నిఘా నీడలో నృసింహక్షేత్రం

ABN , First Publish Date - 2022-12-30T00:39:26+05:30 IST

యాదగిరీశుడి క్షేత్ర పర్యటనకోసం రాష్ట్రపతి ద్రౌపదీముర్ము రానున్న నేపథ్యంలో పోలీస్‌ బందోబస్తు పటిష్టం చేశారు. ఇంటెలిజెన్స్‌, ఎయిర్స్‌ఫోర్స్‌, స్థానిక పోలీస్‌ బలగాలు అన్నీ ప్రాంతాలను తమ నిఘా నీడలోకి తీసుకున్నాయి. రాష్ట్రపతి మొదటగా దిగే హెలీప్యాడ్‌ ప్రాంతాన్ని పూర్తిగా పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని గ్రౌండ్‌ చుట్టూ ఫెన్సింగ్‌ అమర్చి నిరంతరం నిఘా ఏర్పాటుచేసి పహారా కాస్తున్నారు.

నిఘా నీడలో నృసింహక్షేత్రం
ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న రాచకొండ కమిషనర్‌ భగవత్‌

యాదగిరిక్షేత్రాన్ని సందర్శించనున్న రాష్ట్రపతి

ఏర్పాట్లను పరిశీలించిన రాచకొండ సీపీ మహే్‌షభగవత్‌

మధ్యాహ్నం వరకు ఆంతరంగికంగా నిత్యవిధికైంకర్యాలు

కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌ పూర్తి

యాదగిరిగుట్ట, డిసెంబరు29: యాదగిరీశుడి క్షేత్ర పర్యటనకోసం రాష్ట్రపతి ద్రౌపదీముర్ము రానున్న నేపథ్యంలో పోలీస్‌ బందోబస్తు పటిష్టం చేశారు. ఇంటెలిజెన్స్‌, ఎయిర్స్‌ఫోర్స్‌, స్థానిక పోలీస్‌ బలగాలు అన్నీ ప్రాంతాలను తమ నిఘా నీడలోకి తీసుకున్నాయి. రాష్ట్రపతి మొదటగా దిగే హెలీప్యాడ్‌ ప్రాంతాన్ని పూర్తిగా పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని గ్రౌండ్‌ చుట్టూ ఫెన్సింగ్‌ అమర్చి నిరంతరం నిఘా ఏర్పాటుచేసి పహారా కాస్తున్నారు. అదేవిధంగా కొండపైన రాష్ట్రపతి పర్యటించే ప్రాంతాల్లో పలుమార్లు పర్యటించిన జిల్లా యంత్రాంగం పటిష్ట బందోబస్తుకు చర్యలు చేపట్టింది. కొండపైన, కొండకింద హెలీప్యాడ్‌ ప్రాంతంలో డాగ్‌, బాంబ్‌స్క్వాడ్‌ సిబ్బందితో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. భద్రతాపరమైన చర్యల్లో భాగంగా కొండపైకి శుక్రవారం వేకువజామునుంచి మధ్యాహ్నం వరకు భక్తులను అనుమతించడంలేదని దేవస్థాన అధికారులు ప్రకటించారు.

ఎప్పటికప్పుడు తనిఖీలు

భారత రాష్ట్రపతి యాదగిరిక్షేత్రంలో పర్యటించే సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బలగాలు నిఘాను అప్రమత్తం చేశాయి. కొండపైన, కొండకింద హెలీప్యాడ్‌ ప్రాంతంలో డాగ్‌, బాంబ్‌స్క్వాడ్‌ సిబ్బందితో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అంబులెన్సు, అగ్నిమాపక వాహనాలను సిద్ధం చేశారు. కొండపైన పడమటి దిశలోని వీఐపీ అతిథి గృహం, ప్రెసిడెన్షియల్‌ సూట్‌ విల్లాలను రాష్ట్రపతి విడిది కోసం సిద్ధంచేశారు. రాష్ట్రపతి ప్రధానాలయంలోని స్వయంభువుల దర్శనాలకు వెళ్లే సమయంలో వివిధ శాఖల అధికారులు, అర్చకులకు నిర్ధేశిత సంఖ్యలో కేటాయించిన ప్రాంతంలో మాత్రమే విధులు నిర్వహించే విధంగా ఆదేశాలు జారీ చేసినట్టు ఈవో గీతారెడ్డి తెలిపారు. రాష్ట్రపతికోసం ప్రత్యేకంగా ప్రసాదాలు, రాష్ట్రపతితోపాటు విశిష్ట అతిథులను సత్కరించేందుకు అవసరమైన స్వామివారి శేషవస్త్రాలు సిద్ధం చేసేందుకు సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలిచ్చామని, రాష్ట్రపతి పర్యటన ముగిసే వరకూ కొండపైకి భక్తులను అనుమతించడంలేదని, మధ్యాహ్నం తర్వాత భక్తులకు ఇష్టదైవాల దర్శనాలు, ఆర్జిత సేవల నిర్వహణకోసం అనుమతిస్తామని, సుప్రభాతం మొదలు మధ్యాహ్నం రాజభోగం నివేదన వరకు అన్ని కైంకర్యాలు ఆస్థానపరంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

