మునుగోడును మోసం చేసే కుట్ర

ABN , First Publish Date - 2022-08-15T09:29:26+05:30 IST

మునుగోడు ప్రజలను మోసం చేయడానికి బీజేపీ, టీఆర్‌ఎస్‌ మరోసారి కుటిల యత్నాలు చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

మునుగోడును మోసం చేసే కుట్ర

సమస్యలపై మాట్లాడకుండా వ్యక్తిగత దూషణలా?.. ఆ రెండు పార్టీలూ వాగ్దానాలను నెరవేర్చలేదు: రేవంత్‌


కమ్యూనిస్టులను, కోదండరామ్‌ను కలుపుకొని పోదామని శ్రేణులకు పిలుపు

హైదరాబాద్‌,ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ప్రజలను మోసం చేయడానికి బీజేపీ, టీఆర్‌ఎస్‌ మరోసారి కుటిల యత్నాలు చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా వ్యక్తిగత దూషణలు, వివాదాలు సృష్టిస్తూ రెండు పార్టీలు రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. బీజేపీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటీ నెరవేర్చలేదని ఆరోపించారు. విదేశీ బ్యాంకుల్లో దాచివుంచిన నల్లదనాన్ని తెచ్చి ప్రతి పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని మోదీ హామీ ఇచ్చి విస్మరించారని విమర్శించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రధాని మోదీ.. ఆ మాట ప్రకారం 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందన్నారు.. రాష్ట్రంలో డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇల్లు ఇస్తామని, దళితులకు మూడెకరాల వ్యవసాయ భూమి ఇస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీలు గుప్పించి టీఆర్‌ఎస్‌ ఆధికారంలోకి వచ్చిందని.. వీటిలో ఏ ఒక్క హామీని అమలు చేయలేకపోయిందని రేవంత్‌ ఆరోపించారు.


మునుగోడులో ఓటు అడిగే హక్కు టీఆర్‌ఎ్‌సకు లేదన్నారు. ప్రజల పక్షాన ఈ రెండు పార్టీలను ప్రశ్నించే హక్కు కాంగ్రె్‌సకు ఉందని స్పష్టం చేశారు. ప్రశ్నించే గొంతుకగా కాంగ్రెస్‌ పార్టీ పక్షాన ప్రజలంతా  నిలబడాలని కోరారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం రావాల్సిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్‌, ట్రిపుల్‌ ఐటీ, జాతీయ హోదా సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, గిరిజన యూనివర్సిటీ గురించి టీఆర్‌ఎస్‌ కేంద్రంపై ఎందుకు  పోరాటం చెయ్యడం లేదని కాంగ్రెస్‌ శ్రేణులు నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్‌ ప్రకటించిన హామీల అమలుకోసం పోరాటం చేయాలని,  బీజేపీ వైఫల్యాలు ఎండగట్టాలని సూచించారు. కమ్యూనిస్టులను, కోదండరామ్‌ను కలుపుకొని పోరాడుదామని ఆయన కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు సూచించారు. మునుగోడు ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించి ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ, టీఆర్‌ఎ్‌సలకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. కాగా  తెలంగాణ ప్రజలకు రేవంత్‌ వజ్రోత్సవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2022-08-15T09:29:26+05:30 IST