వడివడిగా వరి వైపు

ABN , First Publish Date - 2022-08-17T06:30:42+05:30 IST

జిల్లా వ్యాప్తంగా వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులంతా వ్యవసా య పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలో వానాకాలం సీజన్‌ ప్రారంభం నుంచి వర్షాలు ఆశాజనకంగా ఉండటంతో చెరువులు, కుంటలు నిండి అలుగు పోస్తున్నాయి. వర్షాలకు తోడుగా ఎస్సారెస్పీ కాల్వలకు గోదావరి నీరు, నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ ద్వారా కృష్ణా, మూసీ ప్రాజెక్టు ద్వారా కాల్వలకు నీటిని ఇటీవల అధికారులు విడుదల చేయడంతో జిల్లాలో వరి సాగుకు నీటికొరత బాధ తీరింది.

వడివడిగా వరి వైపు

జిల్లాలో ముమ్మరంగా నాట్లు

ఇప్పటి వరకు 54 వేల ఎకరాల్లో వరిసాగు

6 లక్షల ఎకరాలు దాటే అవకాశం


సూర్యాపేట సిటీ, ఆగస్టు 16: జిల్లా వ్యాప్తంగా వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులంతా వ్యవసా య పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలో వానాకాలం సీజన్‌ ప్రారంభం నుంచి వర్షాలు ఆశాజనకంగా ఉండటంతో చెరువులు, కుంటలు నిండి అలుగు పోస్తున్నాయి. వర్షాలకు తోడుగా ఎస్సారెస్పీ కాల్వలకు గోదావరి నీరు, నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ ద్వారా కృష్ణా, మూసీ ప్రాజెక్టు ద్వారా కాల్వలకు నీటిని ఇటీవల అధికారులు విడుదల చేయడంతో జిల్లాలో వరి సాగుకు నీటికొరత బాధ తీరింది. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 54వేల ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబరు మాసం చివరినాటికి వరి సాగు విస్తీర్ణం 6లక్షల ఎకరాలు దాటే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.


తీరిన సాగునీటి కొరత

జిల్లాలో మూడేళ్లుగా రైతాంగానికి సాగునీటి కష్టాలు తీరాయి. ఏటా ఏడాది నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఎడమ కా ల్వ ఆయకట్టు పరిధిలో 1,91,539 ఎకరాలు, శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు రెండో దశ (స్టేజ్‌-2) పరిధిలో 2,13,175 ఎకరాలు, నాగార్జునసాగర్‌ కాల్వలపై ఏర్పాటుచేసిన ఎత్తిపోతల పథకాల కింద 38,422ఎకరాలు, మూసీ ప్రాజెక్టు పరిధిలో 15,230ఎకరాలు సాగవుతున్నాయి.అదేవిధంగా 100 ఎకరాల విస్తీర్ణం ఉన్న చెరువుల కింద 36,776ఎకరాల ఆయకట్టు, 100 ఎకరాల లోపు ఉన్న చెరువుల కింద మరో 54,713 ఎకరాల్లో వరి సాగవుతోంది. ప్రతీ వానాకాలం సీజన్‌లో ఎస్సారెస్పీ కాల్వలకు గోదావరి నీటిని విడుదల చేస్తుండటంతో వాటి పరిఽధిలోని చెరువులు, కుంటలు ఇప్పటికే నిండి అలు గు పోస్తున్నాయి. ఈ కాల్వల ద్వారా ఏటా రెండు సీజన్లకు సాగునీటిని అందిస్తుండటంతో జిల్లా రైతాంగానికి సాగునీ టి కష్టాలు తీరాయి. గతంలో నాగర్జునసాగర్‌ ఎడమ కాల్వ, మూసీ ఆయకట్టు పరిధిలో మాత్రమే రైతాంగానికి సాగునీరందేది. కాగా, 2020 నుంచి ఎస్సారెస్పీ కాల్వలకు గోదావరి నీటిని విడుదల చేస్తుండటంతో దీని పరిధిలోని కాల్వల కింద సైతం రైతులు వరి సాగువైపే మొగ్గుచూపుతున్నారు.


ఏటా పెరుగుతున్న వరి విస్తీర్ణం

జిల్లా రైతులకు సాగునీరు సమృద్ధిగా లభిస్తుండటంతో వరిసాగు విస్తీర్ణం ఏటా పెరుగుతోంది. జిల్లాలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 2లక్షల ఎకరాలు కాగా, దీనికి మించి సాగవుతోంది. 2020 వానాకాలంలో జిల్లా వ్యాప్తం గా 4,01,580ఎకరాల్లో, 2021లో 4,69,535 ఎకరాల్లో  వరి సాగైంది. ప్రస్తుత వానకాలం సీజన్‌లో సుమారు 6లక్షల ఎకరాలకు వరి విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, పెరుగుతున్న సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాకు యూరియా 7,8390 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 20,904 మెట్రిక్‌టన్నులు, ఎంవోపీ 13,065 మెట్రిక్‌టన్నులు, కాంప్లెక్స్‌(ఎరువులు) 53,567 మెట్రిక్‌టన్నులు, ఎస్‌ఎ్‌సపీ 8,362 మెట్రిక్‌టన్నులు అవసరం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.

Read more