మహిళా చట్టాలను పకడ్బందీగా అమలుచేయాలి

ABN , First Publish Date - 2022-05-25T04:18:29+05:30 IST

మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడేందుకు చట్టాలను పకడ్బందీగా అమలుచేయాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. పలు శాఖల అధికారులు, మహిళా సంఘాలు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, ఎఎన్‌ఎం, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు.

మహిళా చట్టాలను పకడ్బందీగా అమలుచేయాలి
అవగాహన సదస్సులో మాట్లాడుతున్న సునీతాలక్ష్మారెడ్డి

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి

భువనగిరి రూరల్‌, మే 24: మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడేందుకు చట్టాలను పకడ్బందీగా అమలుచేయాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. పలు శాఖల అధికారులు, మహిళా సంఘాలు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, ఎఎన్‌ఎం, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. కుటుంబ వ్యవస్థలో మహిళలు, బాలికలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడేందుకే ఇలాంటి సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళా చట్టాలను మహిళలే కాకుండా పురుషులు సైతం తెలుసుకోవాలన్నారు. అప్పుడే అందరికీ అవగాహన కలుగుతుందన్నారు. మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న చోటుకు వెళ్లి పరిశీలించి సుమోటగా కేసులు నమోదుచేయడం, విద్యాసంస్థలు, వసతి గృహాలు, వర్కింగ్‌ ఉమెన్‌ హాస్టళ్లను తనిఖీచేసే అధికారం కమిషన్‌కు ఉందన్నారు. చిన్న చిన్న కారణాలతో భార్యాభర్త విడిపోతున్నారని, లింగ సమానత్వం లేకపోవడమే దీనికి కారణమన్నారు. మహిళా కమిషన్‌ కార్యదర్శి కృష్ణవేణి మాట్లాడుతూ, స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా మహిళలు వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకోవద్దన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతి ఏర్పాట్లను బాధితులు ఉపయోగించుకోవాలన్నారు. పెళ్లి రిజిస్ట్రేషన్‌పై పంచాయతీ కార్యదర్శులు మహిళలను చైతన్యపరచాలన్నారు. అంబేడ్కర్‌ ఓవర్‌సిస్‌ విద్యా నిధి ద్వారా ఆడపిల్లలు విదేశాల్లో చదివేందుకు రూ.20లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌ ద్వారా ఆడపిల్లల వివాహాలకు ప్రభుత్వం ఆర్థిక చేయూతనిస్తోందన్నారు. షీటీంలు, సఖీ సెంటర్లు, సైబర్‌ టీంలు, ఎన్‌ఆర్‌ఐ సెల్‌ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామన్నారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే సఖి సెంటర్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 181, కమిషన్‌ నెంబర్‌ 9490555533కు ఫిర్యాదుచేయవచ్చని తెలిపారు. చిన్నారులపై అఘాయిత్యాలు, గృహ హింస, రక్షణ చట్టాలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని కృషి ఐటీఐ ఆవరణలో నిర్వహిస్తున్న బాలికల వసతి గృహాన్ని, ఎస్సీ బాలికల వసతి గృహాన్ని తనిఖీచేశారు. అదే విధంగా సఖి సెంటర్‌ను సందర్శించి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.  కలెక్టర్‌ పమేలా సత్పథి మాట్లాడుతూ, జిల్లాలో 1.55లక్షల మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉన్నారని, 14,841 సంఘాలు పని చేస్తున్నాయన్నారు. 561 గ్రామ సమాఖ్యల ద్వారా మహిళలు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. గత ఏడాది రూ.410కోట్ల రుణసౌకర్యం కల్పించామన్నారు. డీసీపీ నారాయణరెడ్డి మాట్లాడుతూ, మహిళల భద్రతకు పోలీసుశాఖ తీసుకుంటున్న చర్యలను వివరించారు. సమావేశంలో కమిషన్‌ సభ్యులు షాహిన్‌ అఫ్రోజ్‌, కె.ఈశ్వర్‌ బాయి, కె.ఉమాదేవి, జి.పద్మ, ఎస్‌.లక్ష్మీ, కె.రేవతి, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, సీడబ్లూసీ చైర్మన్‌ బండారు జయశ్రీ, ఐసీడీఎస్‌ పీడీ కృష్ణవేణి, డీఆర్‌డీవో మందడి ఉపేందర్‌ రెడ్డి, సఖి కేంద్రం కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ప్రమీల, డి.విజయలక్ష్మీ, యశోధ, మంజూషా తదితరులు పాల్గొన్నారు.

Read more