ప్రాజెక్టులకు జలకళ

ABN , First Publish Date - 2022-08-10T06:05:59+05:30 IST

నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌కు మంగళవారం ఎగువనుంచి వరద ఉధృతి పెరిగింది.

ప్రాజెక్టులకు జలకళ
డిండి రిజర్వాయర్‌ స్పిల్‌ వే నుంచి అలుగుపోస్తున్న నీరు

 సాగర్‌కు పెరిగిన వరద ఉధృతిఫ 2.3 లక్షల క్యూసెక్కుల రాక

 578 అడుగులకు చేరుకున్న సాగర్‌ నీటి మట్టం 

నాగార్జునసాగర్‌/ చింతలపాలెం/ కేతేపల్లి / డిండి, ఆగస్టు 9 : నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌కు మంగళవారం ఎగువనుంచి వరద ఉధృతి పెరిగింది. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ఆరు క్రస్ట్‌గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,67,898 క్యూసెక్కులు, రెండు జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,608 క్యూసెక్కులు మొత్తంగా 2,30,506 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు(312.0450టీఎంసీలు) కాగా ప్రస్తుతం 578 అడుగులకు(276. 0932టీఎంసీలకు) చేరుకుంది. సాగర్‌ నుంచి కుడి, ఎడమ కాల్వలతో పాటు విద్యుత్‌ కేంద్రం, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా మొత్తంగా 31,535 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరో 36 టీఎంసీల నీరు సాగర్‌కు వచ్చి చేరితే ప్రాజెక్టు పూర్తిస్థాయి మట్టానికి నీరు చేరుకుంటుంది.   

‘పులిచింతల’లో మూడు క్రస్ట్‌గేట్ల నుంచి నీటి విడుదల

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టులో మూడు క్రస్ట్‌గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి 30,219 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో మూడు గేట్లను 1.5 మీటర్లు ఎత్తి  41,456 క్యూసెక్కులు, ప్రాజెక్టు పవర్‌ హౌస్‌లోని మూడు యూనిట్ల ద్వారా 10వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తూ 70 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 175 అడుగులు (45.77టీఎంసీలు) కాగా ప్రస్తుతం 171.25 అడుగులకు (40.16 టీఎంసీలు)  చేరుకుంది.

మూసీ ప్రాజెక్టులో నాలుగు క్రస్ట్‌గేట్ల ద్వారా...

నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువన భారీ వర్షాలకు ప్రాజెక్టుకు 3,798క్యూసెక్కుల వరద వస్తుండగా నాలుగు క్రస్ట్‌గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 645అడుగులు(4.49 టీఎంసీలు) కాగా ప్రస్తుతం నీటిమట్టం 638.30అడుగులుగా(2.84 టీఎంసీలు) ఉంది.  

డిండి ప్రాజెక్టుకు పెరిగిన ఇన్‌ప్లో 

నల్లగొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది. దుందుభివాగుకు వరద ప్రవాహం పెరగడంతో డిండి రిజర్వాయర్‌కు భారీగా నీరు  వచ్చి చేరుతుంది. ఎగువ నుంచి 3,755 క్యూసెక్కులు వస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈ ఫయాజ్‌ తెలిపారు. స్పిల్‌వే నుంచి 3,755 క్యూసెక్కులు దిగువకు వెళ్తుందని తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం 36అడుగులు(2.4టీఎంసీ) గరిష్టస్థాయికి చేరింది. స్పిల్‌వేపై నుంచి నీరు కిందికి దూకుతుండటంతో చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో ప్రాజెక్టు వద్దకు చేరుకుంటున్నారు. 

వాహనాల రాకపోకలకు ఇబ్బందులు 

శాలిగౌరారం: వరుస వర్షాలతో నల్లగొండ జిల్లా శాలిగౌరారం ప్రాజెక్టులో క్రమేనా నీటిమట్టం పెరుగుతుంది. గరిష్ట నీటిమట్టం 21అడుగులకు గాను మంగళవారం సాయంత్రం 16అడుగులకు చేరింది. శాలిగౌరారం నుంచి ఊట్కూరుకు వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు మధ్యలో వరద పెరగడంతో వాహనాలకు తీవ్రంగా ఆటంకం కలుగుతోంది.  

నేటి నుంచి ఏఎమ్మార్పీ విడుదల 

గుర్రంపోడు : ఏఎంఆర్పీ ప్రధాన కాల్వకు ఈ నెల 10 నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వానాకాలం ఆరుతడి పంటలకు వారబంధీ పద్ధతిలో డిసెంబరు 7వ తేదీ వరకు నీటిని విడుదల చేస్తామని తెలిపారు. ఈ మేరకు అధికారులు మంగళవారం గేట్లను పరిశీలించారు. రైతులు ఎవరూ నీటి కోసం గేట్లను విరగగొట్టవద్దని ఏఎమ్మార్పీ డివిజన్‌ -5 ఏఈ శ్రీనివాస్‌రావు కోరారు. ప్రభుత్వం రూ.36లక్షలతో గేట్లకు మరమ్మతులు చేయించిందని తెలిపారు.  

పాలేరు వాగులో ఎడ్లు గల్లంతు

మద్దిరాల : పొలం దున్నిన ఎడ్లను కడుగుతుండగా పాలేరు వాగులో కొట్టుకుపోయాయి. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు పులిగిల్ల మల్లయ్య తన పొలాన్ని దున్నిన అనంతరం పక్కనే ఉన్న పాలేరు వాగులో ఎద్దులను కడుగుతుండగా లెంకతో (జంటగా) ఉండడంతో ఒక్క ఎద్దు బెదిరి వాగు లోపలికి దూకింది. మరో ఎద్దు సైతం లోపలికి వెళ్లడంతో వరద ఉధృతికి రెండు ఎడ్లు వాగులో కొట్టకుపోయాయి. గ్రామస్థుల సాయంతో రైతు వాగు వెంట కిలో మీటర్‌ వరకు వెతికినా ఎడ్ల ఆచూకీ లభించలేదు. ఎడ్ల విలువ సుమారు రూ.90 వేలు ఉంటుందని రైతు మల్లయ్య తెలిపారు.

Read more