ఆర్థిక ఇబ్బందులతో వీఆర్‌ఏ ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-09-11T05:08:49+05:30 IST

కూతురు పెళ్లికి తెచ్చిన అప్పులు తీరక, జీతం రాక ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని నడపలేక వీఆర్‌ఏ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఆర్థిక ఇబ్బందులతో వీఆర్‌ఏ ఆత్మహత్య
వెంకటేశ్వర్లు(ఫైల్‌)

 కూతురి పెళ్లి అప్పుతీరక, జీతం రాక ఇబ్బందులు

 పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డగించిన వీఆర్‌ఏలు

మిర్యాలగూడ, సెప్టెంబర్‌ 10: కూతురు పెళ్లికి తెచ్చిన అప్పులు తీరక, జీతం రాక ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని నడపలేక వీఆర్‌ఏ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఉట్లపల్లిలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి వీఆర్‌ఏ కంచర్ల వెంకటేశ్వర్లు(40) తండ్రి వారసత్వంగా వచ్చిన వీఆర్‌ఏ ఉద్యోగంలో 2006లో చేరివిధులు నిర్వహిస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, తల్లి ఉన్నారు. పెద్దకూతురుకు మూడేళ్ల క్రితం పెళ్లికాగా, చిన్న కూతురు ఇంటర్‌ ప్రథమ సంవత్సరం తుంగపాడు మోడల్‌ కళాశాలలో చదువుతోంది. సొంత ఆస్తులు లేకపోవడంతో కూతురు పెళ్లికి అప్పు చేశాడు. పెళ్లికి చేసిన అప్పులు తీరకపోగా, వీఆర్‌ఏలు సమ్మెలో ఉండటంతో వేతనం రాకపోవడంతో భార్య కూలీకి వెళ్తేనే ఇల్లు గడిచే పరిస్థితికి వచ్చింది. తాను సైతం అప్పుడప్పుడు యాక్టింగ్‌ డ్రైవర్‌గా పని చేసి కుటు ంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులకు తోడు కొంతకాలంగా వెంకటేశ్వర్లు కిడ్నీ సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో వెంకటేశ్వర్లు సతమతమవుతున్నాడు. శనివారం ఉదయం 11గంటలకు తల్లి బయటకు వెళ్లగా, భార్యా,చిన్న కుమార్తె సరుకులకు వెళ్లి వచ్చి చూసేసరికి గదిలో ఫ్యాన్‌కు చీరతో వెంకటేశ్వర్లు ఉరేసుకున్నాడు. వారు గమనించే సరికి అతడు మృతి చెంది ఉన్నాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించి బంధువులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ డి.నరసింహులు తెలిపారు.

ఎమ్మెల్యేను అడ్డగించిన వీఆర్‌ఏలు

ఆత్మహత్యకు పాల్పడిన వీఆర్‌ఏ వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పరామర్శించేందుకు ఉట్టపల్లి వెళ్లిన మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావును వీఆర్‌ఏలు అడ్డగించారు. పేస్కేల్‌ అమలు చేయాలని 48 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది వీఆర్‌ఏలు ప్రాణాలు కోల్పోగా వెంకటేశ్వర్లు మరణంతో సంఖ్య 24కు చేరిందన్నారు. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన సీఎం ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పరిస్థితిని అర్థం చేసుకుని పేస్కేల్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. వీఆర్‌లకు ఎమ్మెల్యే సర్ధిచెప్పి ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని, మృతి చెందిన వీఆర్‌ఏ కుటుం బాన్ని అన్నివిధాలా ఆదుకుంటానని హామీ ఇ్వడంతో వారు శాంతించారు.


Updated Date - 2022-09-11T05:08:49+05:30 IST