క్రీడా ప్రాంగణాలకు స్థలాల్లేవ్‌

ABN , First Publish Date - 2022-05-30T06:45:54+05:30 IST

గ్రామీణ క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ప్రభుత్వం క్రీడా మైదానాల ఏర్పాటుకు నిర్ణయించింది. అందులో భాగంగా ఎకరానికి తగ్గకుండా స్థలాలను గ్రామానికి సమీపంలో గుర్తించాలని, ఇప్పటికే ఉమ్మడి జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

క్రీడా ప్రాంగణాలకు స్థలాల్లేవ్‌
మోత్కూరు మండలంలోని దాచారం గ్రామంలో క్రీడా మైదానం కోసం రెవెన్యూ అధికారులు కేటాయించిన రాళ్లు రప్పలు ఉన్న స్థలం

అధికారుల మల్లగుల్లాలు

జూన్‌ 2న ప్రారంభించాలని ప్రభుత్వ ఆదేశం

చాలా చోట్ల దొరకని స్థలాలు

రెవెన్యూ అధికారులు స్థలం కేటాయించినా క్షేత్రస్థాయిలో భూమి కరువు

చాలాచోట్ల కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలు

సూర్యాపేట జిల్లాలో 475 పంచాయతీలకు 46 మాత్రమే గుర్తింపు

పట్టణాల్లో జటిలంగా మారిన స్థల సేకరణ

(సూర్యాపేట(కలెక్టరేట్‌), మోత్కూరు/తిప్పర్తి)

గ్రామీణ క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ప్రభుత్వం క్రీడా మైదానాల ఏర్పాటుకు నిర్ణయించింది. అందులో భాగంగా ఎకరానికి తగ్గకుండా స్థలాలను గ్రామానికి సమీపంలో గుర్తించాలని, ఇప్పటికే ఉమ్మడి జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కనీసంగా మండలానికి రెండు చొప్పున క్రీడామైదానాలను రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా జూన్‌ 2న ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు కలెక్టర్లు రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేయగా, క్రీడా ప్రాంగణాలకు స్థలం కేటాయింపు ఇబ్బందిగా మారింది. ప్రధానంగా పట్టణాల్లో ఈ సమస్య మరింత జటిలంగా ఉంది. కొన్ని చోట్ల రెవెన్యూ అధికారులు గ్రామానికి దూరంగా, రాళ్లురప్పలు ఉన్న ప్రభుత్వ భూములను చూపుతున్నారని, వాటిని అభివృద్ధి చేయడం కష్టమని, ఒకవేళా ప్రారంభించినా దూరం కారణంగా అవి నిరుపయోగంగా మారతాయని సర్పంచులు అభిప్రాయపడుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో 1,740 పంచాయతీలు, 19 మునిసిపాలిటీలు ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో 421 పంచాయతీలు, ఆరు మునిసిపాలిటీలు, నల్లగొండ జిల్లాలో 844 పంచాయతీలు, ఎనిమిది మునిసిపాలిటీలు, సూర్యాపేట జిల్లాలో 475 పంచాయతీలు, ఐదు మునిసిపాలిటీలు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు సగం గ్రామాల్లో కూడా క్రీడా మైదానాల కోసం అధికారులు అనువైన స్థలాన్ని గుర్తించలేదు. మోత్కూరు మండలంలో 10 పంచాయతీలు ఉండగా, 8 గ్రామాల్లో క్రీడా మైదానాల కోసం స్థలాలు గుర్తించగా, అందులో ఆరు గ్రామాల్లోని స్థలాలు మైదానాలకు అనువుగా లేవు. పాలడుగు గ్రామంలో ఊరికి దూరంగా నీటి వసతి లేని, రాళ్లురప్పలు ఉన్న స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలం వద్దని పంచాయతీ తీర్మానం చేసి కలెక్టర్‌, ఆర్డీవోకు వినతి పత్రం అందజేయనున్నట్టు సర్పంచ్‌ మర్రిపెల్లి యాదయ్య తెలిపారు. అదేవిధంగా అడ్డగూడూరు మండలంలో చౌళ్లరామారంలో గ్రామానికి దూరంగా ఉన్న స్థలాన్ని కేటాయించారని సర్పంచ్‌ నిమ్మనగోటి జోజి తెలిపారు. మోత్కూరు మునిసిపాలిటీలో 12 వార్డులు ఉండగా ఒక్క వార్డులోనే స్థలాన్ని గుర్తించారు. 