రాచకొండ సీపీ మహే్‌షభగవత్‌ ఏర్పాట్ల పరిశీలన

యాదగిరిక్షేత్రంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము శుక్రవారం పర్యటించనున్న నేపథ్యంలో రాచకొండ కమిషనర్‌ మహేష్‌ యం.భగవత్‌ గురువారం ఉదయం కొండకింద హెలీప్యాడ్‌, కొండపైన ప్రధానాలయ పరిసర ప్రాంతాల్లో కలియదిరిగి పనుల నిర్వహణ తీరును పరిశీలించారు. కొండకింద హెలీప్యాడ్‌ వద్ద ఏవియేషన్‌, జిల్లా యంత్రాంగంతో ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ పమేలాసత్పథి, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ యంవీ భూపాల్‌రెడ్డిలు ఏవియేషన్‌ బృందం ప్రతినిధులతో ఏర్పాట్లపై సమీక్షించారు. రాష్ట్రపతి పర్యటన యాదగిరిక్షేత్రంలో పూర్తయ్యే వరకూ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు.

కాన్వాయ్‌ ట్రయల్‌రన్‌ పూర్తి

రాష్ట్రపతి సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం నుంచి సహాయక సిబ్బందితో మూడు ప్రత్యేక హెలీక్యాప్టర్లలో యాదగిరికొండకు విచ్చేసిన అనంతరం ఆమె రోడ్డు మార్గంలో మూడో ఘాట్‌రోడ్‌లో కొండపైకి చేరుకుంటారు. ఈ క్రమంలో రాష్ట్రపతి కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌ను నిర్వహించారు. రాష్ట్రపతి కాన్వాయ్‌లో అంబులెన్సు, అగ్నిమాపక, సెక్యూరిటీ వాహనాలతోపాటు సుమారు 22 వాహనాల కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతంగా పూర్తి చేశారు. కొండపైన బాలాలయం ప్రాంతం నుంచి నేరుగా ప్రధానాలయ తిరువీధుల్లోకి కాన్వాయ్‌ వెళ్లింది.

సుమారు గంట పాటు వాహనాల నిలిపివేత

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో గురువారం కాన్వాయ్‌ ట్రయల్‌ నిర్వహించిన సమయంలో సుమారు గంటపాటు కొండపైకి ఎలాంటి వాహనాలను పోలీసు అధికారులు అనుమతించలేదు. భద్రతా కారణాల దృష్ట్యా ఎలాంటి వాహనాలను అనుమతించడంలేదని , ట్రయల్‌ రన్‌ పూర్తయిన అనంతరం భక్తుల వాహనాలను కొండపైకి అనుమతించారు. అయితే ఈ సమయంలో భక్తుల వాహనాలతోపాటు ఆర్టీసీ బస్సులను సైతం అనుమతించకపోవడంతో ఆలయ పరిసర ప్రాంతాలు, దర్శన క్యూలైన్లు, ప్రధానాలయ ముఖమండపం ప్రాంతాలు భక్తుల సంచారం లేక నిర్మానుష్యంగా కనిపించాయి.

1000 మందికిపైగా పోలీసులు..

రాష్ట్రపతి పర్యటించనున్న నేపథ్యంలో రాచకొండ సీపీ మహేష్‌ యం భగవత్‌ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించనున్నారు. సుమారు 1000 మంది పోలీసులు, 200 మంది మహిళా పోలీసులు, 100మంది ఎస్‌ఐలు, 45మంది సీఐలు, 15 మంది ఏసీపీలు, ఆరుగురు డీసీపీలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. నాలుగు ఫైర్‌ ఇంజన్లు, ఒక అంబులెన్సు, 3 బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలతోపాటు సుమారు 22 వాహనాలతో భారీ కాన్వాయ్‌లో రాష్ట్రపతి కొండపైకి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొండపైన పడమటి దిశలోని వీఐపీ అతిథి గృహం వద్దకు చేరుకున్న అనంతరం అతిథిగృహంలో కాసేపు విశ్రాంతి తీసుకుని ఆమె స్వయంభువుల దర్శనాలకు తరలివెళతారు. దేవస్థాన అధికారులు ఆమె కోసం ప్రత్యేకంగా ప్రసాదాలను తయారు చేయిస్తున్నారు.

