కేసీఆర్‌ పీఎం కావాలంటూ కోడి.. క్వార్టర్‌ మందు!

ABN , First Publish Date - 2022-10-05T09:50:36+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పార్టీని ప్రకటించబోతున్న వేళ వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ నాయకుడు రాజనాల శ్రీహరి వినూత్న కార్యక్రమం నిర్వహించారు.

కేసీఆర్‌ పీఎం కావాలంటూ కోడి.. క్వార్టర్‌ మందు!

వరంగల్‌లో హమాలీ కార్మికులకు పంపిణీ చేసిన టీఆర్‌ఎస్‌ నాయకుడు

మట్టెవాడ (వరంగల్‌), అక్టోబరు 3: ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పార్టీని ప్రకటించబోతున్న వేళ వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ నాయకుడు రాజనాల శ్రీహరి వినూత్న కార్యక్రమం నిర్వహించారు. దసరా పండుగ రోజునే కేసీఆర్‌ జాతీయ పార్టీని పెట్టనుండడంతో సందర్భానికి తగినట్టుగా శ్రీహరిహమాలీ కార్మికులకు ఓ బాయిలర్‌ కోడి, క్వార్టర్‌ ఐబీ విస్కీ బాటిల్‌ చొప్పున ఉచితంగా పంపిణీ చేశారు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. వరంగల్‌ చౌరస్తాలో కేసీఆర్‌, కేటీఆర్‌ కటౌట్‌లను ఏర్పాటు చేసి దాదాపు 200 మందికి హమాలీలకు ఒక్కొక్కరికి ఒక్కో కోడి, క్వార్టర్‌ మందు ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ జాతీయ పార్టీగా  రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని, కేసీఆర్‌ ప్రధాని కావాలని, కేటీఆర్‌ సీఎం కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. తెలంగాణలో దసరా అంటే విందూ వినోదాల సమ్మేళనమని, మందు, మాంసం లేకుండా పండుగ జరగదన్నారు. అందుకే ఆ ఖర్చును భరించే స్థోమత లేని హమాలీలకు తాను సొంత డబ్బులతో కోడి, క్వార్టర్‌ మందు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఇదిలావుండగా శ్రీహరి నిర్వహించిన కార్యక్రమంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మందు బాటిళ్లను బహిరంగంగా పంపిణీ చేయడం తగదని పలువురు వ్యాఖ్యానించగా, కిలోన్నర కోడి, క్వార్టర్‌ ఐబీ బాటిల్‌ అందుకున్న హమాలీలు మాత్రం శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో సుదీర్ఘకాలం కాంగ్రె్‌సలో కొనసాగిన శ్రీహరి 2018 ఎన్నికలకు ముందు టీఆర్‌ఎ్‌సలో చేరారు. వినూత్న నిరసనలు, కార్యక్రమాలతో వరంగల్‌లో తొలి నుంచీ ఆయన విభిన్నమైన నాయకుడిగా పేరుపొందారు. కాంగ్రెస్‌ హయాంలో ‘శాప్‌’ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. 

Read more