వర్షం బీభత్సం

ABN , First Publish Date - 2022-09-30T06:01:55+05:30 IST

జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. సూర్యాపేట, నడిగూడెం, తుంగతుర్తి, మోతె మండలాల్లో మూడు నుంచి నాలుగు గంటల పాటు భారీగా వర్షం కురిసింది.

వర్షం బీభత్సం
సూర్యాపేట పట్టణంలో నీట మునిగిన జిల్లా కేంద్రంలోని60 ఫీట్ల రోడ్డు ప్రాంతం

సూర్యాపేటటౌన్‌ / నడిగూడెం / మోతె / గరిడే పల్లి / నేరేడుచర్ల / ఆత్మకూర్‌(ఎస్‌) / మునగాల రూరల్‌ / పెన్‌పహాడ్‌ / అర్వపల్లి /తిరుమలగిరి, సెప్టెంబర 29  : జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. సూర్యాపేట, నడిగూడెం, తుంగతుర్తి, మోతె మండలాల్లో మూడు నుంచి నాలుగు గంటల పాటు భారీగా వర్షం కురిసింది. దీంతో ఆయా మండలాల్లో చెరువులు నిండి అలుగుపోస్తున్నాయి.  కల్వర్టుల మీదుగా వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచాయి. గంటల వ్యవధిలో కురిసిన వర్షం అందరినీ హడలెత్తించింది. 

జిల్లా కేంద్రంలో మునిగిన 60 ఫీట్ల రోడ్డు ప్రాంతం 

జిల్లాకేంద్రంలో బుధవారం అర్ధరాత్రి 12గంటలకు మొద లైన వర్షం ఎడతెరిపి లేకుండా నాలుగుగంటల పాటు కురిసింది. దీంతో పలు కాలనీలు, ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా 60 ఫీట్ల రోడ్డు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. 37, 38 వార్డులతో పాటు పుల్లారెడ్డి చెరువుకు వెళ్లే మురుగు కాల్వ పొంగి పొర్లడంతో చుట్టుపక్కల ఇళ్లలోకి చేరింది. మునిసిపల్‌ అధికారులు మురుగు కాల్వకు గండికొట్టి వరద నీటిని దారి మళ్లించారు.  

అడ్డుగా జాలీ.. పొంగిన వరద

పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీరు జమ్మిగడ్డ ప్రాంతంలోని మురుగుకాల్వ ద్వారా పుల్లారెడ్డిచెర్వులోకి వెళ్తుంది. అయితే ఇటీవల కాల్వలో చెత్తాచెదారం, ప్లాస్టిక్‌ బాటిల్స్‌ రాకుండా అధికారులు జాలిని ఏర్పాటు చేశారు. అయితే జాలికి చెత్తాచెదారం అడ్డుగా నిలిచి వర్షపు నీరు వెళ్లకుండా అడ్డుపడింది. దీంతో వరదంతా రోడ్లుపై ప్రవహించి 39, 36 వార్డుల్లోని గోపాలపురం, డీమార్ట్‌ ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరింది. నీట మునిగిన ప్రాంతాలను మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల్లో అన్ని సహాయక చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే మునిసిపల్‌ సిబ్బందిని సంప్రదించాలన్నారు. 

వణికిన నడిగూడెం

మూడు గంటల పాటు కురిసిన వర్షానికి నడిగూడెం మండల కేంద్రంలోని ప్రజలు చిగురుటాకులా వణికిపోయారు. రెండేళ్ల కిందట ఇదే పరిస్థితి నెలకొనగా, అధికారులు చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహించడంతో స్థానిక కాలనీలు నీటమునిగాయి. దీంతో బుధవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి జనం ఉలిక్కిపడ్డారు. వీధులన్నీ వరద నీటితో నిండాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం, భారీవర్షంతో ఏంజరుగుతుందో తెలియక జనం బెంబేలెత్తిపోయారు. స్థానిక చౌదరిచెరువు అలుగు నీరు బస్టాండ్‌ వద్ద కల్వర్టు నుంచి బీసీ, ఎస్సీ కాలనీలను ముంచెత్తింది. ఎస్‌బీఐ శాఖ వరకు నడుము లోతునీరు ప్రవహించడంతో నడిగూడెం నుంచి నాయకన్‌గూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. సర్పంచ్‌ గడ్డం నాగలక్ష్మీమల్లే్‌షయాదవ్‌ తెల్లవారుజూమున మూడు గంటలకే రత్నవరం వెళ్లేరోడ్డుకు గండిపెట్టి ఎస్సీకాలనీ వరద ముంపుకు గురికాకుండా సహాయక చర్యలు చేపట్టారు. తెల్లారేవరకు చెరువు అలుగు వరద కొనసాగడంతో తహసీల్దార్‌ టి.నాగేశ్వరావు, ఎంపీపీ యాతాకుల మధుబాబు, జడ్పీటీసీ బాణాల కవిత పలు కాలనీలను సందర్శించి కమిటీ హాల్‌లో పునరావాసం కల్పించారు. సాయంత్రానికి వరద ఉధృతి తగ్గడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఊపిరిపీల్చుకున్నారు. మూడు గంటల్లోనే 7.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నెల 27న 4.90, 28న 2.52 సెంటీమీటర్ల వర్షం కురవగా ఈ నెలలో సాధారణ వర్షపాతం 16.24 సెంటీమీటర్లు కాగా గురువారం నాటికి 19.93 సెంటీమీటర్లుగా నమోదైంది. 2.43శాతం అధికంగా వర్షం కురిసింది. 

