కూతురు పెళ్లి చేసి తిరిగి వస్తుండగా..

ABN , First Publish Date - 2022-08-21T05:53:47+05:30 IST

కుమార్తె పెళ్లి చేసిన ఆనందంతో తిరుగు ప్రయాణమైన ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది.

కూతురు పెళ్లి చేసి తిరిగి వస్తుండగా..

కారును ఢీకొన్న సిమెంట్‌ లారీ

తల్లిదండ్రులకు గాయాలు 

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఘటన

హుజూర్‌నగర్‌, ఆగస్టు 20: కుమార్తె పెళ్లి చేసిన ఆనందంతో తిరుగు ప్రయాణమైన ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పట్టణంలో శనివారం జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ రాష్ట్రం గుంటూరు జిల్లా దాచేపల్లి గ్రామానికి చెందిన గార్ల పాటి శ్రీనుబాబు, అనురాధ దంపతుల కుమార్తె గార్లపాటి హేమలక్ష్మి వివాహాన్ని ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలులోని లక్ష్మీతిరుపతమ్మ గోపయ్య స్వామి సన్నిధిలో నిర్వహించారు. గుంటూరు జిల్లా కేశనపల్లి గ్రామానికి చెందిన పి.సాయికుమార్‌తో ఉదయం 9గంటలకు వివాహం జరిగింది. భోజనాల తర్వాత పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు శ్రీనుబాబు, అనురాధతోపాటు బంధువులు ఉపాధ్యాయుల రాంగోపాల్‌, మండల రాజేశ్వరి, కోట మాలతి త్రివేణి కారులో హుజూర్‌నగర్‌ మీదుగా దాచేపల్లికి వెళ్తున్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో పట్టణంలోని డీబీఆర్‌ స్కూల్‌ మూలమలుపు వద్ద మఠంపల్లి నుంచి వస్తున్న సిమెంట్‌ లారీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెళ్లి కుమార్తె తల్లి గార్లపాటి అనురాధ, ఉపాధ్యాయుల రాంగోపాల్‌కు తీవ్రగాయాలయ్యాయి. గార్లపాటి శ్రీనుబాబు, మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను 108అంబులెన్స్‌లో పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారందరినీ మెరుగైన చికిత్స కోసం సూర్యాపేటకు తరలించారు. బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. 

Read more