బొమ్మ తుపాకీతో బెదిరించి నిలువుదోపిడీ

ABN , First Publish Date - 2022-10-05T06:07:07+05:30 IST

బొమ్మ తుపాకీ చూపించి ఓ వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు నిలుపుదోపిడీ చేశారు.

బొమ్మ తుపాకీతో బెదిరించి నిలువుదోపిడీ
గాయపడిన జానమ్మ

 గాయపడిన వృద్ధురాలు 

శాలిగౌరారం, అక్టోబరు 4: బొమ్మ తుపాకీ చూపించి ఓ వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు నిలుపుదోపిడీ చేశారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం రామాంజపురంలో గ్రామంలో జరిగింది. ఎస్‌ఐ సతీష్‌, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... రామాంజపురం గ్రామానికి చెందిన ఎర్ర జానమ్మ ఇల్లు ఊరు చివర ఉంటుంది.  సోమవారం సాయంత్రం ఇంటికి తాళం వేసి జానమ్మ బతుకమ్మలను చూడడానికి వెళ్లింది. ఆ సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాను ధ్వంసం చేసి అందులో ఉన్న 50వేల నగదు, 3 తులాల బంగారు చంద్రహారాన్ని, 20 తులాల వెండిని దొంగిలించారు. అనంతరం ఇంట్లోని బయటకు సుమారు రాత్రి 9 గంటలకు వెళ్తుండగా జానమ్మ ఇంట్లోకి వస్తుంది. గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు పట్టుకుని బొమ్మ తుపాకీ చూపించి మెడలో ఉన్న 3 తులాల పుస్తెలతాడు, చెవి కమ్మలను బలవంతంగా లాక్కున్నారు. దాంతో ఆమె చెవికి గాయమైంది. అనంతరం ఇరువురు దొంగలు బొమ్మ తుపాకీని అక్కడే వదిలేసి బైకుపై పరారయ్యారు. జానమ్మ కుమారుడు మల్లారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సతీష్‌ తెలిపారు. శాలిగౌరారం సీఐ రాఘవరావు మంగళవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. చోరీకి గురైన సొమ్ము దాదాపు 4 లక్షల వరకు ఉంటుందని ఎస్‌ఐ సతీష్‌ తెలిపారు. 

Read more