యాదగిరిక్షేత్రంలో పవిత్రోత్సవాలు పరిసమాప్తం

ABN , First Publish Date - 2022-08-10T06:04:32+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో మూడు రోజులుగా కొనసాగుతున్న పవిత్రోత్సవాలు మంగళవారంతో పరిసమాప్తమయ్యాయి.

యాదగిరిక్షేత్రంలో పవిత్రోత్సవాలు పరిసమాప్తం
పవిత్రమాలలను గర్భాలయంలోనికి తీసుకువెళుతున్న అర్చకులు

శాస్త్రోక్తంగా స్వయంభువులకు పవిత్రధారణ

  మహాపూర్ణాహుతి పర్వాలు 

 నేటి నుంచి నిత్యకల్యాణం, హోమపూజలు ఆరంభం

యాదగిరిగుట్ట, ఆగస్టు 9 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో మూడు రోజులుగా కొనసాగుతున్న పవిత్రోత్సవాలు మంగళవారంతో  పరిసమాప్తమయ్యాయి. ప్రధానాలయంలో ఉత్సవమూర్తులకు నవకలశాలతో స్నపన తిరుమంజనం అనంతరం దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేకసేవలో తీర్చిదిద్దారు. ఆలయ అష్టభుజి ప్రాకార మండపంలోని యాగశాల వద్దకు అలంకారమూర్తుల సేవను చేర్చి హోమపూజల అనంతరం మహాపూర్ణాహుతిపర్వాలను నిర్వహించారు. పవిత్రీకరించిన 108 నూలు పోగులతో తయారుచేసిన మాలలను ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంలో ఊరేగించి గర్భాలయంలోకి చేర్చారు. మూలమూర్తులు, సువర్ణప్రతిష్ఠా అలంకారమూర్తుల పాదాలచెంత పూజ లుచేసిన అర్చకులు పవిత్రలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.అనంతరం ప్రధానాలయ విమానగోపురంపైన గల సుదర్శనచక్రానికి ప్రత్యేకపూజలు చేసి పవిత్రమాలలను అలంకరించారు. మహోత్సవ విశిష్టతను దేవస్థాన ప్రధానార్చకులు నల్లన్‌థిఘళ్‌ లక్ష్మీనరసింహాచార్యులు భక్తులకు వివరించారు.విశేషపర్వాలను దేవస్థాన అర్చకబృందం నిర్వహించగా, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డి పాల్గొన్నారు. 

పాతగుట్ట ఆలయంలో

యాదాద్రి దేవస్థాన అనుబంధ పాతగుట్ట ఆలయంలో స్వయంభువులకు పవిత్ర మాలధారణతో ఉత్సవాలు ముగిశాయి. యాగశాలలో మూల మంత్రహవనం జరిపి పూర్ణాహుతి నిర్వహించారు. 108 నూలు ధారాలతో సిద్ధం చేసిన పవిత్రమాలలను ప్రధానాలయ శిఖరంపై సుదర్శనచక్రానికి, గర్భాలయంలోని స్వయంభువులకు, అలంకారమూర్తులకు అలంకరించారు.  

క్షేత్రపాలకుడికి ఆంజనేయుడికి ఆకుపూజ

యాదాద్రిక్షేత్రంలో కొలువైన క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం ఆకుపూజ, స్వామికి నిత్య కైంకర్యాలు, ప్రాకార మండపంలో కోటికుంకుమార్చన పూజలు వైభవంగా నిర్వహించారు. కొండపైన విష్ణుపుష్కరిణి వద్దనున్న ఆంజనేయస్వామిని పంచామృతాలతో అభిషేకించి, అలంకరించారు. తమలపాకులతో సహస్రనామార్చనలు చేశారు. అదేవిఽధంగా అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ క్షేత్రపాలకుడికి విశేషపూజలు కొనసాగాయి. ప్రధానాలయంలోని స్వయంభువులను, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకించి అర్చించారు. ప్రధానాలయ అష్టభుజి ఈశాన్య ప్రాకార మండపంలో మహాలక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తూ అర్చకస్వాములు, రుత్వికబృందం కోటి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా దేవస్థాన ఈవో గీతారెడ్డి, సిబ్బంది ప్రధానక్యాలయంలో జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.20,43,083 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.

నేటినుంచి నిత్యకల్యాణం 

యాదగిరీశుడి సన్నిధిలో పవిత్రోత్సవాల కారణంగా రెండు రోజులుగా రద్దయిన భక్తుల నిత్య, మొక్కు కల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన హోమ పూజలను బుధవారం నుంచి ఆరంభిస్తున్నట్లు ఈవో గీతారెడ్డి తెలిపారు. 

స్వామి సేవలో ప్రముఖులు

యాదగిరిక్షేత్రాన్ని పలువురు ప్రముఖులు సందర్శించారు. ఎమ్మెల్సీ, ప్రభుత్వవిప్‌ ఎంఎస్‌ ప్రభాకర్‌రావు, పునరుత్పాదక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ సతీ్‌షరెడ్డి, శ్రీశైలం మల్లికార్జునస్వామి దేవస్థాన మాజీ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్‌, ప్రముఖ నిర్మాత కొరటాల శివ స్వామిని దర్శించుకుని ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. వీరికి అర్చకస్వాములు ఆలయమర్యాదలతో స్వాగతం తెలిపారు. అష్టభుజి ప్రాకార మండపంలో ఆశీర్వచనం జరపగా అధికారులు వారికి స్వామివారి అభిషేకం లడ్డూ ప్రసాదాలను అందజేశారు. 

Updated Date - 2022-08-10T06:04:32+05:30 IST