షబ్బీర్‌, సుదర్శన్‌రెడ్డికి ఈడీ పిలుపు?

ABN , First Publish Date - 2022-09-24T09:00:57+05:30 IST

నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కేసులో తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్‌ నేతలను కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే..

షబ్బీర్‌, సుదర్శన్‌రెడ్డికి ఈడీ పిలుపు?

  • వచ్చేనెల 10న హాజరు కావాలని ఆదేశం
  • గీతారెడ్డి, రేణుకల్లో ఒకరికి నోటీసు
  • యంగ్‌ ఇండియన్‌కు చెల్లింపులపై నేతలను వివరణ అడిగే అవకాశం 
  • శివకుమార్‌కు ఇదే అంశంపై ప్రశ్నలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 23: నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కేసులో తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్‌ నేతలను కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కర్ణాటకకు చెందిన మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్‌లను ఈడీ ప్రశ్నించింది. తెలంగాణకు చెందిన షబ్బీర్‌ అలీ, సుదర్శన్‌రెడ్డిలకు తాజాగా ఈడీ నుంచి నోటీసులు అందాయని చెబుతున్నారు. అక్టోబరు 10న ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని వారిని ఆదేశించినట్లు సమాచారం. గీతారెడ్డి, రేణుకాచౌదరిలలో ఒకరికి కూడా నోటీసులు అందినట్లు చెబుతున్నారు కానీ ధ్రువీకరణ కాలేదు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతలను కూడా ప్రశ్నించడానికి పిలిచే అవకాశముంది. నేషనల్‌ హెరాల్డ్‌ సంస్థలో నల్లధనం చెలామణికి పాల్పడ్డట్లు ఈడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీని, పార్టీ ముఖ్యనేత రాహుల్‌ గాంధీని, కర్ణాటకకు చెందిన డీకే శివకుమార్‌ను ఈడీ పలుమార్లు పిలిచి ప్రశ్నించింది. నేషనల్‌ హెరాల్డ్‌ మాతృసంస్థ యంగ్‌ ఇండియన్‌కు చేసిన చెల్లింపుల గురించి ఆయా నేతలను ప్రశ్నిస్తారని సమాచారం. డీకే శివకుమార్‌ మూడు రోజుల క్రితం ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరైనపుడు ఆయన తమ్ముడు నిర్వహిస్తున్న ట్రస్ట్‌ నుంచి యంగ్‌ ఇండియన్‌కు జరిగిన చెల్లింపుల గురించి ప్రశ్నించారు. యంగ్‌ ఇండియన్‌ సంస్థలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు 78 శాతం వాటా ఉంది. మిగతా వాటా మోతీలాల్‌ వోరా, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌లకు ఉంది. నెహ్రూ నేతృత్వంలో 1938లో ఏర్పడిన అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ అనే ట్రస్టు ఆధ్వర్యంలో నేషనల్‌ హెరాల్డ్‌ ఆంగ్ల పత్రిక, నవజీవన్‌ హిందీ పత్రిక, క్వామీ అవాజ్‌ ఉర్దూ పత్రిక నడిచేవి. 


వాటికి నష్టాలు రావడంతో కాంగ్రెస్‌ పార్టీ వాటిని నడపడానికి అప్పులిస్తూ వచ్చింది. 2008లో మూతపడే నాటికి అప్పులు రూ.90 కోట్లకు చేరాయి. అప్పు తీర్చలేనని ట్రస్టు చేతులు ఎత్తేయడంతో 2016లో సోనియా, రాహుల్‌ నేతృత్వంలో రూ.50 లక్షల మూలధనంతో ఏర్పడిన ప్రైవేటు కంపెనీ యంగ్‌ ఇండియా లిమిటెడ్‌కు రూ.90 కోట్ల బాకీ కింద దివంగత నెహ్రూ కాలం నాటి నుంచి నడుస్తున్న ట్రస్టులోని వాటాలన్నింటినీ బదిలీ చేశారు. ఆ ట్రస్టుకు దేశవ్యాప్తంగా రూ.2000 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని, వాటిని సోనియా, రాహుల్‌లు కేవలం రూ.50 లక్షలకు దక్కించుకున్నారని సుబ్రహ్మణ్యస్వామి ఢిల్లీ కోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ కేసు విచారణకు సమాంతరంగా యంగ్‌ ఇండియా లిమిటెడ్‌ కంపెనీలో వివిధ రాష్ట్రాల కాంగ్రెస్‌ పార్టీ నేతలు జమ చేసిన డబ్బులపై ఇప్పుడు ఈడీ ఆరా తీస్తోంది. 


Read more