో మొట్టమొదటి సారిగా ఎస్సీ రిజర్వుడ్ అయిన జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. ఈ మండలంలో దళిత కుటుంబాలు 1,648 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే దళితబంధు పథకం కోసం నిజాంసాగర్ మండలంలో అన్ని కుటుంబాలకు యూనిట్లను మంజూరు చేసేందుకు అధికారులు సర్వే మొదలు పెట్టారు. అయితే ఈ మండలంలో ఎన్ని దళిత కుటుంబాలు ఉన్నాయనే దానిపై క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మండలంలో పథకం కోసం లబ్ధిదారులకు నిధులను సైతం ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. సర్వే పూర్తి కాగానే మండలంలోని దళితలందరికీ పథకం కింద రూ.10లక్షల చొప్పున అందజేయనున్నారు.