సూర్యాపేట జిల్లాలో ఐదు మునిసిపాలిటీల పరిధిలో 141 వార్డులు ఉన్నాయి. వీటిలో ప్రతి చోటా క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాల్సి ఉంది. గ్రామాల్లో కొంత మేర స్థలం లభించే అవకాశం ఉన్నా, పట్టణాల్లో మాత్రం స్థలాల కొరత తీవ్రంగా ఉంది. ఇప్పటి వరకు 475 పంచాయతీలకు 46 ప్రాంతాల్లోనే అధికారులు స్థలాలను గుర్తించారు. గుర్తించిన వాటిలో 31 ప్రాంతాల్లో జూన్‌ 2న క్రీడా మైదానలను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా సూర్యాపేట మునిసిపాలిటీలో 48 వార్డులకు 10 ప్రాంతాల్లో, కోదాడలో 35 వార్డులకు 10చోట్ల స్థలాలను అధికారులు గుర్తించారు. హుజూర్‌నగర్‌ మునిసిపాలిటీలో 28 వార్డులు ఉండగా, ఒక్క చోట కూడా స్థలాన్ని గుర్తించలేదు. తిరుమలగిరి మునిసిపాలిటీలో 15 వార్డులకు రెండు, నేరేడుచర్లలో 15 వార్డులకు  రెండు చోట్ల మాత్రమే క్రీడా మైదానాలకు అధికారులు స్థలాలను ఎంపిక చేశారు. 

నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలో 27పంచాయతీలు ఉన్నాయి. సుమారు 10పంచాయతీల్లో ప్రభుత్వ స్థలాలు ఇతరుల ఆక్రమణలో ఉన్నాయి. మండలంలోని రాయినిగూడెంలో క్రీడా మైదానానికి రెవెన్యూ అధికారులు ఎకరం స్థలం కేటాయించారు. కాగా, క్షేత్రస్థాయిలో ఇక్కడ భూ మి ఇతరుల కబ్జాలో ఉంది. గతంలో ఇదే గ్రామం లో వైకుంఠధామం, డంపింగ్‌యార్డుకు స్థలం ఊరికి సమీపంలో లేకపోవడంతో దూరంగా ఏర్పాటుచేశారు. ప్రస్తుతం గ్రామానికి సమీపంలో క్రీడా మైదానానికి ప్రభుత్వ స్థలం లభించడం ఇబ్బందిగా మారింది. 

ఇప్పటికే గ్రామాలు, పట్టణాల్లో ఉన్న కొద్దిపాటి ప్రభుత్వ భూముల్లో వైకుంఠధామాలు, పల్లె, పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. అవిగాక పలు ప్రాంతాల్లో కమ్యూనిటీ భవనాలు నిర్మించారు. అదే విధంగా పలు ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన పనులు చేపట్టారు. దీంతో క్రీడా ప్రాంగణాలకు స్థలాల ఎంపిక సమస్యగా మారింది. కొన్ని మండలాల్లో రెవెన్యూ అధికారులు రికార్డులను పరిశీలించి గ్రామానికి ఎకరం చొప్పున ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి వివరాలను ఎంపీడీవోలకు అందజేశారు. అయితే ఎంపీడీవో క్షేత్రస్థాయికి వెళ్లగా, ఆ స్థలాలు ఇతరుల కబ్జాలో ఉన్నా యి. దీంతో ఆక్రమణలను తొలగించడం ఎంపీడీవోలకు కొత్త సమస్య ఏర్పడింది. ఇదిలా ఉండగా, జూన్‌ 3 నుంచి 18వ తేదీ వరకు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ముందుగానే అంటే రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా జూన్‌ 2న ప్రతీ మండలంలో రెండు పంచాయతీలు, మునిసిపాలిటీల్లో కనీసం ఒక్క వార్డులో క్రీడా ప్రాంగణాలను ప్రా రంభించాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా, అందుకోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఉపాధి నిధులతో మైదానాల అభివృద్ధి

