పది పరీక్షలకు సంసిద్ధత

ABN , First Publish Date - 2022-12-06T23:37:28+05:30 IST

విద్యార్థుల బంగారు భవితకు పదో తరగతి పునాది. ఇక్కడ ఉత్తమ మార్కులతో ప్రతిభ చాటితే ఉన్నత చదువులకు బాటలు వేసుకోవచ్చు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాధనకు విద్యాశాఖ అధికారులు ప్రత్యేకచర్యలు చేపట్టారు. జిల్లాను తెలంగాణ రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిపేందుకు ‘సంసిద్ధత’ పేరుతో వంద రోజుల ప్రణాళిక రూపొందించి అమలుచేస్తున్నారు.

పది పరీక్షలకు సంసిద్ధత
భూదాన్‌పోచంపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల ప్రత్యేక తరగతులను పర్యవేక్షిస్తున్న సబ్జెక్టు టీచర్‌

వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం

‘పది’ విద్యార్థులకు వంద రోజుల ప్రణాళిక రూపకల్పన

ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు

విద్యార్థుల బంగారు భవితకు పదో తరగతి పునాది. ఇక్కడ ఉత్తమ మార్కులతో ప్రతిభ చాటితే ఉన్నత చదువులకు బాటలు వేసుకోవచ్చు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాధనకు విద్యాశాఖ అధికారులు ప్రత్యేకచర్యలు చేపట్టారు. జిల్లాను తెలంగాణ రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిపేందుకు ‘సంసిద్ధత’ పేరుతో వంద రోజుల ప్రణాళిక రూపొందించి అమలుచేస్తున్నారు.

భూదాన్‌పోచంపల్లి

పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ప్రతిభచూపి వందశాతం ఫలితాలు సాధించేందుకు ‘సంసిద్ధత’ పేరుతో విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 5.30 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. వార్షిక పరీక్షల వరకు 100 రోజుల ప్రణాళిక రూపొందించింది. అవసరమైన మెటీరియల్‌ ఇవ్వడం, చదువులో వెనకబడిన విద్యార్థుల సందేహాలు నివృత్తి చేయడంలో ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారు. యాదాద్రి-భువనగిరి జిల్లాలో 6,935 మంది, సూర్యాపేట జిల్లాలో 7,800మంది, నల్లగొండ జిల్లాలో 14,064 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఉన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా మొత్తం పదో తరగతి విద్యార్థులు 28,799 మంది ఉన్నారు. యాదాద్రి-భువనగిరి జిల్లాలోని 198 ప్రభుత్వ, మోడల్‌స్కూల్‌, కేజీబీవీ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు 6,935 మంది ఉన్నారు. వీరిలో బాలురు 3,423 మంది, బాలికలు 3,512 మంది ఉన్నారు. ఇక 103 ప్రైవేటు పాఠశాలల్లో 2,679 మంది విద్యార్థులున్నారు. ఇందులో బాలురు 1,531మంది, బాలికలు 1,148 మంది ఉన్నారు. గత వార్షిక పరీక్షల్లో 93.62 శాతం ఉత్తీర్ణతతో యాదాద్రి-భువనగిరి రాష్ట్రస్థాయిలో 13వ స్థానంలో నిలిచింది. ఈ విద్యాసంవత్సరం వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ అధికారులు కలెక్టర్‌ పమేలాసత్పథి ఆదేశాల మేరకు వందరోజుల ‘సంసిద్ధత’ కార్యక్రమానికి రూపకల్పన చేసి అమలు చేస్తున్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో..

నల్లగొండ జిల్లావ్యాప్తంగా 475 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలున్నాయి. 2022-23 విద్యాసంవత్సరానికి 20,705 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 14,064 మంది, ప్రైవేటు పాఠశాలలకు చెందినవారు 6,641 మంది ఉన్నారు. గత విద్యాసంవత్సరం 2021-22లో వార్షిక పరీక్షల్లో 19,747 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 92.05 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో 14వ స్థానంలో నిలిచింది. జిల్లావ్యాప్తంగా 350 ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలున్నాయి. ఈ విద్యాసంవత్సరం 2022-23లో 12,268 మంది విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన వారు 7,800 మంది కాగా, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు 4,468మంది ఉన్నారు. గత విద్యాసంవత్సరంలో సూర్యాపేట జిల్లా పదోతరగతి ఉత్తీర్ణత 90శాతం కాగా, రాష్ట్రస్థాయిలో 16వ స్థానంలో నిలిచింది.

విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

2022-23 విద్యా సంవత్సరానికి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఇటీవల ప్రకటించడంతో విద్యార్థు లు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ప్రత్యేక శిక్షణలో భాగంగా ‘సంసిద్ధత’ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటలవరకు అన్ని పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మ్యాథ్స్‌, సైన్స్‌, ఇంగ్లీష్‌ సబ్జెక్టులపై దృష్టి సారిస్తున్నారు.

మార్చి మూడో వారంలో పరీక్షలు

పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి మూడో వారంలో నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌ విడుదలచేసింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఎప్పటిలాగే ప్రధాన సబ్జెక్టులు పూర్తయిన తర్వాత ఓరియంటల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల నిర్వహణకు ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ఎంఈవోలు, హెచ్‌ఎంలతో సమావేశాలు నిర్వహించారు. విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధంచేసి ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా కార్యాచరణ అమలు చేస్తున్నారు.

ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం : శ్రీనివా్‌సరెడ్డి, హెచ్‌ఎం, జడ్పీహెచ్‌ఎ్‌స, భూదాన్‌పోచంపల్లి

పదో తరగతి విద్యార్థులకు అక్టోబరు 17నుంచే ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యాయి. రోజుకో సబ్జెక్టుపై స్టడీ అవర్స్‌ నిర్వహిస్తున్నాం. సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయుడు ఆరోజున ప్రత్యేక తరగతులను పర్యవేక్షిస్తారు. విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు తెలియపరుస్తున్నాము.

తరగతులు నిర్వహిస్తున్నారు : జక్కి నవ్య, 10వ తరగతి, భూదాన్‌పోచంపల్లి

మా పాఠశాలలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. సబ్జెక్టు ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటూ సందేహాలు నివృత్తిచేస్తున్నారు. అంతేగాక ఇంటివద్ద చదువుకునే సమయంలోనూ సబ్జెక్టులో ఏవైనా సందేహాలు ఉంటే ఉపాధ్యాయులకు వాట్సా్‌పకాల్‌ చేస్తే వెంటనే స్పందించి నివృత్తి చేస్తున్నారు. ప్రత్యేక తరగతులు మాకు ఎంతో ఉపయోగంగా ఉన్నాయి.

Updated Date - 2022-12-06T23:37:29+05:30 IST