నల్లగొండ జిల్లాలో విషాదం

ABN , First Publish Date - 2022-03-18T06:15:57+05:30 IST

నల్లగొండ జిల్లాలో గురువారం నీటిలో మునిగి ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. నేరేడుగొమ్ము, త్రిపురారం మండలాల్లో జరిగిన ఈ ఘటనలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

నల్లగొండ జిల్లాలో విషాదం
బాలరాజు(ఫైల్‌)

 నేరేడుగొమ్ములో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

 త్రిపురారం, చిట్యాలలో ఇద్దరు గల్లంతు

నేరేడుగొమ్ము/త్రిపురారం, మార్చి 17: నల్లగొండ జిల్లాలో గురువారం నీటిలో మునిగి ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. నేరేడుగొమ్ము, త్రిపురారం మండలాల్లో జరిగిన ఈ ఘటనలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నేరేడుగొమ్ముకు చెందిన సాయి లు, ఎల్లమ్మ దంపతుల మూడో కుమారుడైన బాలరాజు(36) వ్యవసా యం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. బాలరాజు తండ్రి కొంతకాలం కిందట మృతి చెందాడు. బాలరాజు బుధవారం సాయంత్రం అదే  గ్రా మానికి చెందిన అన్నెపాక శ్రీను, బుడిగెపాక శ్రీను, వెంకటయ్య, ఇంద్రకంటి ఈదయ్య, అంజయ్యలతో కలిసి నేరేడుగొమ్ము గ్రామ శివారులోని కొత్తచెరువు వద్దకు చేపల వేటకు వెళ్లాడు. చేపల కోసం చెరువులో దిగి న బాలరాజు వల కాళ్లకు చుట్టుకుని నీట మునిగిపోయాడు. గమనించి న స్నేహితులు బాలరాజును బయటకు తీసే లోపే మృతి చెందాడు. ఘటన విషయాన్ని బాలరాజు కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈత వచ్చినప్పటికీ నీట మునిగి మృతి చెందడంతో బాలరాజు సోదరుడు విజయ్‌, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు. బాలరాజు అవివాహితుడు కాగా, గురువారం రాత్రి నేరేడుగొమ్ములో అంత్యక్రియలు నిర్వహించారు.

ఎడమ కాల్వలో స్నానానికి వెళ్లి

దైవదర్శనం కోసం వచ్చి సాగర్‌ ఎడమకాల్వలో స్నానానికి దిగిన వ్యక్తి నీటిలో గల్లంతయ్యాడు. నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన ఆరుగురు నిడమనూరు మండలంలోని కోటమైసమ్మ దేవాలయం వద్ద జరిగిన వేడుకకు హాజరయ్యారు. వేడుక అనంతరం వాహనంలో సాయంత్రం 4.30 సమయంలో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ముకుందాపురం సమీపంలోని సాగర్‌ ప్రధాన ఎడమకాల్వలో స్నా నానికి దిగారు. ఆ సమయంలో నీటి ఉధృతి అధికంగా ఉండటంతో ఆరుగురిలో ఒకరైన ఆకుల చంద్రమౌళి(45) కొట్టుకుపోతుండగా సహ చరులు బయటకు లాగేందుకు ప్రయత్నించారు. సమీపంలో దుస్తులు ఉతుకుతున్న మహిళలు చీరలు విసిరి కాపాడటానికి ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. నీటి ఉధృతికి గల్లంతయ్యాడు. ఎస్‌ఐ అజ య్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పక్కనే ఉన్న పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌ వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. చంద్రమౌళి కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తుండగా, భార్య, కుమార్తె (16) కుమారుడు (14) ఉన్నారు. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ అజయ్‌కుమార్‌ తెలిపారు.

ఈత రాకపోయినా దూకి..

 చిట్యాల మండలంలో బావిలో గల్లంతైన బాలుడు  

చిట్యాల రూరల్‌ : ఈత రాకపోయినా బావిలో దూకి బాలుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో గురువారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆరెగూడెం గ్రామానికి చెందిన షేక్‌ అబ్దుల్‌(16) గ్రామానికి చెందిన మనోజ్‌, శివ, మహేష్‌, సిద్దార్థ, తేజలతో కలిసి ఈత కొట్టేందుకు పెద్దకాపర్తి శివారులోని వ్యవసాయ బావికి గురువారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో వెళ్లాడు. ఇద్దరు ఈత కొట్టేందుకు బావిలో దిగగా, మిగతా నలుగురు బావిపై కూర్చున్నారు. ఇంతలో ఈత రాకపోయినా తానూ ఈతకొడతానని అబ్దుల్‌ బావిలోకి దూకాడు. నీటిలో మునుగుతూ తేలుతుండగా బావిలో ఉన్న ఇద్దరు బయటకు తీసేందుకు ప్రయత్నించినా సఫలం కాలేదు. అబ్దుల్‌ నీటిలో మునిగిపోయాడు. భయంతో బావిలో ఉన్న ఇద్దరు బయటకు వచ్చి స్థానికులకు తెలపడంతో హుటాహుటిన స్థానికులు బావి వద్దకు వెళ్లి వెతికారు. చీకటి కావడంతో బావిలో వెతకడం కష్టసాధ్యమైంది. సంఘటన విషయాన్ని స్థానికులకు తెలపడంతో సర్పంచ్‌ మర్రి జలంధర్‌రెడ్డి, తహసీల్దార్‌ మాలి కృష్ణారెడ్డి, ఎస్‌ఐ సైదాబాబాలు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గురువారం రాత్రి 11 గంటలవరకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా అబ్దుల్‌ తండ్రి పదేళ్ల కిందట చనిపోగా, తల్లి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో తాత ఆరెగూడెం వీఆర్‌ఏ రంజాన్‌ ముగ్గురు మనమళ్లను పోషిస్తున్నాడు. షేక్‌ అబ్దుల్‌ ముగ్గురిలో చిన్నవాడు. Read more