ఆలయంలో అర్చకులకు ప్రత్యేక విధులు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో శుక్రవారం ద్రౌపదీముర్ము పర్యటన నేపథ్యంలో ప్రధానాలయంతోపాటు ఉపాలయాల చెంత అర్చకులకు ప్రత్యేక విధులను అప్పగించారు. మతపర సిబ్బంది అందరూ విధిగా సంప్రదాయబద్దంగా డ్రెస్‌కోడ్‌లో తెలుపురంగు పంచెలు, భుజంపై ఎరుపు రంగు పండిట్‌ శాలువాతోపాటు ఐడీ కార్డులను ధరించి విధులకు హాజరుకావాలని ఈవో గీతారెడ్డి ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము కొండపైన పడమటి దిశలోని లిఫ్టు ద్వారా ఆలయ తిరువీఽధుల్లోనికి చేరుకుంటారు. లిఫ్టు వద్ద ఇద్దరు ఉప ప్రధానార్చకులు, ముగ్గురు వేదపండితులు, ఉత్తర ద్వారం వద్ద దేవస్థాన ప్రధానార్చకులు నల్లన్‌థిఘళ్‌ లక్ష్మీనరసింహచార్యులతోపాటు ఉపప్రధానార్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతారు. ప్రధానాలయంలోని ముఖమండపంలో అర్చకస్వామి ఆమెకు హారతి అందజేస్తారు. అక్కడి నుంచి గర్భాలయంలోనికి చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు ఇద్దరు ప్రధానార్చకులతోపాటు ఒక ఉపప్రధానార్చకులు, ముఖ్యఅర్చకులు, అర్చకులు ఆమెకు సంకల్పం, సువర్ణ పుష్పార్చన పూజలు జరిపి ఆశీర్వచనం నిర్వహిస్తారు. అనంతరం ఆమె ఆండాళ్‌ అమ్మవారి ఆలయం, ఆళ్వార్‌ సన్నిధిని దర్శించుకుంటారు. అనంతరం ఆలయ ముఖమండపంలో ప్రదానార్చకులతోపాటు ఐదుగురు వేదపండితులు, ఒక ప్రబంధ పారాయణదారుడు చతుర్వేద ఆశీర్వచనం అందజేస్తారు. అనంతరం ఆలయ అష్టభుజి పడమటి వాయువ్య దిశలోని అద్దాల మండపాన్ని సందర్శించి, ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ముందుగా ప్రధానాలయంలోని ముఖమండపంలోని ధ్వజస్థంభం, బలిపీఠంలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.

ఆలయ వైభవ ఫొటోల ప్రదర్శన

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ, పనుల నూతన కట్టడాల, ప్రధానాలయ సప్తరాజగోపురాల విద్యుద్దీపకాంతుల, క్షేత్రాన్ని సందర్శించిన విశిష్ట వ్యక్తులతో కూడిన ఫొటోలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీక్షించేందుకు దేవస్థాన అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం స్టాండ్‌లపై ఫొటోలను అమర్చిన అధికారులు ఆమె తిలకించే విధంగా కొండపైన ప్రత్యేక ప్రాంతంలో నిఘా నేత్రాల నడుమ ఏర్పాటు చేయనున్నారు.

ఉద్ఘాటన అనంతరం తొలి రాష్ట్రపతి

యాదగిరిగుట్ట ఆలయ ఉద్ఘాటన అనంతరం క్షేత్రాన్ని సందర్శించనున్న మొట్టమొదటి రాష్ట్రపతి ద్రౌపదీముర్ము కానున్నారు. ఆలయ పునర్నిర్మాణానికి ముందు నలుగురు భారత రాష్ట్రపతులు బాబూజగ్జీవన్‌రామ్‌, డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌, శంకర్‌దయాళ్‌శర్మ, ప్రణబ్‌ముఖర్జీలు యాదగిరిక్షేత్రాన్ని సందర్శించారు. కాగా గతంలో నలుగురు రాష్ట్రపతులు ఆలయ పునర్నిర్మాణానికి ముందు సందర్శించగా ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ఉద్ఘాటన పర్వాలు ముగిసిన ఎనిమిది నెలల తర్వాత ఈ నెల 30న ద్రౌపదీముర్ము సందర్శించనున్నారు.

