వారు ఆధిపత్య వర్గాలకు చెందిన గజ దొంగలు

ABN , First Publish Date - 2022-10-11T06:34:56+05:30 IST

బంగ్లాల్లో ఉండే ఆధిపత్య వర్గాలకు చెందిన గజ దొంగలు నేటి పాలకులని బహుజన సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణకుమార్‌ అన్నారు. చండూరు, పుల్లెంల, ఇడికూడ గ్రామాల్లో వడ్డెరవాడ, దళితవాడల్లో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.

వారు ఆధిపత్య వర్గాలకు చెందిన గజ దొంగలు
పుల్లెంలలో దళితవాడలో ప్రచారం నిర్వహిస్తున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

టీఆర్‌ఎస్‌, బీజేపీ భారీగా డబ్బు, మద్యం డంప్‌ చేశాయి

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌


చండూరు రూరల్‌, చండూరు, అక్టోబరు 10: బంగ్లాల్లో ఉండే ఆధిపత్య వర్గాలకు చెందిన గజ దొంగలు నేటి పాలకులని బహుజన సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణకుమార్‌ అన్నారు. చండూరు, పుల్లెంల, ఇడికూడ గ్రామాల్లో వడ్డెరవాడ, దళితవాడల్లో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. 75 ఏళ్ల నుంచి దొరలు, పెత్తందార్లు, భూస్వాములకు ఇష్టం లేకపోయినా ఓటు వేశామని, ఇంకా ఎన్నాళ్లీ బానిస బతుకులని ప్రశ్నించారు. మునుగోడులో టీఆర్‌ఎస్‌ నకిలీ ఓట్లతో గెలవాలని చూస్తోందని, ఇప్పటికే 23వేల మంది కొత్తగా ఓటర్‌గా దరఖాస్తు చేసుకున్నారన్నారు. వాటిని వెంటనే విచారించి నకిలీ ఓట్లను తొలగించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ మద్యం, డబ్బు డంప్‌ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేయాలని చూస్తోందన్నారు. బీఎస్పీ నిజాయితీ ఉన్న బీసీ బిడ్డకు టికెట్‌ ప్రకటిచాక టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రె్‌సకు నిద్రపట్టడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు బీఎస్పీ అభ్యర్థికి మద్దతు తెలపడంతో ఏంతోచక డబ్బు వెదజల్లి ప్రధాన పార్టీలు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను కొనుగోలుచేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత నాయకులు ఐదేళ్లకు ఒక సారి జనాల్లోకి వస్తారని, అయితే జనంలో ఉండే వారినే ఎన్నుకుంటే మన సమస్యలు తీరుతాయన్నారు. ఉప ఎన్నికలో బీఎస్పీ ఏనుగు గుర్తుకు ఓటు వేసి అందోజు శంకరాచారికి అవకాశం ఇవ్వాలన్నారు. తాము అధికారంలోకి వస్తే తొలి సంతకం మద్యపాన నిషేధంపై సంతకం పెడతామన్నారు. ప్రతి ఇంటికి ఒక ఎకరం భూమి మహిళ పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేస్తామని, ఉచితంగా ఇల్లు కట్టిస్తామని, 10లక్షల ఉద్యోగాలు కల్పించి, అందులో 50శాతం మహిళలకు కల్పిస్తామన్నారు. అనంతరం బీఎస్పీ అభ్యర్థి అందోజు శంకరాచారి మాట్లాడుతూ, రాజగోపాల్‌రెడ్డి, బీజేపీ స్వార్థం కోసమే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని అన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ ఆధిపత్య ఫలితమే ఈ ఉప ఎన్నిక అన్నారు. అంతేతప్ప బడుగు, బలహీన వర్గాల గురించి ఆలోచించే వారు ఎవ్వరూ ఈ ఉప ఎన్నికలో పోటీ చేయడం లేదన్నారు. పేదల పక్షాన బరిలో నిలిచిన తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కట్ల జగన్నాధం, ప్రమీల, పూదరి నర్సింహ, ఏర్పుల అర్జున్‌, కవిత, సుజాత, గణేష్‌, శివ, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

Read more