గ్రామాల్లో ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స నిధులతో క్రీడా మైదానాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులు కేటాయించిన స్థలాన్నిబట్టి మైదానానికి రూ.3.50లక్షల నుంచి రూ.5.50 లక్షల వరకు వ్యయం చేయనున్నారు. స్థలాలను శుభ్రం చేసేందుకు ఉపాధి హామీ కూలీలను వినియోగించి, ఉపాధి హామీ పథకం నుంచి నిధులు ఖర్చు చేస్తారు. పెద్ద చెట్లు, బండలు ఉంటే ఎక్స్‌కవేటర్‌ సహాయంతో స్థలాన్ని శుభ్రం చేస్తే మాత్రం గ్రామపంచాయతీ నిధులు ఖర్చు చేయాల్సి ఉం టుంది. కాగా, ఇప్పటికే నిధుల కొరతతో పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి. గతంలో పల్లె ప్రగ తి, తదితర కార్యక్రమాల కింద నిర్వహించిన అభివృద్ధి పనులకు ఖర్చు చేసిన నిధులే రావడంలేదని, క్రీడా మైదానాలకు పంచాయతీ నిధులు వినియోగించాలంటే ఎక్కడ నుంచి తేవాలని సర్పంచ్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రీడా ప్రాంగణంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, లాంగ్‌ జంప్‌ తదితర కోర్టులు ఏర్పాటు చేస్తారు. అదే విధంగా వ్యాయామం చేసేందుకు అవసరమైన జిమ్‌ పరికరాలను ఏర్పాటు చేయాలి. మైదానం చుట్టూ ఇనుప కంచె ఏర్పాటుతోపాటు, మొక్కలు నాటి పెంచాల్సి ఉంటుంది.

త్వరలో స్థలాలు గుర్తిస్తాం : సుందరి కిరణ్‌కుమార్‌, సూర్యాపేట డీఆర్‌డీవో

క్రీడా ప్రాంగణాలకు త్వరలో పూర్తిస్థాయిలో స్థలాలు గుర్తిస్తాం. ప్రభుత్వం ఆదేశించిన విధంగా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో 46 చోట్ల స్థలాలు గుర్తించాం. జూన్‌ 2వ తేదీన 31 క్రీడా ప్రాంగణాలను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. క్రీడా ప్రాంగణాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువతకు ఉపయోగకరంగా మారనున్నాయి.

స్థలం అనువుగా లేదు : ఎం.యాదయ్య, పాలడుగు సర్పంచ్‌, మోత్కూరు మండలం

పాలడుగు గ్రామంలో క్రీడా మైదానం, బృహత్‌ ప్రకృతి వనం కోసం గ్రామానికి చాలా దూరంగా, నీటి వసతిలేని, సరైన రహదారి సౌకర్యం లేని భూమిని రెవెన్యూ అధికారులు కేటాయించారు. గతంలో పల్లె ప్రకృతి వనాన్ని అక్కడ కేటాయిస్తేనే ఒక్క మొక్క కూడా బతకలేదు. ఆ తర్వాత గ్రామం పక్కన కేటాయించారు. ఇప్పుడు మళ్లీ అదే స్థలాన్ని చూపుతున్నారు. అధికారులను అడిగితే అక్కడ తప్ప వేరే చోట ప్రభుత్వ భూమి లేదంటున్నారు. ఆ స్థలం క్రీడా మైదానానికి, బృహత్‌ ప్రకృతి వనానికి అనుకూలంగా లేదు. ఈ విషయమై గ్రామపంచాయతీ నుంచి తీర్మానం చేసి ఉన్నతాధికారులకు పంపుతాం.

Updated Date - 2022-05-30T06:45:54+05:30 IST