మోతె మండలంలో భారీ వర్షానికి చెరువులు, కుంటలు అలుగులు పోస్తున్నాయి. మామిళ్లగూడెం నుంచి విభలాపురం వెళ్లే రోడ్డు బ్రిడ్జి గండ్లచెరువు అలుగుపోస్తుండడంతో బ్రిడ్జికి వరద పెరిగింది. దీంతో కల్వర్టుపై పోలీసులు ప్రమాద హెచ్చరికల బారీకేడ్లను ఏర్పాటుచేశారు. 10 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. ఇటీవల రూ.29లక్షలతో నిర్మించిన నామవరం నుంచి గుంజలూరుకు వెళ్లే బ్రిడ్జి వరదలో కొట్టుకుపోయింది. నామవరంలోని చెరువు అలుగు పోస్తుండడంతో సుమారు 400 ఎకరాల వరి పంట నీట మునిగింది. సిరికొండ-రావిపహడ్‌ రోడ్డు కొట్టుకపోయి రాకపోకలు నిలిచాయి. ఉర్లుగొండ బ్రిడ్జి మీద పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నర్సింహాపురం, తుమ్మగూడెం, నేరేడువాయి, గోపతండ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

పిడుగుపాటుకు రెండు ఎద్దులు మృతి

భారీ వర్షానికి తోడు పిడుగుపడి రెండుఎడ్లు మృతి చెందాయి. హుస్సేనాబాదలో రైతు కొమ్ము మల్లయ్యకు చెందిన ఎద్దులను పొలంలోని కొట్టం వద్ద కట్టేశాడు. పిడుగులకు రెండు కాడెడ్లు మృతి చెందాయి. రూ.లక్ష మేర ఆస్తినష్టం జరిగినట్లు బాధిత రైతు తెలిపారు. 

అలుగుపోస్తున్న చెరువులు-నిలిచిన రాకపోకలు 

ఆత్మకూర్‌(ఎస్‌) మండలం దుబ్బగూడెం, కోటపహాడ్‌, నర్సంపేట, దాచారం, తుమ్మల పెన్‌పహాడ్‌, వంటి పలుగ్రామాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. నశీంపేట గ్రామంలో వరద భారీగా వస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.

మునగాల మండలం గణపవరం, తాడ్వాయి వాగులు పొంగిపొర్లుతున్నాయి. గణపవరం వాగు వద్ద బ్రిడ్జి పూర్తిగా మునగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  

 పెన్‌పహాడ్‌ మండలంలో భారీ వర్షానికి రోడ్లు తెగిపోయాయి. దీంతో రాకపోకలు స్తంభించాయి.అన్నారంబ్రిడ్జి, నారా యణగూడెం గ్రామాల మధ్య కల్వర్టు రోడ్డు తెగి రాకపోకలు నిలిచాయి. పోట్లపహాడ్‌ రోడ్డు కల్వర్టుపై చెరువు అలుగు నీరు వరద ప్రవహిస్తోంది.  

 అర్వపల్లి మండలంలో వర్షాలకు చెరువులు, కుంటలు నిండి అలుగుపోస్తున్నాయి. కొమ్మాల, కోడూరు, అర్వపల్లి, తిమ్మాపురం, పర్సాయపెల్లి, కాసర్లపాడు చెరువులు నిండాయి. కోడూరు చెరువు అలుగుబోస్తుండడంతో సూర్యాపేట-తుంగతుర్తి రహదారిపై రాకపోకలు బంద్‌అయ్యాయి. అర్వపల్లి కస్తూర్బా పాఠశాల్లోకి నీరు చేరి చెరువును తలపిస్తోంది.  

 తిరుమలగిరిమండలంలో మూడుగంటల పాటు వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి.  

 గరిడేపల్లి మండలంలోని తాళ్లమల్కాపురం, కీతవారిగూడెం, రాయినిగూడెం, కొత్తగూడెం గ్రామాల్లో వర్షానికి తాళ్లమల్కాపురం బ్రిడ్జిపై వరద నీరు ప్రవహిస్తుంది.  

 నేరేడుచర్ల పట్టణం, మండలంలో భారీవర్షం కురిసంది. జాన్‌పహాడ్‌ రోడ్డులోని లోలెవల్‌ కల్వర్టులు వరద పోతోంది. Read more