మునుగోడులో ప్రచార సందడి

ABN , First Publish Date - 2022-08-14T05:37:12+05:30 IST

ప్రధాన పార్టీలతో పాటు చిన్నచిన్న పార్టీలు సైతం మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో నియోజకవర్గంలో సందడి మొదలైంది.

మునుగోడులో ప్రచార సందడి
ప్రచార రథాలు సిద్ధం

నియోజకవర్గానికి చేరుకున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు 

 20న సీఎం సభకు మండలాల వారీగా బాధ్యతలు 

పాదయాత్రలో కాంగ్రెస్‌ నేతలు 

 మాటల తూటాలు పేలుస్తున్న రాజగోపాల్‌

ప్రధాన పార్టీలతో పాటు చిన్నచిన్న పార్టీలు సైతం మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో నియోజకవర్గంలో సందడి మొదలైంది. మేం అంటే మేం అంటూ పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి. రాజగోపాల్‌రెడ్డి పార్టీ వీడడంతో నైరాశ్యం నుంచి బయటపడేసేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రోజుల వ్యవధిలోనే బహిరంగ సభ నిర్వహించడంతో ఇతర పార్టీలూ ఆ బాటలో పయనిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ వరకు వేచి చూద్దామనుకున్న టీఆర్‌ఎస్‌ అనూహ్యంగా నిర్ణయాన్ని మార్చుకుని ఏకంగా గ్రామాల్లో ఎమ్మెల్యేల మకాం వరకు వెళ్లింది. ప్రధాన పోటీదారులు జనంలోకి వెళ్లడంతో గ్రాఫ్‌ పడిపోకుండా ఉంచేందుకు, 21న తనతో పాటు బీజేపీలో పెద్ద సంఖ్యలో చేరికలకు ప్రాధాన్యమిస్తూ మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నేతలకు కౌంటర్లు ఇస్తూ తన మార్కు బ్రాండ్‌ను కొనసాగిస్తున్నారు. సీపీఐ, సీపీఎం నేతలు వరుస సమావేశాలు  నిర్వహిస్తుండగా, బీఎస్పీ గోడ రాతలతో ప్రచారం ప్రారంభించింది. దళిత శక్తి ప్రోగ్రాం (డీఎస్పీ) బరిలో ఉంటుందని విశారధన్‌, ప్రజాశాంతి కేఏపాల్‌ తన పార్టీ సైతం పోటీలో ఉంటుందని ప్రకటించారు.     

- (ఆంధ్రజ్యోతి ప్రతినిఽధి, నల్లగొండ)

మునుగోడు మండల కేంద్రంలో ఈ నెల 20న లక్ష మందితో నిర్వహించనున్న టీఆర్‌ఎస్‌ సభకు ‘మునుగోడు ప్రజాదీవెన’గా నామకరణం చేశారు. సభకు జనసమీకరణకు కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రచార రథాలు శనివారం నియోజకవర్గానికి చేరా యి. సీఎం కేసీఆర్‌ ఫొటోతో గులాబీ రథాలు గ్రామాల్లో ప్రచారాన్ని ప్రారంభించాయి. సీఎం సభ విజయవంతం చేసేందుకు, జనసమీకరణ కోసం మండలానికి ఇద్దరు నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలను కేటాయించారు. మునుగోడు మండలానికి మంత్రి జగదీ్‌షరెడ్డి, నల్లగొం డ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, నారాయణపురానికి గాదరికిషోర్‌, గొంగిడి సునీత, చౌటుప్పల్‌ మునిసిపాలిటీకి నల్లమోతు భాస్కర్‌రావు, ఎంపీ బడుగుల లింగయ్య, చౌటుప్పల్‌ రూరల్‌కు శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య, మర్రిగూడ మండలానికి పైళ్ల శేఖర్‌రెడ్డి, నాంపల్లి మండలానికి ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ నాయక్‌, చండూరు మునిసిపాలిటీకి చిరుమర్తి లింగయ్య, చండూ రు రూరల్‌ నోముల భగత్‌, జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. బహిరంగ సభ 20న మునుగోడు ఎంపీడీవో కార్యాలయ సమీపంలోని 40ఎకరాల విస్తీర్ణంలో లక్ష మందితో మధ్యాహ్నం 2గంటలకు నిర్వహించనున్నారు. సభ నిర్వహణ బాధ్యతలను మంత్రి జగదీ్‌షరెడ్డి, పార్టీ వ్యవహారాల జిల్లా ఇన్‌చార్జి ఎమ్మె ల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావుకు, సభ ఏర్పాట్ల బాధ్యతను గాదరి బాలమల్లుకు అప్పగించారు. మండలాల వారీగా బాధ్యతలు తీసుకున్న ఎమ్మెల్యేలు శనివారం నుంచే పని ప్రారంభించా రు. చౌటుప్పల్‌ మునిసిపాలిటీ, రూరల్‌ మండలాల బాధ్యతలు చేపట్టిన ఎమ్మెల్యేలు స్థానిక నేతలతో సమావేశమయ్యారు. చండూరులో నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల భగత్‌ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. మంత్రి జగదీ్‌షరెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ శనివారం సాయంత్రం సభాస్థలిని పరిశీలించారు. సీఎం సభను విజయవంతం చేయాలని, పార్టీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకోవాలని, చిన్నచిన్న సమస్యలుంటే ఎన్నికల తర్వాత కూర్చోని పరిష్కరించుకుందామంటూ మండల సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యేలు సందేశం ఇచ్చారు. అధికార పార్టీ నుంచి టికెట్‌ ఆశిస్తూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డిని సీఎం కేసీఆర్‌ శనివారం ప్రగతి భవన్‌కు పిలిపించుకున్నారు. అభ్యర్థి ఎవరనేది సర్వేలు చేయించాం, మీకు మునుగోడులో మంచి పరిచయాలు, బంధుత్వాలు ఉన్నాయి, పార్టీ కోసం కష్టపడి పనిచేయండి, టికెట్‌ ఆశిస్తున్న మిగిలిన వారిని పిలవకుండా మిమ్ముల్నే పిలిచి మాట్లాడడంలో ఆంతర్యం గ్రహించి జిల్లా ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావుతో కలిసి నియోజకవర్గమంతా తిరగండని సీఎం చెప్పినట్టు మీడియాకు కృష్ణారెడ్డి వివరించారు.


