సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

ABN , First Publish Date - 2022-02-19T05:42:05+05:30 IST

చేనేత కళాకారులు నూతన సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, ఆధునిక డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలు రూపొందించాలని సెంట్రల్‌ సిల్క్‌బోర్డు

సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న మహదేవయ్య, పక్కన డాక్టర్‌ శ్రీనివాస్‌, సీత దామోదర్‌

 సెంట్రల్‌ సిల్క్‌బోర్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ జోనల్‌ ఇన్‌చార్జి మహదేవయ్య

భూదాన్‌పోచంపల్లి, ఫిబ్రవరి 18: చేనేత కళాకారులు నూతన సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, ఆధునిక డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలు రూపొందించాలని సెంట్రల్‌ సిల్క్‌బోర్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ జోనల్‌ ఇన్‌చార్జి మహదేవయ్య అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలో శుక్రవారం చేనేత కళాకారులు, కార్మికులకు ‘సిల్క్‌ మిలాంజ్‌’ దారంతో చేనేత వస్ర్తాల తయారీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా అంతర్జాతీయ మార్కెటింగ్‌ పోటీని తట్టుకునేలా ఆధునిక డిజైన్లతోపాటు ఎకోఫ్రెండ్లీ రంగులతో వస్త్రాలు రూపొందించాలని సూచించారు. ‘సిల్క్‌ మిలాంజ్‌’ దారంతో సిల్క్‌ వేస్టేజ్‌లోని సిల్క్‌ వైట్‌ 95శాతం, కలర్‌ 5శాతం ఉంటుందని తెలిపారు. చేనేత కళాకారులకు పట్టుచీరలు, ఫ్యాబ్రిక్స్‌ తయారీపై అవగాహన కల్పించారు. సిల్క్‌ మిలాంజ్‌దారంతో పట్టు చీరల ఉత్పత్తి, ఫ్యాబ్రిక్స్‌ తయారు చేయవచ్చన్నారు. నానాటికీ పెరుగుతున్న సిల్క్‌ ధరల కారణంగా తక్కువ పెట్టుబడితో సిల్క్‌ మిలాంజ్‌ దారంతో ఎక్కువ లాభాలు పొందవచ్చని వివరించారు. కేంద్ర చేనేత, జౌళీ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్‌ సిల్క్‌బోర్డు, సెంట్రల్‌ సిల్క్‌ టెక్నలాజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (బెంగళూరు) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో సిల్క్‌ మిలాంజ్‌ దారం రూపకర్త, బెంగళూరుకు చెందిన సైంటిస్ట్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌, పోచంపల్లి అర్బన్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకు చైర్మన్‌ సీత దామోదర్‌, శశికళ, రుద్ర శ్రీశైలం, శివకుమార్‌ పాల్గొన్నారు.   

Read more