సిమెంట్‌ పరిశ్రమల లారీలతో రోడ్డు ధ్వంసం

ABN , First Publish Date - 2022-02-19T06:30:11+05:30 IST

సిమెంట్‌ పరిశ్రమలకు వెళ్లే లారీల రాకపోకలతో రహదారి ధ్వంసమవుతోందని కోదాడ మండలం కూచిపూడి గ్రామస్థులు ఆగ్రహం

సిమెంట్‌ పరిశ్రమల లారీలతో రోడ్డు ధ్వంసం
దొండపాడు - రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద ధర్నా చేస్తున్న గ్రామస్థులు

కూచిపూడి రోడ్డుకు మరమ్మతు చేయాలి 

కూచిపూడి గ్రామస్థుల ధర్నా

కోదాడ రూరల్‌, ఫిబ్రవరి 18: సిమెంట్‌ పరిశ్రమలకు వెళ్లే లారీల రాకపోకలతో రహదారి ధ్వంసమవుతోందని కోదాడ మండలం కూచిపూడి గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దొండపాడు-రామాపురం క్రాస్‌ రోడ్డుపై శుక్రవారం అరగంట సేపు ధర్నా చేయటంతో వాహనాలు నిలిచిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. దొండపాడు-రామాపురం గ్రామాల పరిధిలో 10 సిమెంటు పరిశ్రమలు ఉన్నాయి. దీంతో 200 లారీలు ఈ రహదారి మీదుగా ప్రయాణిస్తుంటాయి. దీంతో రెడ్లకుంట, కూచిపూడి, కూచిపూడితండా, అన్నారం గ్రామాల్లోని రహదారులు గుంతలమయమై ప్రమాదాలు జరుగుతుండటంతో స్థానికులు శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా కూచిపూడి సర్పంచ్‌ శెట్టి సురేష్‌ మాట్లాడుతూ ఈ రహదారిపై 10కి పైగా సిమెంట్‌ పరిశ్రమల లారీలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నందున రోడ్డు మొత్తం పూర్తిగా గుంతలమయంగా మారిందన్నారు. రహదారి దుస్థితిపై ఆర్‌అండ్‌బీ అధికారులకు, సిమెంట్‌ పరిశ్రమల యజమానులకు ఆరు నెలల క్రితం సమాచారమిచ్చినా చర్యలు తీసుకోలేదన్నారు. ప్రమాదాల నివారణకు గుంతల్లో పలుమార్లు డస్ట్‌, మట్టిని పోయించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదన్నారు. అరగంటపాటు ధర్నా చేయడంతో రోడ్డుకిరువైపులా పరిశ్రమలకు సంబంధించిన వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న రూరల్‌ ఎస్‌ఐ సాయిప్రశాంత్‌ ఘటనా స్థలానికి చేరుకుని ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడారు. రోడ్డుకు త్వరలో మరమ్మతు చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆందోళనను విరమించారు. ఈ ధర్నాలో సర్పంచ్‌, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్‌, సొసైటీ డైరెక్టర్‌, టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు, వార్డు సభ్యులు షేక్‌ అబ్దుల్‌ నబీ, తిరుపతయ్య, పసుపులేటి రమణయ్య, శెట్టి రమేష్‌, సయ్యద్‌ మోహిన్‌, కొలిశెట్టి రామయ్య, శెట్టి గోపి, పసుపులేటి నాంచారయ్య, రెడ్డిపూడి తిరుపతయ్య, చందర్‌రావు, వినయ్‌, మోహన్‌రావు, గోవిందరావు, పూర్ణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-02-19T06:30:11+05:30 IST