డిసెంబరు 15 నుంచి సాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదల

ABN , First Publish Date - 2022-11-23T23:59:01+05:30 IST

యాసంగిలో నాగార్జున సాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదల షెడ్యూల్‌ ఖరారైంది. డిసెంబరు 15వ తేదీ నుంచి నీటి విడుదలకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.

డిసెంబరు 15 నుంచి సాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదల

నల్లగొండ, నవంబరు 23: (ఆంధ్రజ్యోతి ప్రతినిఽధి): యాసంగిలో నాగార్జున సాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదల షెడ్యూల్‌ ఖరారైంది. డిసెంబరు 15వ తేదీ నుంచి నీటి విడుదలకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఆరుతడి పంటలకు ప్రాధాన్యత నిచ్చేలా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 23వ తేదీ వరకు సాగునీరు విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన జలవనరుల శాఖ ఉన్నతాధికారుల సమావేశం లో జిల్లా అధికారులు నీటి విడుదల షెడ్యూల్‌ను తెలియజేశారు. యాసంగి సీజన్‌లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 9లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేయనున్నారని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుండగా వాస్తవానికి వరిసాగు 10లక్షల ఎకరాలు దాటే అవకాశముంది. వానాకాలం ధాన్యం కొనుగోలు పూర్తయితేనే రైతులు యాసంగి సాగుపై దృష్టిపెట్టడానికి వీలవుతుంది. ఇప్పటి వరకు లక్ష్యంలో 15శాతం మాత్రమే కొనుగోలు పూర్తయ్యాయి. మరో నెల రోజులు గడిస్తే కానీ వానాకాలం కొనుగోళ్లు పూర్తయ్యే పరిస్థితిలేదు. దీంతో యాసంగి సాగు ఆలస్యమై మండుటెండల్లో మే మధ్యన యాసంగి కోతకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఎండలు పెరిగితే నూక శాతం పెరిగి ధర రాక రైతులు, నష్టాన్ని భరించలేక మిల్లర్లు ఇబ్బందులు పడే పరిస్థితి. ఈ దఫా యాసంగిలో ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించలేదు.

Updated Date - 2022-11-23T23:59:01+05:30 IST

Read more