పునరావాసం, పరిహారం కల్పించాలి

ABN , First Publish Date - 2022-08-17T06:39:03+05:30 IST

పునరావాసం, భూపరిహారం ఇవ్వాలని కిష్టరాయన్‌పల్లి, చర్లగూడెం రిజర్వాయర్ల ముంపు బాధితులు డిమాండ్‌ చేశారు. మర్రిగూడ మండలకేంద్రంలో నిర్వాసితులు మంగళవారం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు.

పునరావాసం, పరిహారం కల్పించాలి
మర్రిగూడలో దీక్ష చేస్తున్న ముంపు గ్రామాల బాధితులు

కిష్టరాయన్‌పల్లి, చర్లగూడెం భూనిర్వాసితుల ఆమరణ దీక్ష


మర్రిగూడ, ఆగస్టు 16: పునరావాసం, భూపరిహారం ఇవ్వాలని కిష్టరాయన్‌పల్లి, చర్లగూడెం రిజర్వాయర్ల ముంపు బాధితులు డిమాండ్‌ చేశారు. మర్రిగూడ మండలకేంద్రంలో నిర్వాసితులు మంగళవారం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చర్లగూడెం, కిష్టరాయన్‌పల్లి రిజర్వాయర్‌ల కిం ద ముంపునకు గురైన చర్లగూడెం, నర్సిరెడ్డిగూడెం, వెంకెపల్లి, వెంకెపల్లితండా, నాంపల్లి మండలంలోని లక్ష్మణాపురం, ఈదులగండి ముంపు బాధితులు దీక్షల్లో పాల్గొన్నారు. రెండు రిజర్వాయర్లతో తాము సర్వం కోల్పోయామని, పరిహారం, పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. చర్లగూడెం రిజర్వాయర్‌ కింద 1,120, కిష్టరాయన్‌పల్లి రిజర్వాయర్‌ కింద 620 గృహాలు ముంపునకు గురయ్యాయని, పరిహారం అందించడంలో ప్రభుత్వం అన్యాయం చేసిందని వాపోయారు. 2015లో ముఖ్యమంత్రి రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా భూ నిర్వాసితులకు న్యాయం చేస్తానని ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, భూపరిహారం అందించేవరకు ఆమరణ నిరాహారదీక్షను విరమించబోమని స్పష్టం చేశారు. 

దీక్ష విరమించండి, ప్రభుత్వం పరిహారం ఇస్తుంది : ఆర్డీవో గోపిరాం 

ముంపు గ్రామ భూనిర్వాసితులు ఆమరణ నిరాహారదీక్ష విరమించుకోవాలని, ప్రభుత్వం పరిహారంతోపాటు పునరావాసం కల్పించి న్యాయం చేస్తుందని దేవరకొండ ఆర్డీవో గోపిరాం అన్నారు.  ముంపు బాధితులు మండల కేంద్రంలో ప్రారంభించిన ఆమరణ నిరహరదీక్ష వద్దకు చేరుకొని బాధితులకు నచ్చజెప్పారు. అయినా బాధితులు ససేమిరా అని దీక్ష కొనసాగించారు. కాగా, ప్రభుత్వం స్పందించి లక్ష్మణాపురం గ్రామ ముంపు బాధితులకు 245 ఇళ్లకు ఇంటికి రూ.7.50లక్షలు చొప్పున ఆర్‌ఆండ్‌ఆర్‌ ద్వారా బాధితుల అకౌంట్లో మంగళవారం డబ్బు జమచేసింది.

Read more