పెట్రోల్‌, డీజిల్‌పై ధరలను భారీగా తగ్గించాలి

ABN , First Publish Date - 2022-05-24T07:12:28+05:30 IST

కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను బారెడు పెంచి జానె డు తగ్గించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు.

పెట్రోల్‌, డీజిల్‌పై ధరలను భారీగా తగ్గించాలి
సమావేశంలో మాట్లాడుతున్న జూలకంటి రంగారెడ్డి

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రంగారెడ్డి 

మిర్యాలగూడ, మే 23: కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను బారెడు పెంచి జానె డు తగ్గించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ హయాంలో దఫదఫాలుగా పెట్రోల్‌పై రూ.49, డీజిల్‌పై రూ.55 పెంచారని ఆరోపించారు. తగ్గించేటప్పుడు పెట్రోల్‌పై 9, డీజిల్‌పై 8 రూపాయలు తగ్గిస్తుందని అన్నారు. పెట్రోల్‌ డీజిల్‌ ధరల పెంపు అన్ని వర్గాలు, వస్తువులపై ప్రభావం చూపుతున్నందున మరింత తగ్గించాలన్నారు. గ్యాస్‌, ఎరువుల ధరలు సైతం తగ్గించి సామాన్యులకు రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్నారు. ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు ఆర్థికసాయం అందించడం హర్షణీయమే కానీ రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని విస్మరించడం సరికాదన్నారు. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని తెలిపారు. మద్దతు ధరల చట్టం కోసం రాష్ట్రం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. అందుకోసం రాష్ట్ర స్థాయిలో అఖిలపక్షాన్ని కలుపుకుని ఢిల్లీపై ఉద్యమం చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు ఎన్నికల స్టంట్‌ను తలపిస్తున్నాయని విమర్శించారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బీకార్‌ మల్లేష్‌, జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మల్లు గౌతంరెడ్డి రవినాయక్‌, పరశురాములు, గాదె పద్మమ్మ, పతాని శ్రీనివాస్‌, వెంకటయ్య పాల్గొన్నారు.


Read more