పదో తరగతి పరీక్షలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-24T06:26:36+05:30 IST

జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా సోమవారం ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రెండేళ్లు పదో తర

పదో తరగతి పరీక్షలు ప్రారంభం
కోదాడలోని పరీక్షా కేంద్రానికి ఆటోలో వచ్చిన చెన్నెంశెట్టి నవీన్‌క్రిష్ణ

సూర్యాపేట అర్బన్‌, మే 23 : జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా సోమవారం ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రెండేళ్లు పదో తరగతి పరీక్షలు నిర్వహించలేదు. దీనికి తోడు ప్రతి ఏడాది మార్చి మొదటి, రెండో వారంలో ప్రారంభమై ఏప్రిల్‌లో ముగించేవారు. ఈ ఏడాది సిలబస్‌ ఆలస్యంగా ప్రారంభమైందన్న కారణంతో పరీక్షలను నెల రోజులకు పైగా ఆలస్యంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నిర్వహిస్తున్న పరీక్షలకు జిల్లాలో 73 కేంద్రాలను ఏర్పాటు చేయగా, 12,563 మంది రెగ్యులర్‌ విద్యార్థులు హాజరుకావాల్సి ఉంది.  సోమవారం నిర్వహించిన తెలుగు పరీక్షకు 12,432 మంది హాజరు కాగా 131 మంది గైర్హాజరయ్యారు. ఇందులో ముగ్గురు ప్రైవేట్‌ విద్యార్థులకు ఒక్కరు గైర్హాజరైనట్లు డీఈవో కె.అశోక్‌ తెలిపారు. పరీక్షను నాలుగు స్క్వాడ్‌ బృందాలు, జిల్లా విద్యాశాఖ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌, పరీక్షల సహాయ సంచాలకులు, జిల్లా స్థాయి పర్యవేక్షకులు పర్యవేక్షించారని తెలిపారు. 

పరీక్షా కేంద్రాల వద్ద సందడి 

పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులతో సందడి నెలకొంది. ఉదయం 8.30 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకొని తమ హాల్‌ టికెట్‌ నెంబర్లు కలిగిన గదులను వెతికారు. 9-30 గంటలకు ప్రారంభమైన పరీక్షా మధ్యాహ్నాం 12.45 నిమిషాల వరకు కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా ఎటువంటి మాల్‌ ప్రాక్టిస్‌ జరగలేదని డీఈవో తెలిపారు. 

కాలుకు గాయమైనా పరీక్షకు

కోదాడటౌన్‌ : కోదాడ మండలం కూచిపూడి గ్రామానికి చెందిన చెన్నెంశెట్టి నవీన్‌కృష్ణ కూచిపూడి హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. తండ్రి నాగేశ్వరరావుతో కలిసి 20 రోజుల క్రితం పొలం పనుల కోసం స్కూటర్‌పై వెళ్తుండగా గేదె అడ్డురావటంతో కిందపడ్డాడు. ఈ ఘటనలో కృష్ణ కాలుకు గాయంకాగా, శస్త్రచికిత్స చేశారు. పదో తరగతి పరీక్ష రాయాల్సి ఉండటంతో తండ్రి సాయంతో కోదాడలోని బాలుర ఉన్నత పాఠశాలపరీక్షా కేంద్రానికి ఆటోలో వచ్చి అందరు విద్యార్థులతో కలిసి పరీక్ష రాశాడు.



Updated Date - 2022-05-24T06:26:36+05:30 IST