ఆహార నాణ్యతపై నజర్‌

ABN , First Publish Date - 2022-08-01T08:12:41+05:30 IST

మొన్న మహబూబాబాద్‌, నిన్న సిద్దిపేట... కలుషిత ఆహారం తిని గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో దిద్దుబాటు చర్యలపై సర్కారు దృష్టి సారించింది.

ఆహార నాణ్యతపై నజర్‌

గురుకులాలు, హాస్టళ్లలో పరిశీలన బాధ్యతలు ఫుడ్‌ఇన్‌స్పెక్టర్లకు..

నాణ్యత లోపిస్తే బాధ్యులపై చర్యలు

హైదరాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): మొన్న మహబూబాబాద్‌, నిన్న సిద్దిపేట... కలుషిత ఆహారం తిని గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో దిద్దుబాటు చర్యలపై సర్కారు దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో ఎప్పటికప్పుడు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు తనిఖీలు చేపట్టి, ఆహార నాణ్యతను పరిశీలించాలని ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు కలిపి 2500 వరకు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కలుషిత, నాణ్యత లేని ఆహారం కారణంగా రోజుల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది విద్యార్థులు ఆస్పత్రులపాలయ్యారు.


గడువు ముగిసిన సరుకులు వాడటం, నాసిరకం సామగ్రితో వంట చేస్తుండటం, మిగిలిపోయిన కూరలు కలిపి వండుతుండడం వంటి కారణాలతో ఆహారం కలుషితమవుతోందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో ఆహార నాణ్యతను ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలని సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. తనిఖీల సమయంలో విద్యార్థులకు అందించే ఆహారం ఎలా ఉందనే దానిపై పూర్తిస్థాయిలో నివేదిక రూపొందించి జిల్లా కలెక్టర్లకు అందజేయాల్సి ఉంటుంది. ఎక్కడైనా లోపాలు బయటపడితే బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నారు.

Updated Date - 2022-08-01T08:12:41+05:30 IST