నిమ్స్‌కు కొత్త డైరెక్టర్‌!

ABN , First Publish Date - 2022-09-08T10:04:40+05:30 IST

నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌)కు కొత్త డైరెక్టర్‌ను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

నిమ్స్‌కు కొత్త డైరెక్టర్‌!

గుండెపోటుతో అపోలోలో చేరిన ప్రస్తుత డైరెక్టర్‌ మనోహర్‌ 


హైదరాబాద్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌)కు కొత్త డైరెక్టర్‌ను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త డైరెక్టర్‌ ఎంపిక కోసం సెర్చ్‌ కమిటీ వేసినట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. సెర్చ్‌ కమిటీ నివేదిక తర్వాత నిమ్స్‌కు కొత్త డైరెక్టర్‌ను నియమించనున్నారు. ప్రస్తుత డైరెక్టర్‌ డాక్టర్‌ మనోహర్‌ నాలుగు రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యారు. హైదర్‌గూడలో ఆయన నివాసం ఉంటున్నారు. గుండెపోటు రాగానే సన్నిహితులు ఆయన్ను ఇంటి సమీపంలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్‌ మనోహర్‌ భార్య, పిల్లలంతా విదేశాల్లో ఉంటున్నారు. ఆయనొక్కరే హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నిమ్స్‌ డైరెక్టర్‌గా కొనసాగలేనని ఆయన ప్రభుత్వానికి తెలిపినట్లు సమాచారం. డాక్టర్‌ మనోహర్‌ 2015 ఆగస్టు 28న నిమ్స్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 1985లో నిమ్స్‌ డైరెక్టర్‌ పదవిని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇంత సుదీర్ఘ కాలం డైరెక్టర్‌గా పనిచేసినవారెవ్వరూ లేరు! ప్రస్తుత డైరెక్టర్‌ను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆ పోస్టు కోసం పలువురు ప్రయత్నిస్తున్నారు. నిమ్స్‌ డీన్‌గా ఉన్న డాక్టర్‌ రామ మూర్తి, మెడికల్‌ సూపరింటెండెంట్‌ సత్యనారాయణ, కార్డియాక్‌ సర్జన్‌ డాక్టర్‌ ఆర్వీ కుమార్‌, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్‌ బీరప్ప నిమ్స్‌ డైరెక్టర్‌ రేసులో ఉన్నట్లు వైద్యవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత వైద్య విద్య సంచాలకుడు డాక్టర్‌ రమేశ్‌ రెడ్డి పేరు కూడా నిమ్స్‌ డైరెక్టర్‌ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కూడా డీఎంఈగా సుదీర్ఘకాలంగా పనిజేస్తున్నారు.  

Read more