వర్షం బీభత్సం

ABN , First Publish Date - 2022-09-30T07:02:47+05:30 IST

నల్లగొండ పట్టణంలో గురువారం సాయంత్రం వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి.

వర్షం బీభత్సం
మిర్యాలగూడలో ప్రధాన రహదారిపై నిలిచిన నీరు

తడిసి ముద్దయిన జిల్లా 

నల్లగొండ / దేవరకొండ / మిర్యాలగూడ, సెప్టెంబరు 29 : నల్లగొండ పట్టణంలో గురువారం సాయంత్రం వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. సాయంత్రం నుంచి వర్షం కురుస్తుండడంతో వాహన రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ఎన్జీ కళాశాలలో బతుకమ్మ సంబరాలకు అంతరాయం ఏర్పడింది. గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ ప్రజలకు రెండు రోజుల నుంచి సాయంత్రం కురుస్తున్న వర్షాలు ఉపశమనం కలిగించాయి. ఆకాశమంతా మేఘావృతమై చిరుజల్లులతో వాతావరణం చల్లబడింది. జిల్లావ్యాప్తంగా 21.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దేవరకొండలో 78.5 అత్యధికంగా, నకిరేకల్‌ 10.4 మిల్లీమీటర్ల అత్యల్ప వర్షపాతం నమోదైంది. జిల్లాలో కురుస్తున్న వర్షాలతో మెట్ట పంటలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ వర్షాలతో రైతులు ఉత్సాహంగా ఉన్నారు. 

మిర్యాలగూడలో వానోస్తే విలవిల

మోస్తరు వర్షం కురిస్తే చాలు మిర్యాలగూడ పట్టణ రోడ్లు నదులను తలపిస్తున్నాయి. గురువారం 20 నిమిషాల పాటు కురిసిన వర్షానికి రోడ్లపైకి చేరిన నీరు పట్టణ ప్రజలను, ప్రయాణికులను తీవ్ర ఇక్కట్ల పాలు చేసింది. ఆర్టీసీ బస్టాండ్‌ పక్కనున్న విద్యుత్‌ డీఈ కార్యాలయ ఆవరణలోకి నీరు చేరి సిబ్బంది, వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  రిజిష్ర్టేషన్‌ కార్యాలయం ముందు రోడ్డుపై మూడు అడుగుల మేర బురదనీరు నిలిచి చర్చి రోడ్డు నుంచి ఆర్డీవో కార్యాలయానికి వెళ్లే పాదాచారులు, వాహనదారులు రాకపోకలకు అంతరాయం నెలకొంది. వినోభానగర్‌, సుందర్‌నగర్‌ రోడ్లు వరదనీటితో నిండిపోయాయి. నల్లగొండ రోడ్డులో వీటీ థియేటర్‌ వద్ద వరద నీరు రోడ్డుపై ప్రవహించడంతో వివిధ గ్రామాలకు వెళ్లే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.  రాజీవ్‌చౌరస్తా వద్ద నాలా పొంగి రోడ్డుపై మురుగు నీరు ప్రవహించింది.  పుష్కరకాలంగా అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనుల్లో పురోగతి లేకపోవడంతో కొద్దిపాటి వర్షానికే నాలాలు పొంగి రోడ్లపై ప్రవహిస్తుండటంతో లోతట్టు కాలనీల్లోకి బురద నీరు చేరి ప్రజాఆరోగ్యానికి ముప్పు కలుగుతోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించి నాలాల కంపు నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

దేవరకొండలో పిడుగుపాటు

దేవరకొండలో ముసురు పడింది. ఉరుములు, మెరుపులురాగా పట్టణంలోని హనుమాన్‌నగర్‌లో కొర్ర దేవనాయక్‌ ఇంటిపైభాగాన పిడుగుపడడంలో ఇంటి ఎలివేషన్‌ గోడ పాక్షికంగా దెబ్బతింది. దీంతో అయ్యప్పనగర్‌ కాలనీ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాలనీలోని పలువురి ఇళ్లలో టీవీలు, ఫ్రిజ్‌లు, ఎలక్ర్టానిక్‌ వస్తువులు కాలిపోయాయి.  

Updated Date - 2022-09-30T07:02:47+05:30 IST