కాంగ్రెస్‌ పాదయాత్ర

ఆజాదీకా అమృతోత్సవ్‌లో భాగంగా డీసీసీ అధ్యక్షుడు అనీల్‌కుమార్‌రెడ్డి కొద్ది రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు. శనివారం మునుగోడు నియోజకవర్గంలోని నారాయణపూర్‌ నుంచి చౌటుప్పల్‌ వరకు 12కి.మీ మేర పాదయాత్ర చేశారు. ఈ యాత్రలో పాల్గొంటానని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో ప్రాధాన్యం నెలకొంది. అయితే కొవిడ్‌ లక్షణాలు ఉండటంతో పాదయాత్రకు రాలేకపోతున్నట్లు రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో కొంత నిరాశ ఏర్పడింది. పాదయాత్రలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనీల్‌కుమార్‌, పీసీసీ అధికార ప్రతినిధి పున్నకైలాష్‌, చల్లమల్ల కృష్ణారెడ్డి తదితరు లు పాల్గొన్నారు. ఈనెల 14, 15న నియోజకవర్గంలో కాంగ్రెస్‌ కార్య క్రమాలకు విరామం ఇచ్చారు. 16 నుంచి మండలాల వారీగా సమావేశాలు జరగాల్సి ఉంది. ఈ సమావేశాలకు హాజరవుతానని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తాజాగా ఆయనకు అనారోగ్యంతో షెడ్యూల్‌ ఎలా ముందుకెళ్తుందో చూడాల్సిందే. అదేవిధంగా అభ్యర్థి విషయం లో పోటీలో ఉన్న నేతలతో సంప్రదింపుల విషయం సైతం వాయిదా పడింది. ఇక మునుగోడు వైపు వెళ్లేది లేదని ఎంపీ వెంకట్‌రెడ్డి షరతులు విధిస్తుండగా, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి 16న సమావేశాలకు హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తి గా మారింది. చండూరు సభలో నేతల మాటల తీరుపై జానారెడ్డి ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజుకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో వారు గుర్రుగా ఉన్నారు.


 మాటల తూటాలు పేలుస్తున్న రాజగోపాల్‌రెడ్డి

బీజేపీలో ఈనెల 21న చేరేందుకు నిర్ణయించుకోవడం, అదేరోజు మునుగోడులో అమిత్‌షా సభ, భారీగా చేరికల నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రతీ మం డలంలోని కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులతో భేటీ అవుతూ వారితో కలిసి మీడియాతో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎ్‌సలపై ప్రజాప్రతినిధుల సమక్షంలో విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకే తనపై కుట్రలు చేస్తున్నారని, అమ్ముడు పోయినట్లు రుజువు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమని, అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని, రాష్ట్రంలో కుటుంబ పాలన అంతమొందించాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ, అమిత్‌షాతోనే సాధ్యమని, మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వనున్నారంటూ ఆయన ప్రచా రం చేస్తున్నారు.


బరిలో పలు పార్టీలు

ఉప ఎన్నిక నేపథ్యంలో పోటీ విషయమై సీపీఎం నేతలు వరుసగా రెండుసార్లు చౌటుప్పల్‌లో సమావేశం నిర్వహించారు. సీపీఐ నేతలు చండూరులో శుక్రవారం సమావేశం నిర్వహించారు. సీపీఐ బరిలో ఉంటే సీపీఎం మద్దతివ్వడం, వామపక్షాలు ఐక్యంగా ఒక అభ్యర్థిని ఖరారు చేయాలని ప్రా థమికంగా నిర్ణయించారు. బీజేపీ మొదటి స్థానానికి వెళ్లే పరిస్థితి ఉంటే టీఆర్‌ఎస్‌ లేదా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించాలని నిర్ణయించారు. బీఎస్పీ ఎన్నిక బరిలో ఉంటుందని ప్రవీణ్‌కుమార్‌ ప్రకటించగా, గోడలపై ప్రచార రాతలు సైతం ప్రారంభించారు. అదే విధంగా పోటీలో ఉంటామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్‌, దళితశక్తి ప్రోగ్రాం రాష్ట్ర అధ్యక్షుడు విశారధన్‌ మహారాజ్‌ ప్రకటించారు. 

Updated Date - 2022-08-14T05:37:12+05:30 IST