యథేచ్ఛగా పారబోస్తున్నారు

ABN , First Publish Date - 2022-09-10T06:25:37+05:30 IST

భూదాన్‌పోచంపల్లి మండలపరిధిలోని దోతిగూడెం, అంతమ్మగూడెం గ్రామాల్లోని హెజిలో ల్యాబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తోపాటు ఇతర ఫార్మా కంపెనీలు కంపెనీ వ్యర్థాలను శుద్ధి చేయకుండా యథేచ్ఛగా వదిలిపెడుతున్నాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తేల్చి చెప్పింది.

యథేచ్ఛగా పారబోస్తున్నారు
బోరులో నుంచి నల్లగా వస్తున్న నీరు

రసాయనాలపై ఫార్మా కంపెనీలపై ఎన్జీటీకీ నివేదిక

భూదాన్‌పోచంపల్లి, సెప్టెంబరు 9: భూదాన్‌పోచంపల్లి మండలపరిధిలోని దోతిగూడెం, అంతమ్మగూడెం గ్రామాల్లోని హెజిలో ల్యాబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తోపాటు ఇతర ఫార్మా కంపెనీలు కంపెనీ వ్యర్థాలను శుద్ధి చేయకుండా యథేచ్ఛగా వదిలిపెడుతున్నాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తేల్చి చెప్పింది. కొన్ని కంపెనీలు పరిశ్రమలో వ్యర్థాలను శుద్ధిచేయకుండానే బయటకు వదులుతుండడంతో పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం ఏర్పడి, దుర్గంధం వ్యాపిస్తోందని తెలిపింది. నిర్ధిష్ట కాలవ్యవధిలో కలుషిత వ్యర్థాలను తొలగించేలా కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని ఈ నెల 6వ తేదీన రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి (పీసీబీ) ఆదేశాలు జారీ చేసింది. వాయు కాలుష్యంపై కాలానుగణంగా పర్యవేక్షణ చేపట్టాలని సూచించింది. ఈమేరకు సీపీసీబీ సంస్థ చెన్నైలోని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ)కి నివేదిక అందజేసింది. హెజిలో ల్యాబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వల్ల భూగర్భ జలాలతోపాటు వాయు కాలుష్యం ఏర్పడుతోందని ఎన్జీటీలో మూడు నెలల క్రితం అంతమ్మగూడెం గ్రామస్థులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో భాగంగా సీపీసీబీని కంపెనీ కాలుష్యంపై పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు సీపీసీబీ ఈ ప్రాంతంలో పర్యటించి ఎన్జీటీకి నివేదిక సమర్పించింది. హెజిలో ల్యాబ్స్‌ శుద్ధి చేయకుండా వ్యర్థాలను పైపుల ద్వారా పరిసర రైతుల పొలాల్లోకి వదులుతున్నట్లు పరిశీలనలో తేలిందని తెలిపింది. ఇక్కడ నీరు, మట్టిని పరిశీలిస్తే శుద్ధి చేయకుండానే వ్యర్థ నీటిని వదిలినట్లు కనిపిస్తోందని తెలిపింది. హెజిలో ల్యాబ్స్‌తోపాటు ఇతర పరిశ్రమల నుంచి శుద్ధి చేయని వ్యర్థాలు వస్తున్నట్లు తెలిపింది. ఘనవ్యర్థాల సేకరణకు ఏర్పాట్లు లేవని, ఆర్వో ప్లాంట్‌ను వారానికి రెండుసార్లు మాత్రమే వినియోగిస్తున్నారని తెలిపింది. ఫిబ్రవరిలో రాష్ట్ర పీసీబీ ఎనిమిది పరిశ్రమలకు నోటీసులు జారీ చేసిందని తెలిపింది. హెజిలో ల్యాబ్స్‌తోపాటు వీజేసాయి కెమ్‌, రావూస్‌ లేబొరేటరీస్‌, ఆప్టిమస్‌ డ్రగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఆర్కిమెడిస్‌ ల్యాబొరేటరీస్‌, ఎస్‌వీఆర్‌ లేబొరేటరీస్‌, కెమిక్‌ లైఫ్‌ సైన్స్‌, బృందావన్‌ ల్యాబొరేటరీలకు నోటీసులు జారీ చేస్తూ కలుషిత నీటిని తొలగించాలని ఆదేశించింది. 


రాష్ట్ర పీసీబీ చర్యలు తీసుకోవాలి

శుద్ధి చేయని వ్యర్థాలను బయటకు వదలకుండా రాష్ట్ర పీసీబీ చర్యలు తీసుకోవాలని సీపీసీబీ సిఫారసు చేసింది. వాయు కాలుష్య నివారణ చర్యలు తీసుకుని, దానికి రికార్డులు నిర్వహించేలా చూడాలని పేర్కొంది. పంట దిగుబడుల అభివృద్ధికి వ్యవసాయ యూనివర్సిటీ కాలుష్య తీవ్రతను పర్యవేక్షిస్తూ పరిష్కార మార్గాలను సూచించాలని తెలిపింది. హెజిలో వెలుపల ఉన్న వ్యర్థాలను కంపెనీ ఖర్చులతో తొలగించేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది. శుద్ధి చేయని వ్యర్థాలను వదలకుండా రాష్ట్ర పీసీబీ పర్యవేక్షించాలని నివేదికలో పేర్కొంది. 

Updated Date - 2022-09-10T06:25:37+05:30 IST