స్రవంతికే కాంగ్రెస్‌ టికెట్‌

ABN , First Publish Date - 2022-09-10T06:24:07+05:30 IST

సుదీర్ఘ కసరత్తు అనంతరం ఢీల్లీ కాంగ్రెస్‌ పెద్దలు మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతే అని ప్రకటించారు.

స్రవంతికే కాంగ్రెస్‌ టికెట్‌
స్రవంతి

 వారసత్వానికే పెద్ద పీట 

నేతలు, శ్రేణులు కలిసి సాగేనా? 

నల్లగొండ, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సుదీర్ఘ కసరత్తు అనంతరం ఢీల్లీ కాంగ్రెస్‌ పెద్దలు మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతే అని ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాన పోరు మూడు పార్టీల మధ్యే ఉండనుంది. అయితే అభ్యర్థుల అధికారిక ప్రకటన విషయంలో కాంగ్రెస్‌ ఒక అడుగు ముందుకేసింది. బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఖరారవుతారన్న ప్రచారం ఉంది. ఆ మేరకు వారే నియోజకవర్గంలో ముందుండి పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఆయా పార్టీల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రాజగోపాల్‌ రాజీనామా చేసిన వెంటనే బహిరంగ సభల నిర్వహణలోనూ కాంగ్రెసే ముందు నడిచింది. తాజాగా, స్రవంతి పేరు ఖరారు కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది.


కాంగ్రెస్‌కు చావోరేవో పరిస్థితి

మునుగోడు టికెట్‌ ఆశిస్తూ ఆర్థికంగా బలవంతుడైన చల్లమల్ల కృష్ణారెడ్డి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు పున్న కైలాష్‌నేత, పల్లె రవి చివరి వరకు పోరాటం చేశారు. ఈ ఎన్నికలో విజయం సాధించడం కాంగ్రెస్‌కు చావోరేవో అనే పరిస్థితి ఉండడంతో ఢిల్లీ నుంచి గల్లీ వరకు పార్టీ నేతలు కదిలివచ్చారు. పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లడంతో కాంగ్రెస్‌ నేతలతో పాటు స్థానిక క్యాడర్‌ కసితో ఉంది. ఈ ఆగ్రహాన్ని విజయం వైపు మళ్లించేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వెనువెంటనే రంగంలోకి దిగి చకచకా పని మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆర్థికంగా బలవంతుడైన చల్లమల్ల కృష్ణారెడ్డి పేరు తెరపైకి రావడం, ఆయన స్థానికంగా మకాం వేసి పార్టీ పనుల్లో పాలుపంచుకోవడం, మరోవైపు టికెట్‌ ఆశిస్తున్న మిగిలిన ముగ్గురు నేతలు స్థానికంగా క్యాడర్‌తో కలిసి తిరుగుతుండడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పార్టీ నుంచి వలసలను అడ్డుకునేందుకు మధుయాష్కీగౌడ్‌ చైర్మన్‌గా ఐదుగురు సీనియర్‌ నేతలతో కమిటీ, మండలాల వారీగా కమిటీలు, ఎన్నిక ఇన్‌చార్జిగా మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిని ప్రకటించారు. చండూరులో ఘనంగా సభ నిర్వహించారు. జిల్లాకు చెందిన సీనియర్‌ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చండూరు సభ తర్వాత మునుగోడుకు దూరంగా ఉన్నారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పటి వరకు మునుగోడు గడప తొక్కలేదు. పార్టీ పరిస్థితి ఇలా ఉండగా, పీసీసీ నేతలు పలుమార్లు ఆశావహులతో భేటీ అయి చివరకు పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణారెడ్డి పేర్లను ఢిల్లీకి పంపారు. త్వరగా అభ్యర్థిని ప్రకటించాలనే అభిప్రాయం పార్టీ నేతలందరూ వ్యక్తం చేయడంతో ఢిల్లీ పెద్దలు స్రవంతిని అభ్యర్థిగా ఖరారు చేశారు.


కలిసి వచ్చేనా?