గ్రీన్‌రూమ్‌ను పరిశీలించిన కలెక్టర్‌

రాష్ట్రపతి రాక కోసం ముందుగానే విచ్చేసే మంత్రులు, ఎమ్మెల్యేలు, విశిష్ట అథిధులకోసం హెలీప్యాడ్‌ వద్ద గ్రీన్‌ రూమ్‌ను ఆర్‌అండ్‌బీ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ గ్రీన్‌ నిర్మాణాన్ని గురువారం రాత్రి కలెక్టర్‌ పమేలాసత్పథి, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ యంవీ భూపాల్‌రెడ్డిలు పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఈఈ శంకరయ్య, తదితరులున్నారు.

రాష్ట్రపతి పర్యటన సాగుతుందిలా..

. ఉదయం 8.50గంటలకు సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం నుంచి రోడ్డు మార్గంలో విమానాశ్రయానికి ద్రౌపదీముర్ము బయలుదేరతారు.

. 9గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు.

. 9.10: ప్రత్యేక హెలీకాప్టర్‌లో యాదగిరిగుట్టకు బయలుదేరతారు.

. 9.30: యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలీప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు.

. 9.40: హెలీప్యాడ్‌ వద్ద జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధుల స్వాగత సత్కారాల అనంతరం కొండపైకి రోడ్డు మార్గంలో బయలుదేరతారు.

. 9.50: కొండపైకి చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంటారు.

. 10.00: ప్రధానాలయంలోని స్వయంభువుల దర్శనానికి వెళతారు. 30నిముషాల పాటు ప్రధానాలయంలో దర్శనాలు, పూజల్లో పాల్గొంటారు.

. 10.30: కొండపై నుంచి హెలీప్యాడ్‌ వద్దకు రోడ్డు మార్గంలో కాన్వాయ్‌లో వస్తారు.

. 10.40: కొండకింద హెలీప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు.

. 10.50: హెలీక్యాప్టర్‌లో సికింద్రాబాద్‌కు తిరిగి బయలుదేరతారు

. 11.10: బొల్లారం చేరుకుంటారు.

. 11.20: రోడ్డు మార్గంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి బయలుదేరతారు.

. 11.30: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు.

లక్ష్మీనృసింహుడికి శాస్త్రోక్తంగా నిత్యవిధి కైంకర్యాలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో గురువారం నిత్యవిధి కైంకర్యాలను ఆగమ శాస్త్ర రీతిలో వైభవంగా నిర్వహించారు. సుప్రభాతంతో ఆరంభమైన నిత్యపూజలు రాత్రివేళ శయనోత్సవాలతో ముగిశాయి. గర్భాలయంలో కొలువుదీరిన స్వయంభువులకు, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అర్చకులు వేదమంత్రోచ్ఛరణలు, ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాల నడుమ పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో అర్చించారు. ప్రధానాలయ అష్టభుజి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్యతిరుకల్యాణపర్వాలు ఆగమ శాస్త్ర రీతిలో నిర్వహించారు. సాయంత్రంవేళ ప్రధానాలయ ముఖమండపంలో దర్భారు సేవోత్సవం చేపట్టిన అర్చకులు అలంకార వెండి జోడు సేవోత్సవం, సహస్రనామార్చన పూజలు చేశారు. కొండపైన అనుబంధ శివాలయంలో రామలింగేశ్వరసామికి, మహామండపంలో స్ఫటికమూర్తులకు నిత్యవిధి కైంకర్యాలు, నిత్య రుద్రహవన పూజలు స్మార్త సంప్రదాయరీతిలో నిర్వహించారు. యాదగిరీశుడిని హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవల్‌పమెట్‌ కార్పొరేషన్‌ (హడ్కో) చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ పి.రామకృష్ణనాయుడు కుటుంబసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రానున్న వేసవి దృష్ట్యా భక్తులకు ఎండ నుంచి ఉపశమనం కలిగించేందుకు ఆలయ తిరువీధుల్లో కూల్‌ పెయింట్‌ వేయిస్తున్నారు. అయితే అంతకుముందు వేసిన పెయింట్‌ ఎండి పోవడంతో మళ్లీ అదే ప్రాంతంలో పెయింట్‌ను వేస్తున్నారు. కొండపైన పడమటి అష్టభుజి ప్రాకారం వద్ద తాత్కాలిక ఏర్పాట్లతో ప్రచారశాఖ విభాగాన్ని సిద్ధం చేస్తున్నారు.

Updated Date - 2022-12-30T00:39:26+05:30 IST

Read more