లై‘సెన్స్‌’ ఉండాల్సిందే

ABN , First Publish Date - 2022-11-19T00:22:03+05:30 IST

ఇన్నాళ్లూ ఎలాంటి అనుమతి లేకున్నా వ్యాపారాలు నిర్వహిస్తున్న ఆహార పదార్థాల విక్రేతలు ఇక తప్పనిసరిగా ఫుడ్‌ సేఫ్టీ లైసెన్సు తీసుకోవాల్సిందే.

 లై‘సెన్స్‌’ ఉండాల్సిందే
సూర్యాపేటలో తనిఖీలు చేస్తున్న అధికారులు(ఫైల్‌)

సూర్యాపేట టౌన్‌, నవంబరు 18 : ఇన్నాళ్లూ ఎలాంటి అనుమతి లేకున్నా వ్యాపారాలు నిర్వహిస్తున్న ఆహార పదార్థాల విక్రేతలు ఇక తప్పనిసరిగా ఫుడ్‌ సేఫ్టీ లైసెన్సు తీసుకోవాల్సిందే. ఇప్పటివరకూ లైసెన్స్‌ మేళాలు, ఆడపాదడపా మాత్రమే తనిఖీలు, చర్యలు చేపట్టిన అధికారులు ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి తనిఖీలు చేయడంతో పాటు నోటీసులు, ఆపై చర్య లకు దిగనున్నారు. తరుచూ హెచ్చరిస్తున్నా పట్టించు కోని వ్యాపారులపై భారీగా జరిమానా విధించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఫుడ్‌ సేఫ్టీలైసెన్సులు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఆహారపదార్థాలు విక్రయించే వారు జిల్లాలో 90 శాతం మంది ఎలాంటి ఫుడ్‌ సేఫ్టీ అనుమతులు లేకుండా కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. అలాంటి వారిపై చర్యల కోసం ట్రేడ్‌ లైసెన్స్‌ పొందిన వారు వివరాలను సైతం ఫుడ్‌సేఫ్టీ అధికారులు సేకరించారు.

జిల్లాలో అత్తెసరు

ఏడాదికి రూ.12 లక్షల ఆదాయం ఉన్న వ్యాపారులు రిజిస్ట్రేషన్‌ ఉన్న వ్యాపారులు రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, రూ.12 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వ్యాపారులు ఫుడ్‌ లైసెన్స్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో లైసెన్స్‌లు తీసుకున్న వారు 800 దాకా ఉండగా, అనధికారికంగా మూడు వేల వరకు ఉంటాయి. అదేవిదం గా రిజిస్ట్రేషన్‌ కేటగిరిలోకి వచ్చే చిరుదుకాణాలకు సం బంధించి 500 వరకు నమోదు చేసుకోగా, వీరు సైతం 3 వేల లోపు ఉన్నట్లు సమాచారం. లైసెన్స్‌ కోసం రూ.2 వేలు చెల్లించాల్సి ఉండగా, రిజిస్ట్రేషన్‌ కోసం రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ప్రధానంగా హోటల్స్‌, స్వీట్‌ హౌజ్‌లు, బేకరీలు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లు, చిరువ్యాపారులు, వైన్స్‌దుకాణాలు తప్పనిసరిగా తీసుకోవాలి. వైన్స్‌షాపులకు సంబంధించి చాలావరకూ లైసెన్స్‌ తీసుకోలేదు. జిల్లాలో 500 వరకు ఓ స్థాయివి ఉండగా, చిన్నాచితక హోటళ్లు చాలానే ఉంటాయి. ఇక నుంచి లైసెన్స్‌లు లేకుంటే రూ.5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే లైసెన్స్‌ లేని వ్యాపార దుకాణాలకు మొదటగా నోటీసులు అందజేస్తున్నారు.

కనబడని నాణ్యతా ప్రమాణాలు

ఆహార పదార్థాలు విక్రయించే వ్యాపారాల్లో నాణ్యత కొరవడింది. లైసెన్సులు తీసుకోకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పరిశుభ్రతపై ఏమాత్రం శ్రద్ధ చూపించడం లేదు. వంటల్లో ఉపయోగించే నూనెలు సైతం నాణ్యతలేనివి వాడుతున్నట్లు తెలుస్తోంది. పేరున్న హోటళ్లలోనూ ఇదే తంతు కొనసాగుతున్నట్లు సమాచారం. అడపాదడపా కేసులు పెట్టడం మినహా ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలేదు. ఏదైనా సంఘటన జరిగితే అప్పటికప్పుడు ఆ హోటళ్లు, బేకరీలపై దాడులు చేయడం ఆహారపదార్థాల శాంపిల్స్‌ను తీసుకోవడం హైదరాబాద్‌కు పంపించడం మినహా మరే చర్యలు తీసుకున్న దాఖలా లేవు.

బేకరీల్లో మరీనూ

పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలకు బేకరీ నిర్వాహకులు తిలోదకాలు ఇస్తున్నారు. సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, తిరుమలగిరి, నేరేడుచర్లతో పాటు మండలకేంద్రాల్లో ఆహారపదార్థాల విక్రయాల్లో బేకరీలదే ప్రధానవాటా. పలుచోట్ల రుచికోసం ఆరోగ్యానికి హానికలిగించే పదార్థాలు వాడుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.

సూర్యాపేటలో ..

ఆహార పదార్థాల్లో నాణ్యతా ప్రమాణాలపై అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో సూర్యాపేట పట్టణంలో గత నెల రోజుల వ్యవధిలో తనిఖీలు చేపట్టి ఏడు దుకాణాలకు జరిమానాలు విధించారు. నోటీసులు అందజేశారు. సుమారు రూ.21 వేల వరకు జరిమానాగా వసూలుచేశారు. సిబ్బంది కొరతతో పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టలేకపోతున్నారు.

ఆహార నాణ్యతపై అవగాహన కల్పిస్తాం

జిల్లాలో ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించడంపై వ్యాపారులకు అవగాహన కల్పిస్తాం. లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు చేసుకునేలా మేళాలు నిర్వహిస్తాం. ఆహార పదార్థాల నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తీసుకుంటాం.

-కల్యాణ్‌చక్రవర్తి, జిల్లా ఆహార నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణ అధికారి

Updated Date - 2022-11-19T00:22:03+05:30 IST

Read more