వణికిపోతున్న డోంగ్లీ

ABN , First Publish Date - 2022-12-10T00:30:38+05:30 IST

జిల్లాలో చలిపులి పంజా విసురుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.

వణికిపోతున్న డోంగ్లీ
కామారెడ్డిలో కురుస్తున్న మంచు

- డోంగ్లీలో 5.9 అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు

- 16 గ్రామాల్లో ఆరెంజ్‌ జోన్‌.. ఈ గ్రామాల్లో 10 డిగ్రీల కంటే తక్కువే ఉష్ణోగ్రతలు

- జిల్లా వ్యాప్తంగా 11.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతల నమోదు

- చెలరేగుతున్న చల్లటి ఇదురు గాలులు

కామారెడ్డి, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలో చలిపులి పంజా విసురుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. జిల్లాలోని మద్నూర్‌ మండలం డోంగ్లీలో రికార్డుస్థాయిలో 5.9డిగ్రీల అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగత్రలు నమోదయ్యాయంటే చలి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జిలావ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 11.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. చలికి తోడు చల్లటి ఇదురుగాలులు వీస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రిపూటనే కాకుండా పగటి సమయంలోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలతో పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. చలి భారీ నుంచి రక్షించుకునేందుకు స్వెటర్లు, మంకీ క్యాప్‌లు ధరించి బయటకు వస్తున్నారు.

డోంగ్లీలో 5.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

జిల్లా వ్యాప్తంగా 11.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మద్నూర్‌ మండలం డోంగ్లీలో 5.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఈ సీజన్‌లో ఇదే మొదటిసారి. 16 ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ప్రాంతాలను ఆరెంజ్‌ జోన్‌గా అధికారులు ప్రకటించారు. బొమ్మన దేవునిపల్లిలో 8.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, నస్రూల్లాబాద్‌, బీర్కూర్‌, జుక్కల్‌ ప్రాంతాల్లో 8.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు, లచ్చంపేటలో 8.5, మేనూరులో, బిచ్కుందలో 8.8, పుల్కల్‌లో 9.1, లింగంపేటలో 9.6, నాగిరెడ్డిపేట, ఇసాయిపేటలో 9.7, కొల్లుర్‌లో, భిక్కనూరు, మాచాపూర్‌, రామలక్ష్మణపల్లిలో 9.8 డిగ్రీల అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోవడం, చల్లటి గాలులు వీస్తుండడంతో ప్రజలు చలి తీవ్రతకు ఇబ్బందులు పడుతున్నారు.

అమాంతంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

జిల్లా పరిధిలో గత 10 రోజుల కిందట నుంచి సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతూ వచ్చాయి. రెండు రోజుల వ్యవధిలోనే గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు అమాంతంగా పడిపోయాయి. వారం రోజుల కిందట కనిష్ఠ ఉష్ణోగ్రత 16.5 డిగ్రీల సెల్సియస్‌ నమోదు కాగా శుక్రవారం 11.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతకు పడిపోయింది. దీంతో చలి తీవ్రత అధికమైంది. తెల్లవారు జామున పనులు చేసుకునేవారు చలిని తట్టుకోలేకపోతున్నారు. మున్సిపల్‌ కార్మికులు, ఇతర కూలీలు విఽధులు నిర్వహిస్తుంటారు. మంచుతో ఉండడంతో తమ పనులు చేసుకోవడానికి వారు అవస్థలు పడుతున్నారు. కూలీనాలి చేసుకునే కార్మికులు జీవనోపాధి కోసం రాత్రిళ్లు వాచ్‌మెన్‌ విధులు నిర్వహించే వారు మంట వేసుకుంటున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన రహదారుల వెంటే చలిమంటలు కాసుకుంటున్నారు. చీకటి పడగానే భారీగా మంచు కురుస్తోంది. వాహనాలు సైతం మంచులో తడిసి ముద్దవుతున్నాయి.

Updated Date - 2022-12-10T00:30:41+05:30 IST