నయాపైసా నిధులివ్వని కేంద్రం

ABN , First Publish Date - 2022-10-11T05:45:00+05:30 IST

రాష్ట్రాభివృద్ధికి నిధులివ్వాలని ఎన్నిసార్లు కేంద్రాన్ని కోరినా నయాపైసా ఇవ్వలేదని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు

నయాపైసా నిధులివ్వని కేంద్రం
మునుగోడు మండలం కొరటికల్‌ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న మంత్రి జగదీ్‌షరెడ్డి, పక్కన అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, సీపీఐ, సీపీఎం నేతలు జూలకంటి రంగారెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లింగయ్యయాదవ్‌

ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీష్‌రెడ్డి

మునుగోడు రూరల్‌, అక్టోబరు 10 : రాష్ట్రాభివృద్ధికి నిధులివ్వాలని ఎన్నిసార్లు కేంద్రాన్ని కోరినా నయాపైసా ఇవ్వలేదని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపును కాంక్షిస్తూ కొరటికల్‌, గూడపూర్‌, ఊకొండి, గంగోరిగూడెం, రత్తుపల్లి గ్రామాల్లో వామపక్ష నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి నిధులివ్వడంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రానికి నిధులివ్వని కేంద్రం స్వార్థ రాజకీయాల కోసం ఒక వ్యక్తికి మాత్రం రూ.18 వేల కోట్ల నిధుల కాంట్రాక్టు ఇచ్చిందన్నారు. యాదగిరిగుట్ట క్షేత్రం పునర్నిర్మాణానికి కేంద్రం రూ.100 చందా కూడా ఇవ్వలేదని, రాష్ట్ర నిధులు రూ.1000 కోట్లు వెచ్చించి సీఎం కేసీఆర్‌ ఆలయాన్ని అభివృద్ధి చేశారన్నారు. దేవరకొండ ప్రాంతాలను రూ.50వేలకోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా మిషన్‌ భగీరథ నీటిని అందించి ఈ ప్రాంత ప్రజలను ఫ్లోరోసిస్‌ నుంచి విముక్తి కల్పించిందన్నారు. కాకతీయుల కాలం నాటి చెరువులను మిషన్‌ కాకతీయ పేరుతో చెరువుల పునరుద్ధరించిందన్నారు. 

ప్రతిపక్షంలో ఉండి పోరాడాలి: మోత్కుపల్లి

మాజీ మంత్రి టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ అభివృద్ధి కోసం పార్టీ మారానని చెబుతున్న రాజగోపాల్‌రెడ్డి మాట నిజమైతే ప్రతిపక్షంలో ఉండి పోరాడాలన్నారు. కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన ప్రజాదోహీ రాజగోపాల్‌రెడ్డి అని అన్నారు. మోదీ, అమిత్‌షా ఎదుట ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టడం ఎంటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి రోల్‌మోడల్‌ ఉన్నారు. అందుకోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలన్నారు. 

బీజేపీని ఊపేక్షిస్తే దేశాన్ని అమ్మేస్తారు: జూలకంటి

మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ దేశసంపదను సంపన్నవర్గాలకు అమ్ముకుంటున్నారని, బీజేపీని ఉపేక్షిస్తే దేశాన్ని కూడా అమ్ముకుంటారని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలను కమ్యూనిస్టు పార్టీలను మట్టుబెట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. కాంట్రాక్టు, స్వార్థ ప్రయోజనాల కోసం ఉపఎన్నిక వచ్చిందని, వామపక్షాలు టీఆర్‌ఎస్‌ కలిసి బీజేపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. 

మునుగోడు నుంచే బీజేపీని నిలువరించాలి: పల్లా 

సీపీఐ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ మతోన్మాద ఎజెండాతో విద్వేషాలు రగిలిస్తూ బీజేపీ దక్షిణ భారతదేశంలో విస్తరించాలని చూస్తోందన్నారు. బీజేపీని మునుగోడు నుంచే నిలువరించేందుకు ఉపఎన్నిక వేదిక కావాలన్నారు. చైతన్యవంతమైన నల్లగొండ జిల్లాలో బీజేపీ మోదీ పాచికలు పారవన్నారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసింది నియోజకవర్గ అభివృద్ధి కోసం కాదని, రూ.18 వేల కోట్ల కాంట్రాక్టుల కోసమేనని ఆరోపించారు. 

రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నందుకే నిధులు కేటాయించలేదని రాజీనామా చేసిన రాజగోపాల్‌రెడ్డి మళ్లీ గెలిస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉంటాడే తప్ప అధికార పక్షం ఎమ్మెల్యే కాడని ఆయనతో అభివృద్ధి ఎలా సాధ్యమన్నారు. అధికారంలో ఉన్న టీఆర్‌ఎ్‌సను గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్‌, సీపీఎం నాయకులు తుమ్మల వీరారెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు నారబోయిన రవిముదిరాజ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బండా పురుషోత్తంరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల నాయకులు అనంత లింగస్వామి, అయితగోని లాల్‌ బహుదూర్‌, మందుల సత్యం, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఉన్నారు.

యువతే టీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టుకొమ్మలు 

మర్రిగూడ: యువతే పార్టీకి పట్టుకొమ్మలని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి జగదీ్‌షరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి యువత స్వచ్ఛందంగా టీఆర్‌ఎ్‌సలో చేరుతున్నారని అన్నారు. కార్యక్రమంలో కొండూరు సర్పంచ్‌ కుంభం మాధవరెడ్డి నర్సమ్మ, నర్సింహా, అంజయ్య, యాదయ్య పలువురు ఉన్నారు. 

Read more