అంతా హైదరాబాద్‌కు.. సీఎం మాత్రం హస్తినకు!

ABN , First Publish Date - 2022-04-05T07:18:58+05:30 IST

హైదరాబాద్‌ ఐటీ రాజధాని మాత్రమే కాదు.. ఆరోగ్య రాజధాని కూడా! కంటికి ఎల్వీ ప్రసాద్‌..

అంతా హైదరాబాద్‌కు.. సీఎం మాత్రం హస్తినకు!

  • వైద్య పరీక్షలకు తరచూ ఢిల్లీ వెళుతున్న కేసీఆర్‌
  • కంటి పరీక్ష అయినా.. పంటి పరీక్ష అయినా అక్కడే
  • ఆరోగ్య రాజధానిని వదిలి అక్కడికి వెళ్లడంపై విమర్శలు
  • దేశ విదేశాల నుంచి హైదరాబాద్‌కు పెద్దఎత్తున రోగులు
  • ఊపిరితిత్తుల మార్పిడి వంటి క్లిష్టమైన సర్జరీలూ ఇక్కడే
  • కొడుకును 2సార్లు ఎల్వీ ప్రసాద్‌కు తీసుకొచ్చిన ప్రియాంక
  • చిన్న చిన్న పరీక్షలకూ సీఎం ఢిల్లీ వెళ్లడంపై విమర్శలు


కేసీఆర్‌కు పంటి చికిత్స

సీఎం కేసీఆర్‌కు సోమవారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో పంటి చికిత్స జరిగింది. ఆయన పన్నుకు ఒకదానికి ఇన్‌ఫెక్షన్‌ రావడంతో దానిని తొలగించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దంత చికిత్స కోసమే ఆయన ఢిల్లీ వచ్చారని, పన్ను తొలగించిన తర్వాత ఆయన చికిత్స తీసుకుంటున్నారని ఈ వర్గాలు తెలిపాయి.


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ ఐటీ రాజధాని మాత్రమే కాదు.. ఆరోగ్య రాజధాని కూడా! కంటికి ఎల్వీ ప్రసాద్‌.. కడుపునకు ఏషియన్‌.. గుండెకు కేర్‌, అపోలో, స్టార్‌! కొన్ని ఒక్కో విభాగంలో స్పెషల్‌! యశోదా వంటి మరికొన్ని మల్టీ స్పెషాలిటీ! అందుకే, దేశ విదేశాల నుంచి వైద్య చికిత్సల కోసం ఇక్కడికి తరలి వస్తున్నారు! క్లిష్టమైన శస్త్ర చికిత్సలు, వైద్య చికిత్సలు చేయించుకోవాలంటే అందరి బాట హైదరాబాద్‌కే! శ్రీలంక వంటి దేశాల నుంచి ఎయిర్‌ అంబులెన్స్‌ల్లో వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు! ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల నుంచి వచ్చి ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్నారు. ఢిల్లీ నుంచి ప్రియాంక గాంధీ రెండు సార్లు తన కుమారుడిని తీసుకొచ్చి మరీ హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రిలో కంటి పరీక్షలు చేయించారు! దేశ విదేశాల నుంచి వైద్య చికిత్సల కోసం హైదరాబాద్‌కు వచ్చే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది కూడా. కానీ, చిన్నపాటి అస్వస్థతకు గురైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌ హస్తినకు వెళ్లడం పరిపాటిగా మారింది. కంటి పరీక్షలైనా.. పంటి పరీక్షలైనా ఢిల్లీలోనే! ఈ నేపథ్యంలోనే, ఆరోగ్య రాజధానిగా అత్యాధునిక సేవలు అందిస్తున్న హైదరాబాద్‌ను పక్కనపెట్టి వైద్య చికిత్సలకు సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లడం విమర్శలకు తావిస్తోంది. అంతా హైదరాబాద్‌ వస్తుంటే.. సీఎం కేసీఆర్‌ మాత్రం హస్తినకు వెళ్లడం ఏమిటన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.


కంటి శస్త్ర చికిత్స కోసం గతంలో పలుమార్లు సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. శస్త్ర చికిత్స కూడా ఆయన అక్కడే చేయించుకున్నారు. అప్పట్లోనే హైదరాబాద్‌ను వదిలి ఆయన ఢిల్లీకి వెళ్లడం ఏమిటన్న విమర్శలు వచ్చాయి. ఇటీవల తన సతీమణి శోభను కూడా వైద్య పరీక్షల నిమిత్తం అక్కడికే తీసుకెళ్లారు. తాజాగా ఆదివారం సాయంత్రం మరోమారు ఆయన వైద్య పరీక్షల నిమిత్తం సతీసమేతంగా దేశ రాజధానికి వెళ్లారు. సోమవారం ఆయన పన్ను తీయించుకున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి, హైదరాబాద్‌ నగరంలో సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలన్నీ అందుబాటులో ఉన్నాయి. దేశంలోనే పేరుగాంచిన స్పెషలిస్టు వైద్యులు మన దగ్గరే ఉన్నారు. పలు దేశాల నుంచి ఇక్కడికే వచ్చి వైద్య చికిత్సలు చేయించుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన వైద్య చికిత్సలకు హైదరాబాద్‌ను వదిలేసి ఢిల్లీకి వెళ్లడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2022-04-05T07:18:58+05:30 IST