ఎస్సారెస్పీలో గల్లంతైన ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2022-09-11T05:12:15+05:30 IST

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలో గణేష్‌ నిమజ్జనానికి వెళ్లి ఎస్సారెస్పీ కాల్వలో గల్లంతైన ఇద్దరు మృత్యువాత పడ్డారు.

ఎస్సారెస్పీలో గల్లంతైన ఇద్దరు మృతి
నాగు(ఫైల్‌ఫొటో)

ఆత్మకూర్‌(ఎస్‌) సెప్టెంబరు 10 : సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలో గణేష్‌ నిమజ్జనానికి వెళ్లి ఎస్సారెస్పీ కాల్వలో గల్లంతైన ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఇద్దరి మృతదేహాలను కాల్వ సమీపంలో లభ్యమయ్యాయి. కోటినాయక్‌తండాకు చెందిన బానోతు సూర్య(50), బానోతు నాగు(40) శోభాయాత్రను పురస్కరించుకుని ఎస్‌ఆర్‌ఎస్పీ 71 డీబీఎం కెనాల్‌లో విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వెళ్లారు. అక్కడున్న మెట్ల నుంచి కాల్వలోకి దిగగా కాలుజారి పడిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా సంఘటనా స్థలానికి కిలోమీటరు దూరంలో సూర్య మృతదేహం, శనివారం తెల్లవారుజామున నాగు మృతదేహాలు లభ్యమయ్యాయి. బానోతు సూర్యకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  నాగుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 

గ్రామస్థుల కన్నీటి వీడ్కోలు 

సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో సూర్య, నాగు మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. గ్రామస్థులు ఆస్పత్రికి పెద్దసంఖ్యలో తరలివచ్చారు. గణేష్‌ శోభాయాత్రలో తమతో ఆనందోత్సాహాలతో తిరిగిన ఇద్దరూ మృత్యువాత పడటాన్ని గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రామం విషాదంలో మునిగిపోయింది. మృతులిద్దరూ వరుసకు బాబాయ్‌, అబ్బాయిలు కావడం, ఒకే తండాకు చెందిన వారు కావడంతో శని వారం నిర్వహించిన అంత్య క్రియల్లో తండావాసులంతా పాల్గొన్నారు. 

పలువురి పరామర్శ

గణేష్‌ నిమజ్జనం సందర్బంగా ప్రమాదవశాత్తు కాల్వలో జారిపడి మృతి చెందిన నాగు, సూర్యల మృతదేహాలకు డీసీఎంఎస్‌ చైర్మన్‌ వట్టె జానయ్యయాదవ్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. వీరితో పాటు నాయకులు డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌, మర్ల చంద్రారెడ్డి, రామూర్తియాదవ్‌, సామ మల్లారెడ్డి, మల్సూర్‌నాయక్‌ ఉన్నారు. 



Updated Date - 2022-09-11T05:12:15+05:30 IST