టేకుల సోమారం కన్నీటి సంద్రం

ABN , First Publish Date - 2022-06-11T06:39:17+05:30 IST

ఆ ఊరు గుండె బరువెక్కింది. ఒకేసారి ముగ్గురిని కోల్పోవడంతో ఊరంతా విలపించింది. చెమర్చిన కళ్లతో ఆప్తులకు అంతిమ వీడ్కోలు పలికి, బాధిత కుటుంబాలకు ఓదార్పునిచ్చింది. వలిగొండ మండలం టేకులసోమారంలో శుక్రవారం ఈ విషాద ఘటన కన్పించింది.

టేకుల సోమారం కన్నీటి సంద్రం
అంతిమ యాత్రలో గ్రామస్థులు బంధువులు

మృతులకు అంతిమ వీడ్కోలు

ఒకే ట్రాక్టర్‌పై భార్యాభర్తల అంతిమ యాత్ర 

దిక్కుతోచని స్థితిలో చిన్నారులు 

తల్లడిల్లిన టేకులసోమారం గ్రామస్థులు వలిగొండ, జూన్‌ 10: ఆ ఊరు గుండె బరువెక్కింది. ఒకేసారి ముగ్గురిని కోల్పోవడంతో ఊరంతా విలపించింది. చెమర్చిన కళ్లతో ఆప్తులకు అంతిమ వీడ్కోలు పలికి, బాధిత కుటుంబాలకు ఓదార్పునిచ్చింది. వలిగొండ మండలం టేకులసోమారంలో శుక్రవారం ఈ విషాద ఘటన కన్పించింది. భువనగిరి మండలం హనుమాపురం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దండెబోయిన నరసింహ, భార్య రాజ్యలక్ష్మీ వదిన జంగమ్మల అంత్యక్రియలు స్వగ్రామం వలిగొండ మండలం టేకుల సోమారంలో  బాధాతప్త హృదయాల నడుమ కొనసాగాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల రోధనలతో టేకలసోమారం కన్నీటి సంద్రమైంది. ఉదయం 11.30గంటలకు ఇంటి నుంచి మృతదేహాలను రెండు ట్రాక్టర్లపై తరలించారు. ఆ గ్రామ చివరన ఉన్న శ్మశాన వాటికలో మధ్యాహ్నం 3 గంటలకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. భార్యాభర్తలను ఇద్దరిని ఒకే ట్రాక్టర్‌పై జంగమ్మను మరోక ట్రాక్టర్‌పైన తరలించారు. మృతుడు నర్సింహకు తండ్రి భిక్షపతి.. కోడలు రాజ్యలక్ష్మీకి అత్త సత్తెమ్మలు అంతిమ సంస్కారాలు నిర్వహించి చితికి నిప్పంటించారు. జంగమ్మకు కుమారుడు భాస్కర్‌ దహన సంస్కారాలు నిర్వహించారు. నర్సింహ, రాజ్యలక్ష్మిలకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు కాగా, పెద్ద కుమార్తె ఏడో తరగతి, చిన్న కుమార్తె రెండో తరగతి, కుమారుడు ఇంటి వద్దే ఉంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరు ఒకేసారి మృతి చెందడంతో గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబంలో ఒకరినైనా మిగిల్చినా ఆ చిన్నారులకు ఆసరగా ఉండేదని చర్చించుకుంటున్నారు. 


కన్నవారిని చూసి రోదించిన చిన్నారులు

తమ తల్లిదండ్రులు ఏమైపోయారో అర్థంకాక వారి పిల్లలు రోదించిన తీరును స్థానికులను కంటతడి పెట్టించింది. బంధువులు, కుటుంబ సభ్యులు వారి దుఃఖాన్ని చూసి తమ కన్నవారికి ఏమైందో తెలియని స్థితిలో పిల్లలు ఉన్నారు. రెండేళ్ల చిన్నారి జశ్వంత్‌ను సోదరి భవ్యశ్రీ, ఎత్తుకొని తల్లిదండ్రుల దింపుడుగళ్లం వద్ద చూపించగానే చుట్టూ ఉన్నవారు ఒక్కసారిగా బోరున విలపించారు. 


ఒకేచోట వేర్వేరు చితులు

ఆ గ్రామ శ్మశాన వాటికలో మృతులకు ఒకేచోట వేర్వేరుగా చితులను పేర్చి సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించారు. ముందుగా నర్సింహకు, ఆ తర్వాత భార్య, వదినలకు నిప్పంటించారు. ఇలాంటి దుర్ఘటన, గ్రామంలో మునుపెన్నడూ జరగలేదని, పగవారికి కూడా ఇలాంటి పరిస్థితి రావద్దని కోరుకున్నారు.


 వృద్ధాప్యంలో కన్నీరే మిగిలింది : సత్తెమ్మ, నర్సింహ తల్లి

 కొడుకు, కోడలు మృతి చెందడంతో మాకు వృద్దాప్యంలో కన్నీరు మిగిలిందని నర్సింహ తల్లి సత్తెమ్మ కన్నీరుమున్నీరుగా విలపించింది. నర్సింహ బాల్యాన్ని గుర్తుచేసుకొని తల్లి రోదించింది. తన కొడుకు పిల్లల భవిష్యత్‌ ఏమిటో.., పెద్దయ్యాక మా నాన్న, అమ్మ ఏరని అడిగితే ఏమని చెప్పము భగవంతుడా..! అని విలపించింది. నడవలేని స్థితిలో ఉన్నాము మా కష్టాలను, బాధలను ఎవరితో చెప్పుకునేది అని చిన్న పిల్లలను తలచుకుంటూ దుఖించింది. ఆమె బాధను చూసి పలువురు కన్నీటిపర్యంతమయ్యారు.  

Read more