ఫీల్డ్‌ అసిస్టెంట్లను ఊరిస్తున్న తీపికబురు

ABN , First Publish Date - 2022-04-05T05:44:41+05:30 IST

ఉపాధిహామీ పథకం అమలులో క్షేత్రస్థాయిలో పని చేసిన ఫీల్డ్‌అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ ఇటీవల ప్రకటించడంతో కొలువుల ఆశ మళ్లీ చిగురించింది.

ఫీల్డ్‌ అసిస్టెంట్లను ఊరిస్తున్న తీపికబురు
విధుల్లోకి తీసుకోవాలని మిర్యాలగూడలో ఆందోళన చేస్తున్న ఫీల్డ్‌అసిస్టెంట్లు(ఫైల్‌ఫోటో)

సీఎం ప్రకటనతో చిగురించిన కొలువుల ఆశ

పునర్‌ నియామక ఉత్తర్వుల కోసం ఎదురుచూపు

విధుల్లో చేరితే కార్యదర్శులకు  తప్పనున్న అదనపు భారం

మిర్యాలగూడ అర్బన్‌, ఏప్రిల్‌ 4: ఉపాధిహామీ పథకం అమలులో క్షేత్రస్థాయిలో పని చేసిన ఫీల్డ్‌అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ ఇటీవల ప్రకటించడంతో కొలువుల ఆశ మళ్లీ చిగురించింది. గతంలో సమ్మెకు వెళ్లిన కారణంగా ప్రభుత్వం తొలగించడంతో రెండేళ్లుగా వారు విధులకు దూరంగా ఉన్నారు. అయితే మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని సీఎం ప్రకటించడంతో నియామక ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నారు.

జాబ్‌కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి 40 రోజులు తగ్గకుండా పని కల్పించాలని ప్రభుత్వం 2020 మార్చి నెలలో 4779 జీవో జారీ చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ, పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా జీతభత్యాలు పెంచాలని ఎఫ్‌ఏలు (ఫీల్డ్‌అసిస్టెంట్లు) సమ్మెకు దిగారు. అదే తరుణంలో కరోనా వైర్‌సవ్యాప్తి పెరిగి లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. దీంతో సమ్మెను తాత్కాలికంగా విరమింపజేసి విధుల్లో చేరేందుకు సిద్ధపడగా, ఎఫ్‌ఏలను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో జీవనోపాధిని కోల్పోయిన వారు పలుదఫాలు సీఎంవో కార్యాలయ అధికారులకు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి విజ్ఞప్తి చేస్తూవచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో నాగార్జునసాగర్‌, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో నామినేషన్లు సైతం దాఖలుచేసి నిరసన వ్యక్తం చేశారు. అయితే అనూహ్యాంగా స్పందించిన సీఎం కేసీఆర్‌, ఫీల్డ్‌అసిస్టెంట్లకు తీపి కబురు చెప్పారు. విధుల్లోకి తీసుకుంటామని చెప్పి నెలరోజులు అవుతుండగా, నేటికీ ఉత్తర్వులు ఊరిస్తూనే ఉన్నాయి. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఫీల్డ్‌ అసిస్టెంట్లు జిల్లా, మండలస్థాయి అధికారులను కలిసి విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామంటూ విన్నవించుకున్నారు.

ఉమ్మడి జిల్లాలో 1,026 మంది ఎఫ్‌ఏలు

ఉమ్మడిజిల్లాలో 1,501 పంచాయతీల పరిధిలో 1,026 మంది ఎఫ్‌ఏలు ఉన్నారు. వీరిని విధుల్లోంచి తొలగించాక ఈజీఎస్‌ పథకం బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం అప్పగించింది. ప్రతీ గ్రామంలో కనీసం 50శాతం మంది కూలీలకు పని చూపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. సాధారణంగా మార్చి నెల నుంచి జూలై మాసం వరకు ఉపాధిహామీ పనులు అధికంగా ఉంటాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8.92 లక్షల కుటుంబాలకు జాబ్‌కార్డులు ఉండగా, దాదాపు 18 లక్షల మంది సభ్యులున్నారు. వేసవిలో ప్రతిరోజు సుమారు 3లక్షల నుంచి 5లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు హాజరవుతుంటారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో సుమారు 1.12లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు హాజరవుతున్నట్లు సమాచారం. ఈ సమయంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటే పంచాయతీ కార్యదర్శులకు ఉపశమనం కలగనుంది.

సీఎం ప్రకటన ఊరటనిచ్చింది : అంకెపాక జనార్ధన్‌, ఎఫ్‌ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు

సమ్మెకు వెళ్లామన్న కారణంతో విధుల నుంచి తొలగించారు. రెండేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కొందరు దినసరి కూలీలుగా మారగా, మరికొందరు ఆర్థిక ఇబ్బందులతో అకాలమరణం పొందారు. మాలో ఉన్నత చదువు ఉన్నా, ఉద్యోగ అర్హత వయసు దాటి మానసిక క్షోభలో పడ్డారు. ఇలాంటి తరుణంలో సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటన ఊరటనిచ్చింది. వెంటనే నియామక ఉత్తర్వులు ఇవ్వాలి.

Updated Date - 2022-04-05T05:44:41+05:30 IST