ఎప్పటికి పూర్తయ్యేనో?

ABN , First Publish Date - 2022-08-21T06:30:23+05:30 IST

దేవరకొండ డివిజన్‌లో శ్రీశైలం సొరంగమార్గం(ఎ్‌సఎల్‌బీసీ), డిండి ఎత్తిపోతల, ఎస్‌ఎల్‌బీసీ ఓపెన్‌కెనాల్‌, పెండ్లిపాకల ఎత్తుపెంపు ప్రాజెక్టుల నిర్మాణ పనులు గడువులు ముగుస్తున్నా ముందుకుసాగడంలేదు.

ఎప్పటికి పూర్తయ్యేనో?
అసంపూర్తిగా ఉన్న గొట్టిముక్కల రిజర్వాయర్‌ పనులు

దేవరకొండ డివిజన్‌లో ముందుకు సాగని ప్రాజెక్టులు


 దేవరకొండ, ఆగస్టు 20: దేవరకొండ డివిజన్‌లో శ్రీశైలం సొరంగమార్గం(ఎ్‌సఎల్‌బీసీ), డిండి ఎత్తిపోతల, ఎస్‌ఎల్‌బీసీ ఓపెన్‌కెనాల్‌, పెండ్లిపాకల ఎత్తుపెంపు ప్రాజెక్టుల నిర్మాణ పనులు గడువులు ముగుస్తున్నా ముందుకుసాగడంలేదు. శ్రీశైలం సొరంగమార్గానికి 2005లో అప్పటి సీఎం వైఎ్‌సఆర్‌ శంకుస్థాపన చేయగా, 2010 నాటికి పూర్తిచేస్తామని గడువు విధించారు. 2011లో ఈ గడువును 2014కు పొడిగించారు. 2014లో మరోమారు 2017 నాటికి పెంచారు. దీన్ని కాస్త 2021కు, తిరిగి 2023 డిసెంబరు వరకు గడువు పెంచడంతో టన్నెల్‌-1 పనులు తిరిగి ప్రారంభం కాగా, శ్రీశైలం వైపు నుంచి చేపట్టిన టన్నెల్‌-2 పనులు నిలిచిపోయాయి. కుర్చివేసుకొని కూర్చొని సొరంగమార్గాన్ని తవ్విస్తానని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినా అది నెరవేరలేదు. నిధుల కొరత, టన్నెల్‌ బేరింగ్‌మిషన్‌ తరచూ మరమ్మతులకు గురవుతుండ డం, వాటిని ఇతర దేశాల నుంచి తీసుకురావడంలో జాప్యం కారణంగా సొరంగమార్గం పనులు ముందుకు సాగడంలేదు. మొత్తం 43.93కి.మీ సొరంగం తవ్వాల్సి ఉండగా, 33.35కి.మీ పూర్తయింది. ఇంకా 10.625కి.మీ తవ్వాల్సి ఉంది. రూ.1925కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు పనులు చేపట్టగా, ఇప్పటివరకు రూ.1600కోట్ల మేర పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. 


డిండిదీ అదే దారి

డిండి ఎత్తిపోతల పథకానికి మర్రిగూడ మండలం చర్లగూడెం వద్ద సీఎం కేసీఆర్‌ 2015 జూన్‌ 12న శంకుస్థాపన చేశారు. రూ.6,500కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పనులను రెండున్నరేళ్లలో పూర్తిచేసి సాగు, తాగునీరు అందిస్తానని నాడు సీఎం హామీ ఇచ్చారు. అయితే పునరావాస ప్రక్రియ పూర్తికాకపోవడం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్రత్యేక ప్యాకేజీ కల్పించకపోవడంతో నిర్వాసితులు తరచూ అడ్డుకోవడంతో పనులు ముందుకు సాగడంలేదు. మల్లన్నసాగర్‌ తరహాలో పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు ధర్నాలు, రాస్తారోకోలు, ఆమరణ దీక్షలు చేస్తున్నారు. చర్లగూడెం రిజర్వాయర్‌ 12టీఎంసీల సామర్ధ్యం కా గా, 3,314 ఎకరాల భూములు ముంపునకు గురవుతున్నాయి. అందులో 550 ఎకరాలు ప్రభుత్వ భూమి. 2,800 ఎకరాల వరకు రైతుల పట్టాభూములు ప్రాజెక్టులో ముంపునకు గరికానున్నాయి. కిష్టరాయన్‌పల్లి రిజర్వాయర్‌ సామర్ధ్యం 5.7 టీఎంసీలు కాగా, 2,046 ఎకరాలకు 1,900 ఎకరాల ను అధికారులు సేకరించారు. ఈ రిజర్వాయర్‌తో నాంపల్లి మండలంలోని లక్ష్మణాపురం, ఈదులగండి గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఈదులగండిలో 33 కుటుంబాలు, లక్ష్మణాపురంలో 174 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. నక్కలగండి రిజర్వాయర్‌ కింద జిల్లాలో నక్కలగండితండా ముంపునకు గురవుతుండగా, పునరావాసం కల్పించాల్సి ఉంది. కాగా, మునుగోడులో శనివారం జరిగిన సభలో సీఎం కేసీఆర్‌ పెండింగ్‌ ప్రాజెక్టులను ప్రస్తావించకపోవడంపై రైతులు, స్థానికులు నిరాశచెందారు.

Read more