గ్రూప్‌-1 పరీక్షకు అధికారుల సన్నాహాలు

ABN , First Publish Date - 2022-10-14T05:47:27+05:30 IST

రాష్ట్రం ఆవిర్భావం అనంతరం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎ్‌సపీఎస్‌సీ) తొలిసారిగా నిర్వహిస్తున్న గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీ ప్రిలిమ్స్‌ పరీక్షకు ఉమ్మడి జిల్లా అధికారులు సన్నాహాలు ప్రారంభించారు.

గ్రూప్‌-1 పరీక్షకు అధికారుల సన్నాహాలు

 ఏర్పాట్లలో నిమగ్నం 

ఉమ్మడి జిల్లాలో 96 పరీక్షా కేంద్రాలు, 28,909 మంది అభ్యర్థులు 

భువనగిరి టౌన్‌, అక్టోబరు 13: రాష్ట్రం ఆవిర్భావం అనంతరం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎ్‌సపీఎస్‌సీ) తొలిసారిగా నిర్వహిస్తున్న గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీ ప్రిలిమ్స్‌ పరీక్షకు ఉమ్మడి జిల్లా అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ఈ నెల 16న ప్రిలిమ్స్‌ పరీక్ష ఉండగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 96 కేంద్రాల్లో 28,909 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ప్రిలిమ్స్‌ ర్యాంక్స్‌ ఆధారంగా తదుపరి దశలో మెయిన్స్‌ పరీక్ష నిర్వహిస్తారు. కాగా, ప్రిలిమ్స్‌ పరీక్షకు 15 నిమిషాల నిబంధన అమలుకానుంది. అభ్యర్థులు సొంత జిల్లాలోనే పరీక్ష రాసే అవకాశాన్ని టీఎ్‌సపీఎ్‌ససీ ఈసారి కల్పించింది. సుదీర్ఘ కాలం అనంతరం 503 గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న ఈ పరీక్ష కోసం ఇప్పటికే ఉమ్మడి జిల్లా అభ్యర్థులు కఠోర శ్రమ చేస్తున్నారు.

సీసీ కెమెరాల నిఘాలో

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఉమ్మడి జిల్లాలో సీసీ కెమెరాల నిఘాలో కొనసాగనుంది. పరీక్షా కేంద్రాల గుర్తింపు సమయంలోనే సీసీ కెమెరాలు, పూర్తిస్థాయి మౌలిక వసతులు, తదితర అంశాలను అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. 16వ తేదీ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులను ఉదయం 8.30 నుంచి 10.15 వరకు మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 15నిమిషాల ముందుగానే పరీక్షా కేంద్రాల గేట్లు వేస్తారు. అదేవిధంగా పరీక్ష సందర్భంగా అభ్యర్థుల బయోమెట్రిక్‌ నమోదు చేస్తారు. ప్రతీ గదిలో 24 మంది అభ్యర్థులు పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్విజిలేటర్లు, చీఫ్‌ సూపరింటెండెంట్లు, కేంద్రాల ఆధారంగా రూట్‌ ఆఫీసర్లను నియమించారు. పరీక్ష కొనసాగుతున్నంతసేపు కేంద్రాల సమీపంలోని జీరాక్స్‌, నెట్‌ సెంటర్లను మూసి వేస్తారు. అభ్యర్థులు విధిగా హాల్‌ టికెట్‌, ప్రభుత్వం జారీ చేసిన ఏదేని ఒక గుర్తింపు కార్డు తీసుకువస్తేనే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లో ఉన్న హెల్ప్‌డెస్క్‌ నంబరు 18004251442కు ఫోన్‌ చేయవచ్చు.

503 పోస్టులు

ప్రభుత్వ కార్యాలయాల్లోని 10శాఖల్లో ఖాళీగా ఉన్న 503 పోస్టులను గ్రూప్‌-1 ద్వారా భర్తీ చేయనున్నారు. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లో అభ్యర్థులు సాధించిన ర్యాంక్‌, రిజర్వేషన్‌ రోస్టర్‌ ఆధారంగా భర్తీ చేస్తారు. ప్రిలిమ్స్‌ పరీక్ష ఫలితాలు వచ్చాక మెయిన్స్‌ కోసం టీఎ్‌సపీఎ్‌ససీ షెడ్యూల్‌ ప్రకటిస్తుంది. గ్రూప్‌-1లో ఇంటర్వ్యూ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. 503పోస్టుల్లో డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు 42, డీఎస్పీ(పోలీస్‌) 91, సీపీవో 48, ఆర్డీవో 4, డీపీవో 5, రిజిస్ట్రార్‌ 5, జైళ్లశాఖ డీఎస్పీ 2, సహాయ కార్మిక అధికారి 8, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ 26, గ్రేడ్‌-2 మునిసిపల్‌ కమిషనర్‌ 41, సాంఘిక సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు, జిల్లా అధికారులు 3, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి 5, జిల్లా గిరిజనసంక్షేమశాఖ అధికారి 2, జిల్లా ఉపాధి కల్పన అధికారి 2, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ 20, అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ 38, అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ 40, ఎంపీడీవో పోస్టులు 121 ఉన్నాయి.

Read more