కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందూ దొందే

ABN , First Publish Date - 2022-07-07T05:41:08+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందూ దొందేనని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మండలంలోని రామలింగంపల్లి గ్రామంలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ, బాబు జగ్జీవరామ్‌ విగ్రహాలను ప్రారంభించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందూ దొందే
రామలింగంపల్లిలో మాట్లాడుతున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

సింగరేణిలో అదానీకి లబ్ధి చేకూర్చేలా కేసీఆర్‌ నిర్ణయం 

ఈ కుంభకోణంపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తా

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

యాదాద్రి, బొమ్మలరామారం, జూలై 6(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందూ దొందేనని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మండలంలోని రామలింగంపల్లి గ్రామంలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ, బాబు జగ్జీవరామ్‌ విగ్రహాలను ప్రారంభించారు. మహిళలకు కుట్టుమిషన్లను అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అనవసరంగా కేసీఆర్‌ రాష్ట్రపతి అభ్యర్థిని పిలిపించి రూ.50కోట్ల ప్రజాధనంతో హడావుడి చేశారని చెప్పారు. పాఠశాలలు ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా, ఇప్పటికీ పాఠ్యపుస్తకాలు పంపిణీ కాకపోవడమేమిటని ప్రశ్నించారు. ఈ నెలాఖరు వరకు వచ్చే అవకాశం ఉందని ఉపాధ్యాయులు చెప్పడంతో, తన సొంత ఖర్చుతో పుస్తకాలను పంపిణీ చేస్తానని చెప్పారు. ప్రధాని మోదీ హైదరాబాద్‌ పేరును భాగ్యనగరంగా మారుస్తానని చెబితే, అహ్మదాబాద్‌ను అదానీబాద్‌గా మార్చుకోవాలని కేటీఆర్‌ వ్యాఖ్యానించాఉ. తెలంగాణలో చేస్తున్నదేంటో చెప్పాలని ప్రశ్నించారు. తాను కూడా కేటీఆర్‌ను సూటిగా ప్రశ్నిస్తున్నానని, సింగరేణిలో అదానీకి లబ్ధి చేకూర్చేలా రూ.20వేల కోట్ల టెండర్లను రూ.60వేల కోట్లకు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఒడిశాలోని గోల్డ్‌మైన్‌ను కేంద్ర ప్రభుత్వం సింగరేణికి అప్పగించిందని, రూ.20వేల కోట్ల టెండర్లను రూ.60వేలకోట్లకు పెంచుకుని ముఖ్యమంత్రి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి సమీప బంధువు ప్రతిభా శ్రీనివా్‌సరావు అదానీ కంపెనీతో కలిసి రూ.40వేల కోట్ల కమీషన్‌ పొందుతున్నారని ఆరోపించారు.

సింగరేణి అవినీతిపై న్యాయపోరాటం

 సింగరేణి కుంభకోణంపై పార్లమెంట్‌లో, న్యాయపరంగా పోరాడుతానని తెలిపారు. ఇప్పటికే ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లానని, ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ అదానీకి రూ.వేలకోట్లు దోచిపెడుతున్నందున... హైదారాబాద్‌ను కూడా అదానీబాద్‌గా మార్చాలన్నారు. నాలుగురోజులపాటు బీజేపీ హంగామా సృష్టించిందని, టీఆర్‌ఎస్‌, బీజేపీలు పోటీపడి సభలు పెట్టుకుని ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నాయన్నారు. పోటీపడి ఇరు పార్టీలు తిట్టుకున్నట్లు డ్రామాలు చేస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్‌ అవినీతిపై వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ నేతలు, సీఎంపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. కొండపోచమ్మ, మల్లన్నసాగర్‌లు నిండుతాయి, బస్వాపూర్‌ ప్రాజెక్టుకు మాత్రం నీరు రావడంలేదన్నారు. రూ.500కోట్లతో గంధమల్ల ప్రాజెక్టు నిర్మిస్తామని టెండర్లు పిలిచి, ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. దళితబంధు ఎన్నికల కోసమేనని, ఆ తర్వాత ఈ పథకం ఉండదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య, సర్పంచ్‌లు సత్యనారాయణ, కవిత, ఎంపీటీసీ హేమంత్‌రెడ్డి, మండల అధ్యక్షుడు మల్లేశం పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-07T05:41:08+05:30 IST