పలుచోట్ల వర్షం

ABN , First Publish Date - 2022-09-30T06:54:15+05:30 IST

జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు వర్షం కురిసింది.

పలుచోట్ల వర్షం
మోత్కూరు సాయిబాబా కాలనీలో జలమయమైన వీధి

పోచంపల్లి, మోత్కూరు, అడ్డగూడూరులో భారీగా 

పిడుగుపాటుకు ఒకరి మృతి

భూదాన్‌పోచంపల్లి, మోత్కూరు, అడ్డగూడూరు, మోటకొండూరు, వలిగొండ, భువనగిరిటౌన్‌, గుండాల, సెప్టెంబరు 29: జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు వర్షం కురిసింది. పోచంపల్లి, మోత్కూరు, అడ్డగూడూరులో భారీ వర్షం నమోదైంది. కాగా, పిడుగుపాటుకు అడ్డగూడూరు మండలంలో ఒకరు మృతిచెందారు. పోచంపల్లిలో గురువారం ఉదయం నుంచి ముసురు పట్టి సాయత్రంం 6 గంటల నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పెద్దరావులపల్లి, పిలాయిపల్లి బ్రిడ్జి, రుద్రవెళ్లి-జూలూరు, భీమనపల్లి-పోచంపల్లి మధ్య వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. మోత్కూరు, ఆత్మకూరు(ఎం), గుండాల, అడ్డగూడూరు మండలాల్లో గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. జిల్లాలోనే అత్యధికంగా మోత్కూరులో 66.4మి.మీ, ఆత్మకూరు(ఎం)లో 43.6మి.మీ, గుండాలలో 38.6మి.మీ వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  అడ్డగూడూరు, గోవింధపురం గ్రామాల మధ్య కల్వర్టుపై వరద ఉధృతంగా ప్రవహించడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచాయి. ఈ వర్షాలతో కోతకు వచ్చిన కత్తెర వరి దెబ్బతింటుందని, పత్తి చేలకు కూడా నష్టమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోటకొండూరు మండలంలో వర్షానికి మండలంలోని సికిందర్‌నగర్‌, కాటేపల్లి మధ్య బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచాయి. వలిగొండ మండలంలో ఓ మోస్తారు వర్షం కురిసింది. భువనగిరి పట్టణంలో ముసురుతో పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడగా, ప్రజల రోజువారీ పనులకు ఆటంకం కలిగింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచింది. మహిళలు బతుకమ్మ ఆడలేకపోయారు.

పిడుగుపాటుకు యువకుడి మృతి

పిడుగుపాటుకు గుండాల మండలంలోని వెల్మజాల గ్రామానికి చెందిన ఉడుగుల సందీ్‌పకుమార్‌ (23) గురువారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఉడుగుల శంకరయ్య కుమారుడు సందీప్‌ జనగామలో డిగ్రీ పూర్తిచేసి ఇంటి వద్ద ఉండే తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయం పనులు చేస్తున్నాడు. రోజు వారీగా పశువులు మేపేందుకు వెళ్లి పిడుగుపాటుకు మృతి చెందాడు. అదేవిధంగా పిడుగుపాటుకు మోత్కూరు మునిసిపాలిటీ సాయిబాబా కాలనీలో అన్నెపు రాములుకు చెందిన ఎద్దు వలిగొండ మండలం పొద్దటూరు గ్రామ రైతు దుబ్బ మైసయ్యకు చెందిన పాడి గేదె, మొగిలిపాక రైతు కిష్టయ్యకు చెందిన గొర్రెలు మృతి చెందాయి.Read more