నల్లగొండ నిండుకుండ

ABN , First Publish Date - 2022-12-07T00:36:50+05:30 IST

వర్షాలు లేక గతంలో ఒట్టిపోయిన భూములు నేడు పచ్చదనం పరుచుకున్నాయి. పదుల సంఖ్యలో బోర్లు వేసినా భూగర్భజలాలు కానరాక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డ ఘటనలు ఉన్నాయి.

నల్లగొండ నిండుకుండ
నల్లగొండ మండలం మేళ్లదుప్పలపల్లిలో బావిలో పైకి వచ్చిన నీరు

రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో భూగర్భజలాల పెరుగుదల

పెరిగిన వర్షాలు, తగ్గిన బోర్ల వినియోగం

ప్రాజెక్టుల ద్వారా పెరిగిన నీటి సరఫరా

నల్లగొండ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వర్షాలు లేక గతంలో ఒట్టిపోయిన భూములు నేడు పచ్చదనం పరుచుకున్నాయి. పదుల సంఖ్యలో బోర్లు వేసినా భూగర్భజలాలు కానరాక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డ ఘటనలు ఉన్నాయి. ఫ్లోరైడ్‌ మహమ్మారితో యువకులు వృద్ధులుగా, ఎముకలు వంగి జీవచ్ఛవంలా మారారు. ఈ దుర్భర పరిస్థితులు ఇకపై చరిత్రగా మిగిలనున్నాయి. జిల్లాలో ఏటా భూగర్భజలాలు పైపైకి వస్తుండటంతో కరువు ఛాయలు మాయమయ్యాయి. స్వచ్ఛమైన జలాలు ప్రజలు అందుతుండగా, ఫ్లోరైడ్‌ పీడ క్రమంగా కనుమరుగువుతోంది.

సాధారణంగా ఆగస్టు వరకు వర్షాలు ఉంటాయి. అయితే రెండేళ్లుగా సెప్టెంబరు, అక్టోబరు వరకూ వర్షాలు కురుస్తుండడంతో భూగర్భజలాలు పైపైకి వస్తున్నాయి. దీనికి తోడు మూసీ, నాగార్జునసాగర్‌, కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా నిరాటంకంగా పంటల సాగునీరు ఆందుతోంది. ఫలితంగా బోర్ల వినియోగం పెద్ద సంఖ్యలో తగ్గింది. రాష్ట్రంలోనే అత్యధిక 2.11లక్షల బోరు బావులతో ఉన్న నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం వాటి వినియోగం తగ్గింది. దీంతో భూగర్భజలమట్టం పెరిగింది. గత ఏడాది నవంబరు మాసంతో పోలిస్తే 2.41మీటర్ల మేర భూగర్భజలాలు పైకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది భూగర్భజలమట్టం సగటున 0.47మీటర్ల మేర పెరగ్గా, 21 జిల్లాల్లో 0.13మీటర్ల నుంచి 2.41మీటర్ల సగటు నమోదైంది. రాష్ట్రంలో సరాసరి నీటిమట్టం భూఉపరితలం నుంచి 4.50మీటర్లుగా నమోదైంది. 22 జిల్లాల్లో 5మీటర్ల కంటే తక్కువగా నమోదైంది. ఈ ఏడాది అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 2.41మీటర్లు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 1.84, మెదక్‌ జిల్లాలో 1.64, మేడ్చల్‌ జిల్లాలో 1.63, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 1.39మీటర్ల మేర భూగర్భజలాలు పైకి వచ్చాయి.

దేవరకొండలో పైకి.. మిర్యాలగూడలో కిందికి

జిల్లాలో మూడేళ్ల కాలంలో దేవరకొండ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో భూగర్భజలమట్టం పైకి రాగా, మిర్యాలగూడ డివిజన్‌లో మరింత లోతుకు వెళ్లాయి. దేవరకొండ డివిజన్‌లో మూడేళ్లలో నవంబరు మాసంలో 2.50మీటర్ల పైకి భూగర్భజలాలు వచ్చాయి. మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్‌లో నీటి వినియోగం పెరగడంతో నీటిమట్టం మరింత లోతుకు వెళ్లింది. ఇక్కడ 1.3మీటర్ల లోతుకు జలాలు పడిపోయాయి. నల్లగొండ రెవెన్యూ డివిజన్‌లో గత ఏడాదితో పోలిస్తే 0.003మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. మూడేళ్లతో పోలిస్తే 0.79మీటర్ల వృద్ధి కనిపించింది.

జిల్లాలో మూడేళ్లుగా నవంబరు మాసంలో సగటు భూగర్భ జలమట్టం ఇలా

సంవత్సరం జలమట్టం

2020 4.71మీ.

2021 4.13మీ.

2022 4.12మీ.

డివిజన్ల వారీగా మూడేళ్లుగా భూగర్భజలమట్టం

డివిజన్‌ భూగర్భజలమట్టం

2020 2021 2022

దేవరకొండ 6.19మీ. 5.07మీ. 4.61మీ.

మిర్యాలగూడ 2.93మీ. 3.63మీ. 4.23మీ.

నల్లగొండ 4.48మీ. 3.66మీ. 3.69మీ.

బోర్లలో నీళ్లు పెరిగాయి

ప్రస్తుతం బోర్లలో నీళ్లు బాగా పెరిగాయి. చెరువు, కుంటల్లో నీరు ఉండడంతో బోర్లు పోస్తున్నాయి. భూగర్భజలాలు పెరిగాయి. వచ్చే ఎండాకాలంలో కూడా పంటలకు నీటి సమస్య ఉండదు. కరెంటు కూడా నిరంతరాయంగా ఉండడంతో వ్యవసాయానికి నీటి వనరులు ఇబ్బంది లేదు. వరితోపాటు, పత్తి పంటలకు ఢోకాలేదు.

బైరగోని రామచంద్రు, తేళ్లకంటిగూడెం, కనగల్‌ మండలం

Updated Date - 2022-12-07T00:36:55+05:30 IST