‘పట్టణ ప్రగతి’లో గుర్తించిన సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-09-10T05:55:19+05:30 IST

పట్టణ ప్రగతిలో గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు మిట్టగణుపుల ముత్యాలు డిమాండ్‌ చేశారు.

‘పట్టణ ప్రగతి’లో గుర్తించిన సమస్యలు పరిష్కరించాలి

కోదాడ రూరల్‌, సెప్టెంబరు 9: పట్టణ ప్రగతిలో గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు మిట్టగణుపుల ముత్యాలు డిమాండ్‌ చేశారు. పట్టణంలోని 21వ వార్డు కటకంగూడెం రోడ్డులో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రజాసమస్యలు తెలుసుకుంటూ శుక్రవారం సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణ ప్రగతి పేరుతో పట్టణంలోని అన్ని వార్డుల్లో ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుందన్నారు. అయినా నేటికీ వాటిని పరిష్కరించలేదన్నారు. పట్టణంలో డ్రైనేజీలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటుచేసి మూడేళ్లవుతున్నా నేటికీ తీగలు లాగలేదన్నారు. దీంతో చీకట్లో ప్రజలు మగ్గుతున్నారన్నారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, వృద్ధాప్య, వితంతు పెన్షన్లు రానివారు చాలా మంది ఉన్నారని, వారందరికీ ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. వారం రోజులు నిర్వహించిన సర్వేలో గుర్తించిన సమస్యలను పరిష్కరించాలని మునిసిపల్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు దాసరి శ్రీనివాస్‌, నారదాసు శ్రీనివాస్‌, మరియన్న, కర్ణకోటి నవీన్‌, నక్క గోపి, చెంచయ్య, సత్యనారాయణ, లక్ష్మణ్‌, దాసరి రమా, భవాని, ధనలక్ష్మి పాల్గొన్నారు.

Read more