రైతు ఓట్లపై టీఆర్‌ఎస్‌ నజర్‌

ABN , First Publish Date - 2022-09-30T06:56:59+05:30 IST

మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికకు అక్టోబరు రెండో వారంలో నోటిఫికేషన్‌ రానుందన్న సమాచారంతో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ దూకుడు పెంచింది. మునుగోడును ఎట్టి పరిస్థితుల్లోనైనా ఖాతాలో వేసుకోవాలనే లక్ష్యంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు.

రైతు ఓట్లపై టీఆర్‌ఎస్‌ నజర్‌

నేడు, రేపు నియోజకవర్గంలో రైతులను కలవనున్న నేతలు

43వేల కుటుంబాలు లక్ష్యంగా విస్తృత ప్రచారం

ఇంటింటికీ వెళ్లనున్న గులాబీ శ్రేణులు

నల్లగొండ, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికకు అక్టోబరు రెండో వారంలో నోటిఫికేషన్‌ రానుందన్న సమాచారంతో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ దూకుడు పెంచింది. మునుగోడును ఎట్టి పరిస్థితుల్లోనైనా ఖాతాలో వేసుకోవాలనే లక్ష్యంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రతీ మండలంలో ఆత్మీయ సమ్మేళనాలు, విందులు, వినోదాలు ఏర్పాటు చేయడంతోపాటు సామాజికవర్గాల వారీగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాక రైతు ఓట్లే ప్రధాన లక్ష్యంగా అధికార పార్టీ పావులు కదుపుతోంది. అందులో భాగంగా ఈ నెల 30, వచ్చే నెల 1వ తేదీన నియోజకవర్గ వ్యాప్తంగా రైతులను కలిసేందుకు టీఆర్‌ఎస్‌ ప్రణాళిక రూపొందించింది.

నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో టీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిం ది. అందులో భాగంగా సామాజికవర్గాల వారీగా ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా విందులు ఏర్పాటుచేసింది. నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ ఓట్లను రాబట్టుకునేందుకు ప్రత్యేకంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించింది. ఇక ప్రధానంగా బీసీ ఓటర్లను ఆకట్టుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గౌడ, యాదవ, రజక, చేనేత, ఇతర బీసీ ఉప కులాల ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రణాళిక రూపొందించారు. ముదిరాజ్‌ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంచేస్తూ వారికి అందజేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీ నాయకులు ఎక్కడికక్కడ వివరిస్తున్నారు. అన్ని సామాజికవర్గాల ఓటర్లను లక్ష్యంగా చేసుకుని టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఓ వైపు కాంగ్రెస్‌, బీజేపీని టార్గెట్‌చేస్తూనే మరోవైపు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు ప్రయత్నాలు  ముమ్మ రం చేశారు. విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ క్యాడర్‌ను ఉప ఎన్నికకు సమాయత్తం చేస్తున్నారు. 

రైతు ఓట్లు రాబట్టేందుకు

నియోజకవర్గంలో మొత్తం 43వేల రైతు కుటుంబాలు ఉన్నాయి. వారందరిని కలిసి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను వివరించి ఓట్ల రూపంలో లబ్ధిపొందేందుకు టీఆర్‌ఎస్‌ ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగా ఈ నెల 30, వచ్చేనెల 1వ తేదీ రెండు రోజుల పాటు నియోజకవర్గంలోని పల్లెపల్లెకు టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు వెళ్లి రైతు కుటుంబాలను కలవనున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాలను వారికి వివరించి ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నారు. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి వివరాలను అధికార పార్టీ సేకరించింది. వారి ఓట్లు సైతం ఖాతాలో వేసుకునేందుకు అధికార పార్టీ అడుగులు వేస్తోంది.

నోటిఫికేషన్‌ నాటికి మరింత మమేకం

నోటిఫికేషన్‌ వచ్చే నాటికి ఓటర్లతో మరింత మమేకం అయ్యేందుకు అధికార పార్టీ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తోంది. ఇప్పటికే సామాజికవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు, విందులు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారం ఉధృతం చేసింది. ప్రభుత్వ పథకాలే ప్రధాన ప్రచార అంశాలుగా ఓటర్లను ఆకట్టుకోవాలని చూస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడితే ఇలాంటి కార్యక్రమాలకు భారీగా ఖర్చు పెట్టే అవకాశం ఉండవు. ఇలాంటి సమావేశాలు, సమ్మేళనాలు నిర్వహిస్తే ఆ ఖర్చును అభ్యర్థుల ఎన్నికల ఖర్చులో ఈసీ చూపుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉప ఎన్నిక నోటిఫికేషన్‌కు వచ్చే నాటికి వీలైనంత మేరకు ప్రతీ గ్రామాన్ని చుట్టిరావడం, ప్రతీ కుటుంబాన్ని కలవడం, ప్రతి సామాజికవర్గంతో ప్రత్యేకంగా భేటీ అవడంతోపాటు, ఆయా సామాజికవర్గాల ముఖ్య నేతలను గ్రామాల్లో దించి ప్రచారాన్ని విస్తృతం చేయాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించుకుంది.

Read more