మా ఊరి వాగుపై వంతెన నిర్మించాలి

ABN , First Publish Date - 2022-10-04T05:37:17+05:30 IST

తమ ఊరికి ప్రధాన రహదారిపై ఉన్న వాగుపై వంతెన నిర్మించాలని మండలంలోని తాడ్వాయి గ్రామస్థులు డిమాండ్‌ చేశారు.

మా ఊరి వాగుపై వంతెన నిర్మించాలి
వాగు వద్ద ఆందోళన చేస్తున్న తాడ్వాయి గ్రామస్థులు

మునగాల, అక్టోబరు 3: తమ ఊరికి ప్రధాన రహదారిపై ఉన్న వాగుపై వంతెన నిర్మించాలని మండలంలోని తాడ్వాయి గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. ఈ నెల 1వ తేదీన మునగాల మండలం తాడ్వాయిలోని గుర్రప్పవాగులో గల్లంతైన సైదులు మృతదేహం సంఘటనా స్థలానికి కిలోమీటరులో సోమవారం లభ్యమైంది. దీంతో గ్రామస్థులు 300 మంది వాగుపై ఉన్న కల్వర్టు వద్ద ఎస్‌కే సైదులు మృతదేహంతో ధర్నాకు దిగారు. ఉదయం 10 గంటలకు మొదలైన ఆందోళన గంట పాటు కొనసాగింది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన డీవైఎ్‌ఫఐ డీవైఎ్‌ఫఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్‌, వైస్‌ఎంపీపీ బుచ్చిపాపయ్యలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వాగుపై బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్‌ చేశారు. వాగుపై ఎగువన చెరువులు అలుగు పోసిన ప్రతీసారి తమ గ్రామానికి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. వాగుపై ఉన్న కల్వర్టు మీదుగా ఉధృతంగా ప్రవాహం ఉంటుందని, దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దాటాల్సి వస్తుందన్నారు. అదేవిధంగా వాగు అవతలి ఎనిమిది గ్రామాల ప్రజలు వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వాగుపై వంతెనను నిర్మించాలని ప్రజా ప్రతినిధులు, అధికారులను కోరినా స్పందించలేదన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని సైదులు కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియా, సైదులు కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని బీష్మించారు. ఆందోళన విషయం తెలిసిన సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ బాలునాయక్‌ తాడ్వాయి గ్రామస్థుల వద్దకు వెళ్లి ఆందోళన విరమించాలని కోరినా వినలేదు. దీంతో ఆర్డీవో కిషోర్‌కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడించారు. మృతుడు సైదులు కుటుంబానికి రూ.2 లక్షలు ప్రభుత్వం నుంచి ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో పోలీసులు మరోసారి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేయించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కృష్ణప్రసాద్‌, రాయిశెట్టి శ్రీను, వెంకన్న, స్వాతి, వీరమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-04T05:37:17+05:30 IST