తెలుగు రాష్ట్రాల్లో టీడీపీదే అధికారం

ABN , First Publish Date - 2022-05-30T06:54:30+05:30 IST

తెలుగుదేశం పార్టీకి కొత్త సైన్యం సిద్ధమవుతోందని, తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు అన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీదే అధికారం
సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు

క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల వల్లే మహానాడు విజయవంతం

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు

సూర్యాపేట టౌన్‌, మే 29 : తెలుగుదేశం పార్టీకి కొత్త సైన్యం సిద్ధమవుతోందని, తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు అన్నారు. ఏపీలో జరిగిన పార్టీ మహానాడుకు వెళ్లి వస్తూ జిల్లా కేంద్రంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం సమీక్షించారు. టీడీపీ ఎన్టీఆర్‌ స్థాపించి 125 మంది చదువుకున్న వ్యక్తులను, 48 మంది న్యాయవాదులను, 28 మంది డాక్టర్లు, 28 మంది పోస్టుగ్రాడ్యుయేట్స్‌కు టికెట్లు కేటాయించారని అన్నారు. పార్టీ ఏర్పడిన అనతికాలంలోనే అధికారం చేపట్టిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చిన ఘనత మాజీ సీఎం చంద్రబాబునాయుడుదేనని అన్నారు. సైబరాబాద్‌ను నిర్మించి సుమారు 3లక్షల మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా 10లక్షల మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. గతంలో ఎన్టీఆర్‌, చంద్రబాబునాయుడు హయాంలో సిద్ధాంతపరంగా పాలన సాగిందని, ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందన్నారు. ఎన్టీఆర్‌, చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన పథకాలు రూ.2లకే కిలోబియ్యం, వనసంరక్షణ, జన్మభూమి వంటి పథకాలనే సీఎం కేసీఆర్‌ కాపీ కొడుతూ హరితహారం, రూ.1కిలోబియ్యం వంటి పథకాలు తెచ్చారని అన్నారు. ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీల్లో దళితులకు మూడు ఎకరాల భూమి, దళితుడిని సీఎంని చేస్తానన్న హామీ, పేదలకు డబుల్‌ బెడ్‌ ఇళ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. దళితులకు దళితబంధు పథకం కంటే ముందు వారు అభివృద్ధి చెందేలా ఉపాధిమార్గాలు చూపాలన్నారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ఆర్థిక పరిపుష్టి కేవలం ఒక్క కేసీఆర్‌ కుటుంబానికే పరిమితం అయిందన్నారు. ఓటు విలువను ప్రజలకు తెలిపిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని, ప్రతీ ఇంటి గుమ్మం వద్దకు మంత్రులను, ఎమ్మెల్యేలను వచ్చేలా చేసిన చరిత్ర టీడీపీకే దక్కుతుందన్నారు. చంద్రబాబునాయుడుకు పటిష్ఠ భద్రతవలయాన్ని ఏర్పాటుచేయాల్సి ఉండగా, మహానాడు సభలో ఒక్క పోలీసు కూడా విధుల్లో లేకుండా జగన్‌ సర్కార్‌ కుట్ర చేయడం దారుణమన్నారు. టీడీపీ కార్యకర్తల క్రమశిక్షణతో మహానాడు సభ కనీవిని ఎరుగని రీతిలో విజయవంతం అయిందన్నారు. మాజీ సీఎంలు ఎన్టీఆర్‌, చంద్రబాబునాయుడు పాలనలో జరిగిన అభివృద్ధి, పార్టీకి ఉజ్వల భవిష్యత్‌ త్వరలో మళ్లీ పునరావృతం అవుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డి పద్మావతి, రాజునాయక్‌, గోపాల్‌రెడ్డి, నాతాల రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read more