ఐదు రోజులైనా దొరకని బాలుడి ఆచూకీ

ABN , First Publish Date - 2022-10-11T05:43:05+05:30 IST

నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం గ్రామంలో ఈ నెల 6న నాగార్జునసాగర్‌ ఎడమకాల్వలో గల్లంతైన బాలుడి ఆచూకీ ఇంతవరకు లభించలేదు. ఐదు రోజులుగా బాలుడి ఆచూకీ కోసం కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

ఐదు రోజులైనా దొరకని బాలుడి ఆచూకీ
మేకల వెంకట్‌

నిడమనూరు, అక్టోబరు 10 :  నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం గ్రామంలో ఈ నెల 6న నాగార్జునసాగర్‌ ఎడమకాల్వలో గల్లంతైన బాలుడి ఆచూకీ ఇంతవరకు లభించలేదు. ఐదు రోజులుగా బాలుడి ఆచూకీ కోసం కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. దసరా పండుగ సెలవులకు మండలంలోని ముప్పారంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చిన పెద్దవూర మండలం నాయనివానికుంట గ్రామానికి చెందిన మేకల బ్రహ్మయ్య, శివలీల దంపతుల కుమారుడు వెంకట్‌ కాల్వనీటిలో బట్టలు ఉతికేందుకు అమ్మమ్మ మర్రి లక్ష్మమ్మ వెళ్తుండగా వెంట వెళ్లి ప్రమాదవశాత్తు కాల్వలో జారిపడి గల్లంతయ్యాడు. కళ్ల ముందే మనవడు నీటిలో కొట్టుకుపోతుండటంతో విలపించిన లక్ష్మమ్మ కేకలు వేయగా కొందరు గ్రామస్థులు వచ్చి వెతికినప్పటికీ బాలుడి జాడ కనిపించలేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఇంతవరకు ఫలితంలేదు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సాగర్‌ కాల్వలో ఇటీవల వినాయక, దుర్గమ్మఅమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఒకవేళ బాలుడి విగ్రహాలకు చిక్కుకుండొచ్చని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాల్వలో నీటిని విడుదలను నిలిపివేస్తేనే ఆచూకీ లభించే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. కాగా బాలుడి ఆచూకీ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎస్‌ఐ శోభన్‌బాబు తెలిపారు.


Updated Date - 2022-10-11T05:43:05+05:30 IST