అత్యాచారాల అపప్రథ!

ABN , First Publish Date - 2022-06-12T08:29:53+05:30 IST

వరుసగా చోటుచేసుకుంటున్న అత్యాచార ఘటనల కారణంగా రాష్ట్రం అపప్రథను మూటగట్టుకుంటోందా..? రాష్ట్ర ప్రజల్లో ఇప్పుడు..

అత్యాచారాల అపప్రథ!

వరస ఘటనలతో అట్టుడుకుతున్న రాష్ట్రం..

ఉక్కిరిబిక్కిరి అవుతున్న పోలీసులు

రాష్ట్ర సర్కారుపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత..

రాష్ట్రంలో శాంతిభధ్రతలు భేష్‌: పోలీసులు


హైదరాబాద్‌, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): వరుసగా చోటుచేసుకుంటున్న అత్యాచార ఘటనల కారణంగా రాష్ట్రం అపప్రథను మూటగట్టుకుంటోందా..? రాష్ట్ర ప్రజల్లో ఇప్పుడు ఈ అనుమానమే వ్యక్తమవుతోంది. అత్యాచార ఘటనలపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో పాటు జాతీయ మహిళా కమిషన్‌, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ స్పందించి.. నివేదికలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. జూబ్లీహిల్స్‌లో మైనర్‌పై అత్యాచార కేసులో పక్షపాతంగా వ్యవహరించారంటూ ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఆ కేసులో మజ్లిస్‌ ఎమ్మెల్యే కుమారుడిని తప్పించేందుకు ప్రయత్నాలు చేశారని దుమ్మెత్తిపోస్తున్నాయి. చట్టప్రకారమే వ్యవహారించామని ఒకవైపు అధికారులు చెబుతున్నా.. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అటు సోషల్‌మీడియాలోనూ ప్రభుత్వ తీరును నిరసిస్తూ నెటిజన్లు పెద్దఎత్తున పోస్టులు పెడుతున్నారు.


ఇక వరస అత్యాచార ఘటనల నేపథ్యంలో.. శుక్రవారం హోంమంత్రి మహమూద్‌ అలీ సమీక్షాసమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ అత్యాచార కేసులో.. రాజకీయ నాయకుల ఆరోపణలు, ప్రభుత్వంపై వ్యతిరేకతపైనా ప్రధానంగా చర్చించారు. పబ్‌లు తమ పరిధిలోకి రావని, మైనర్లను అనుమతించే విషయాన్ని ఎక్సైజ్‌ శాఖ చూస్తుందని మంత్రికి ఉన్నతాధికారులు వివరించారు. ఇదే విషయాన్ని హోంమంత్రి మహమూద్‌అలీ మీడియాకు వెల్లడించారు. ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖ ఉన్నతాధికారులతో త్వరలోనే సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. మరోవైపు పోలీసులు సైతం.. నష్టనివారణ కోసం ఒక ప్రకటనను విడుదల చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా ఉందని అందులో పేర్కొన్నారు. ‘‘గత ఏడేళ్లలో పోలీ్‌సశాఖ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది.


రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎక్కడా తీవ్ర శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కాలేదు. హైదరాబాద్‌లో లక్షలాది సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఎందరో నేరస్థులను అరెస్ట్‌ చేశాం. గత ఏడాది 66 శాతం కేసులను సీసీటీవీ కెమెరాల ద్వారానే చేధించాం. మహిళలు, చిన్నారులపై జరిగిన అనేక కేసుల్లో నిందితులకు కోర్టులు మరణ శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్షలను విధించాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి.. వాటికి సీసీటీవీలను అనుసంధానం చేశాం. మహిళలు, చిన్నారుల భద్రతలో షీటీమ్స్‌ కీలకంగా వ్యవహరిస్తున్నాయి. పోక్సో కేసులవిచారణకు చైల్డ్‌ఫ్రైండ్లీ కోర్టులను ఏర్పాటు చేశాం’’ అని ఉన్నతాధికారులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

Read more