Delhi తెలంగాణ భవన్‌లో జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు

ABN , First Publish Date - 2022-09-17T16:37:29+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

Delhi తెలంగాణ భవన్‌లో జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ (Telangana bhavan)లో జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం (Manda Jagannatham) జాతీయ జెండాను ఎగురవేశారు. ఆపై అంబేద్కర్ విగ్రహానికి, అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... 1948, సెప్టెంబర్ 17కు  చరిత్రలో ఎంతో విశిష్టత ఉందని... ఈ రోజు దేశంలో తెలంగాణ (Telangana) అంతర్ భాగమైందని తెలిపారు. రాచరిక పాలన నుంచి స్వతంత్ర పాలన వైపు మళ్లిందని చెప్పారు. సర్దార్ పటేల్ (Sardar Patel) చాకచక్యంతో దేశం సంస్థానల నుంచి ఐక్యత సాధించిందని అందుకే సమైక్యతా వేడుకల్ని నిర్వహిస్తున్నామని వివరించారు. కొమురం భీం, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, ధర్మభిక్షం, బద్దం యెల్లారెడ్డి, కాళోజి ఇలా అందర్ని స్మరించుకోవాల్సిన సమయం ఇది అని ఆయన అన్నారు.


తెలంగాణ సాంస్కృతిక పండుగలైన బోనాలు(Bonalu festival), బతుకమ్మ (Batukamma festival) వేడుకల్ని దేశ రాజధానిలో ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. కొందరు గత చరిత్రను వక్రీకరిస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. వివేకంతో విద్వేషాన్ని తరిమికొట్టాలని మందా జగన్నాథం పిలుపునిచ్చారు. ఈ వేడకల్లో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె ఎం సాహ్ని, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-17T16:37:29+05:30 IST