మునుగోడు నియోజకవర్గంలో 12సార్లు ఎన్నికలు జరగ్గా ఆరు సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం సాధించారు. ఐదుసార్లు పాల్వాయి స్రవంతి తండ్రి గోవర్ధన్‌రెడ్డి విజయం సాధించగా, ఒకసారి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. స్థానికంగా పెద్ద సంఖ్యలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కాంగ్రెస్‌ పార్టీకి చెందినవారు ఉన్నారు. కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన నలుగురి పేర్లతో పార్టీ స్థానికంగా సర్వే చేయించగా 20శాతం మంది స్రవంతి వైపు ఉండగా మిగిలిన వారిలో కొంత మందికి 3శాతం, మరికొంత మందికి 1శాతం మందే అనుకూలంగా సమాధానం ఇవ్వడంతో స్రవంతి అభ్యర్థిత్వం వైపు ఢిల్లీ పెద్దలు మొగ్గు చూపినట్లు సమాచారం. దీనికి తోడు జిల్లా నేతలు స్రవంతే సరైన అభ్యర్థి అని ప్రియాంకా గాంధీతో నిర్వహించిన భేటీలో స్పష్టం చేయడం స్రవంతికి కలిసి వచ్చింది. టికెట్‌ ఆశించిన మిగిలిన ముగ్గురు నేతలు స్రవంతితో కలిసి నడుస్తారా? చివర వరకు పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తారా? అనే చర్చ స్థానికంగా ప్రారంభమైంది. ఇక పార్టీ పెద్దలు గ్రూపులు పక్కన పెట్టి స్రవంతి గెలుపు కోసం ఏ మేరకు పనిచేస్తారో, ముందుగా అనుకున్నట్టు స్థానికంగా మకాం వేసి ఉంటారా? అనే చర్చ మొదలైంది. 97వేల ఓట్లు గతంలో రాజగోపాల్‌రెడ్డికి నమోదయ్యాయి. ఆ ఓట్లు మళ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థికి వేసుకుంటే చాలని ఇటీవల పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అది ఆచరణలో ఏ మేరకు సాధ్యమవుతుందనేది వేచి చూడా ల్సి ఉంది. 2014లో స్రవంతికి టికెట్‌ ఇచ్చేందుకు పార్టీ నిరాకరించడంతో నాడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన 27వేలపై చిలుకు ఓట్లు సాధించారు.


తండ్రి వారసత్వం, జిల్లా నేతల సమర్థనే ప్రాతిపదిక

పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి రాజకీయ వారసురాలు స్రవంతి 1973లో జన్మించారు. ఆమె ఎంబీఏ, ఎల్‌ఎల్‌ఎం విద్య పూర్తిచేసి ఏడేళ్లు కార్పొరేట్‌ కంపెనీలో వివిధ హోదాల్లో పనిచేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన వంశీధర్‌రెడ్డిని వివాహమాడిన ఆమె ఏపీ హైకోర్టులో అడ్వకేట్‌గా నమోదు చేసుకున్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూ యూత్‌ సెంటర్‌ ఏపీ, కర్నాటక కన్వీనర్‌గా, జాతీయ కోశాధికారిగా స్రవంతి పనిచేశారు. 2001 నుంచి టీపీసీసీ సభ్యురాలుగా పనిచేస్తున్నారు. 2005లో ఏఐసీసీ మెంబర్‌గా నియమితులయ్యారు. 2014 సాధారణ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా స్రవంతి బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 69,496 ఓట్లతో మొదటి స్థానంలో నిలవగా కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన స్రవంతి 27,441 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. టీడీపీ మద్దతుతో బరిలో దిగిన బీజేపీ అభ్యర్ధి గంగిడి మనోహర్‌రెడ్డి 27,434 ఓట్లతో మూడో స్థానంలో నిలవగా కాంగ్రెస్‌ మద్దతుతో బరిలో దిగిన సీపీఐ అభ్యర్థి పల్లా వెంకట్‌రెడ్డి 20,952 ఓట్లతో చివరి స్థానంలో ఉన్నారు. పార్టీ నిర్ణయానికి భిన్నంగా స్వతంత్ర అభ్యర్ధిగా స్రవంతి బరిలో దిగడంతో కాంగ్రెస్‌ ఆమెను సస్పెండ్‌ చేసింది. 2015 డిసెంబరులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగిన సమయంలో ఆయన గెలుపును దృష్టిలో పెట్టుకుని పాల్వాయి స్రవంతిపై ఉన్న సస్పెన్షన్‌ వేటును కాంగ్రెస్‌ ఎత్తివేసింది. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డికి ఇద్దరు కుమారులు, ఏకైక కుమార్తె స్రవంతి కాగా, ఆయన వారసురాలుగా రాజకీయాల్లో ఎదిగారు. తండ్రి వారసత్వ రాజకీయాలు, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి వంటి నేతలు స్రవంతి అభ్యర్ధిత్వంపై సానుకూలంగా ఉండడంతో ఏఐసీసీ ఆమె వైపే మొగ్గుచూపినట్టు సమాచారం.

Updated Date - 2022-09-10T06:24:07+05:30 IST